Hyderabad City: కోట్లలో ‘స్ర్కాప్‌’ స్కాం!

ABN , First Publish Date - 2023-01-25T10:51:44+05:30 IST

స్ర్కాప్‌ ఆటో (కాలం చెల్లిన ఆటోల తుక్కు) విధానం కొందరు అధికారులు, దళారులకు వరంగా

Hyderabad City: కోట్లలో ‘స్ర్కాప్‌’ స్కాం!

హైదరాబాద్‌ సిటీ: స్ర్కాప్‌ ఆటో (కాలం చెల్లిన ఆటోల తుక్కు) విధానం కొందరు అధికారులు, దళారులకు వరంగా మారింది. తుక్కు చేసినట్లుగా రికార్డుల్లో చూపుతూ.. వాటిని అమ్మేసుకుంటున్నారు. కొందరు అధికారులు, సిబ్బంది ఏళ్ల తరబడి నుంచి కొనసాగిస్తున్న ఈ దందా వెనుక కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదుల నేపథ్యంలో ప్రస్తుతం తాత్కాలికంగా స్ర్కాప్‌ విధానాన్ని ఎత్తివేశారు.

డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే ఆటోలతో వాయు కాలుష్యం, ట్రాఫిక్‌ సమస్యలు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం 2002లో గ్రేటర్‌ పరిధిలో కొత్త ఆటోల రిజిస్ట్రేషన్లను నిలిపేసింది. అప్పటికి ఉన్న సుమారు 65,800 ఆటోలకు మించి పెరగకూడదని నిర్ణయుంచింది. పాత ఆటో ఉండి, దాన్ని స్ర్కాప్‌ చేస్తేనే కొత్త ఆటోకు అనుమతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ఆదేశించింది.

నిషేధం తర్వాత..

గ్రేటర్‌లో ఆటో నిషేఽధం అమలైన తర్వాత సుమారు 20 ఏళ్ల నుంచి లక్షకు పైగా ఆటోలు స్ర్కాప్‌ కోసం రవాణ శాఖ వద్దకెళ్లాయి. నిబంధనల ప్రకారం రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్‌ (ఎంవీఐ) సమక్షంలో ఆ ఆటోలను తుక్కు చేయాలి. వాటి స్థానంలో కొత్త ఆటోలకు అనుమతి (పర్మిట్‌) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, కొందరు ఎంవీఐలు ఆటోలను స్ర్కాప్‌ చేయకుండా ఆటో ఫైనాన్సర్లు, సంఘాల నాయకుల ద్వారా పొరుగు రాష్ట్రాలు, జిల్లాలకు రూ.30 వేల నుంచి రూ.50 వేల చొప్పున విక్రయించి వాటాలు పంచుకుంటున్నట్లు తెలిసింది. స్ర్కాప్‌ చేయాల్సిన ఆటో చాసిస్‌ నెంబర్‌ను జాగ్రత్తగా తొలగించి వాటిని రికార్డులో పెట్టి వాహనాన్ని అమ్మేస్తున్నట్లు తెలిసింది. కొత్త ఆటోలపై నిషేధాన్ని అవకాశంగా మార్చుకుని పాత ఆటోలను విక్రయిస్తూ రూ. కోట్లు గడిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నత స్థాయి విచారణ జరిపితే వేలాది తుక్కు వాహనాలు రోడ్లపై తిరుగుతున్న విషయం స్పష్టమవుతుందని కొందరు ఆటోడ్రైవర్లు పేర్కొంటున్నారు. దీనిపై రవాణా శాఖ అధికారులను సంప్రదించగా, స్ర్కాప్‌ పాలసీ రాకపోవడంతో సమస్యలు వస్తున్నట్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు.

ప్రమాదాలు జరిగినప్పుడే వెలుగులోకి..

వాస్తవంగా ఆటోలను స్ర్కాప్‌ చేయాలంటే వాహనాన్ని నాలుగు ముక్కలుగా విభజించాక ఫొటోలు తీయాలి. రవాణాశాఖాధికారికి ముక్కలుగా మారిన వాహనాన్ని చూపించాలి. కానీ నగర రవాణా శాఖలోని కొందరు అధికారులు స్ర్కాప్‌ ఆటోలను ముక్కలు చేయకుండా.. అమ్మేస్తున్నారు. ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు, పోలీసుల తనిఖీల్లో ఈ తరహా ఆటోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ స్ర్కాప్‌ వ్యవహారంపై రెండు నెలల క్రితం రవాణా శాఖ జాయింట్‌ కమిషనర్‌కు, రవాణా శాఖ మంత్రికి ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు పట్టించుకోలేదని ఓ యూనియన్‌ నేత ఆరోపించారు.

స్ర్కాప్‌ విధానం పునరుద్ధరించాలి..

హైదరాబాద్‌ సిటీ, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): ఆటోల స్ర్కాప్‌ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ డిమాండ్‌ చేసింది. దీంతో పాటు.. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయాన్ని వందలాది మంది ఆటో డ్రైవర్లు మంగళవారం ముట్టడించారు.

Updated Date - 2023-01-25T10:51:44+05:30 IST