అక్కాతమ్ముళ్లపై వీధి కుక్కల దాడి

ABN , First Publish Date - 2023-03-26T00:40:09+05:30 IST

వీధి కుక్కల దాడి ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.

అక్కాతమ్ముళ్లపై వీధి కుక్కల దాడి
కుక్కల దాడిలో గాయపడ్డ బాలుడు హేమంత్‌

  • రాత్రి బాలికపై.. ఉదయం బాలుడిపై..

  • గుర్రంగూడ టీచర్స్‌కాలనీలో ఘటన

సరూర్‌నగర్‌, మార్చి 25(ఆంధ్రజ్యోతి): వీధి కుక్కల దాడి ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శనివారం బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని గుర్రంగూడలో అక్కాతమ్ముళ్లపై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి అక్క(బాలిక)పై దాడి చేయగా, ఉదయం తమ్ముడి(బాలుడి)పై దాడి చేసి గాయపరిచాయి.

నాగర్‌కర్నూల్‌ జిల్లా గుడిపల్లికి చెందిన పర్వతాలు, శారద దంపతులు బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ గుర్రంగూడ 7వ డివిజన్‌లోని టీచర్స్‌కాలనీలో ఉంటూ ఇక్కడి ఓ అపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నారు. వారికి ముగ్గురు సంతానం ఉన్నారు. శుక్రవారం రాత్రి వారి కుమార్తె సింధు(9) అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. ఆమెను నారాయణగూడ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుని ఇంటికి తీసుకువచ్చారు. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోకముందే.. శనివారం ఉదయం 7.30గంటల ప్రాంతంలో సింధు తమ్ముడు హేమంత్‌(5) కిరాణా షాపునకు వెళ్తుండగా ఓ వీధి కుక్క బాలుడి వైపు దూసుకొచ్చి దాడి చేసింది. మీదపడి నోటితో, కాళ్లతో బాలుడి తల, వీపు, మెడ భాగాల్లో గాయాలు చేసింది. బాలుడి అరుపులకు అపార్ట్‌మెంట్‌వాసులు బయటకు వచ్చి కుక్కలను తరిమేశారు. అనంతరం బాలుడిని నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. గుర్రంగూడ కార్పొరేటర్‌ గడ్డం లక్ష్మారెడ్డి బాలుడిని ఆస్పత్రిలో పరామర్శించి కుటుంబ సభ్యులకు కొంత నగదు సాయం అందజేశారు.

గొర్రెల మందపై వీధి కుక్కల దాడి

15 గొర్రెలు మృతి

అబ్దుల్లాపూర్‌మెట్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం తారామతిపేటలో గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేసింది. స్థానికులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. తారామతిపేట గ్రామానికి చెందిన జెట్ట మల్లేష్‌కు వంద జీవాలు ఉన్నాయి. గ్రామ సమీపంలోని ఓ పొలం వద్ద మంద ఏర్పాటు చేశాడు. అయితే, శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో మల్లేష్‌ భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. తిరిగి రాత్రి 12 గంటలకు మంద వద్దకు చేరుకున్నాడు. అప్పటికే వీధి కుక్కల గుంపు గొర్రెల మందపై దాడి చేసి 15 గొర్రెలను కరిచి చంపేశాయి. దాడి చేస్తుండడం గమనించిన మల్లేష్‌ కుక్కలను అక్కడి నుంచి తరిమేశాడు. మృతిచెందిన జీవాల విలువ సుమారు లక్ష ఉంటుందని తెలిపాడు. మృతిచెందిన గొర్రెలకు పశువైద్యాధికారి నర్సింహారావు పంచనామా నిర్వహించారు.

Updated Date - 2023-03-26T00:40:09+05:30 IST