Somesh Kumar out: సోమేశ్‌ ఔట్‌

ABN , First Publish Date - 2023-01-11T03:13:06+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

Somesh Kumar out: సోమేశ్‌ ఔట్‌

ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందే..

ఐఏఎస్‌ల విభజన వివాదంలో హైకోర్టు తీర్పు

క్యాట్‌ తీర్పును కొట్టేసిన డివిజన్‌ బెంచ్‌

ఐఏఎ్‌సలు దేశంలో ఎక్కడైనా పని చేయాలి

కోరుకున్న చోటే వేయాలనే హక్కు లేదు

అప్పీలుకు కూడా అవకాశమివ్వని బెంచ్‌

తక్షణమే అమల్లోకి వచ్చిన హైకోర్టు తీర్పు

సోమేశ్‌ కుమార్‌ను ఏపీకి వెళ్లాలంటూ

వెంటనే రిలీవ్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

మిగతా ఐఏఎస్‌లకూ ఇదే తీర్పు వర్తింపు?

కేసీఆర్‌ ప్రభుత్వంలో సీఎస్‌గా మూడేళ్లుగా చక్రం తిప్పుతున్న సోమేశ్‌ కుమార్‌ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. ధరణి మొదలుకొని పలు కేసీఆర్‌ మార్కు కార్యక్రమాలకు రూపశిల్పిగా ఆయన సర్కారులో కీలకంగా మారారు. అందుకే, కేంద్రం ఆయన్ను ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌కు కేటాయించినా క్యాట్‌ను ఆశ్రయించి కేసీఆర్‌ ఆశీస్సులతో ఎనిమిదేళ్లుగా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. ఆయన్ను తెలంగాణ కేడర్‌లో ఉంచడమే చట్ట విరుద్ధమని హైకోర్టు తేల్చి చెప్పడంతో సోమేశ్‌కు దారులు మూసుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వేగంగా స్పందించి, ఆయన్ను ఏపీకి అప్పగించేసింది. సోమేశ్‌ స్థానం కోసం కేసీఆర్‌ సన్నిహితుడు రామకృష్ణారావు, కేటీఆర్‌ మనసెరిగినడుచుకొనే అర్వింద్‌ కుమార్‌ పోటీ పడుతున్నారు.

హైదరాబాద్‌, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు వెళ్లాల్సిందేనని మంగళవారం హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఉమ్మడి రాష్ట్రంలోని సివిల్‌ సర్వెంట్ల విభజన వివాదానికి ఈ తీర్పుద్వారా ముగింపు పలికింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌ 2016లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ(డీవోపీటీ) 2017లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, జస్టిస్‌ సూరేపల్లి నందాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ సుదీర్ఘంగా విచారించింది. పిటిషనర్‌ అయిన కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ టి.సూర్యకరణ్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఐఏఎస్‌ క్యాడర్‌ రూల్స్‌కు విరుద్ధంగా క్యాట్‌ వ్యవహరించిందని, కేంద్ర ప్రభుత్వం చట్ట ప్రకారం నియమించిన ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలకు విరుద్ధంగా సోమేశ్‌ కుమార్‌ను తెలంగాణకు కేటాయించడం చెల్లదని సొలిసిటర్‌ జనరల్‌ అన్నారు. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అఖిల భారత సర్వీసు అధికారుల విభజనకు మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యూష్‌ సిన్హా కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించిందని. గుర్తు చేశారు. సదరు కమిటీ మార్గదర్శకాల ప్రకారమే అందరు అధికారుల కేటాయింపులు జరిగాయని ప్రస్తావించారు. ఒక్క సోమేశ్‌ కుమార్‌ విషయంలో మార్గదర్శకాలను క్యాట్‌ కొట్టేయడం సరికాదన్నారు. ఉత్తరప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన అగర్వాల్‌ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలు లేవని చెప్పడం సరికాదని, రెండూ వేర్వేరు చట్టాల ప్రకారం ఏర్పాటైన కమిటీలని, రెండూ సమానం కాదని స్పష్టం చేశారు. సోమేశ్‌ కుమార్‌ కోరిన విధంగా రజత్‌ భార్గవ అనే ఐఏఎస్‌ అధికారిని రెండు రాష్ట్రాల మధ్య స్వాపింగ్‌ చేయడం కూడా సాధ్యం కాదన్నారు. రజత్‌ భార్గవ వేరే బ్యాచ్‌కు చెందిన అధికారని, అన్‌రిజర్వుడు క్యాటగిరీలో ఒకే బ్యాచ్‌కు చెందిన అధికారులతో మాత్రమే స్వాపింగ్‌కు అవకాశం ఉంటుందని తేల్చిచెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులు తక్కువగా ఉన్నందున వారికి ఇతర బ్యాచ్‌ల అధికారులతో స్వాపింగ్‌ అవకాశం కల్పించినట్లు తెలిపారు.

మార్గదర్శకాల్లో ఉన్న ఈ నిబంధన వివక్ష కిందకు రాదని, అందరికీ సమాన అవకాశం కల్పించేందుకేనని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీ చివరి సీఎస్‌ అయిన పీకే మహంతి రాష్ట్ర విభజనకు అపాయింటెడ్‌ డే అయిన జూన్‌ 2, 2014కు ఒక్కరోజు ముందు రిటైర్‌ అయ్యారని తెలిపారు. రిటైర్‌మెంట్‌ తేదీ సెలవుదినంగానే గుర్తిస్తారు కాబట్టి.. పీకే మహంతి విభజనకు గురయ్యే అధికారుల జాబితాలో ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. పీకే మహంతిని కావాలనే విభజనకు గురయ్యే అధికారుల జాబితా నుంచి తొలగించారని, అందుకే తాను తెలంగాణకు కాకుండా ఏపీకి వెళ్లాల్సి వచ్చిందనే సోమేశ్‌ కుమార్‌ వాదనను అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తోసిపుచ్చారు. ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో పీకే మహంతి సభ్యుడిగా ఉండటం వల్ల విభజన జాబితాలో ఉన్న సొంత అల్లుడు, కుమార్తె(ఐఏఎ్‌సలు)లకు మేలు చేసేందుకు తనను ఏపీకి పంపారన్న సోమేశ్‌ వాదనను సైతం కొట్టిపారేశారు. ఉమ్మడి రాష్ట్ర సీఎ్‌సగా పీకే మహంతి మార్గదర్శకాలు రూపొందించే కమిటీలో ఉండటం తప్పనిసరి అని చెప్పారు. పీకే మహంతి కేవలం మార్గదర్శకాలు రూపొందించే వరకే ఉన్నారు తప్ప నిజమైన కేటాయింపులు జరిగే నాటికి ఆయన సర్వీ్‌సలో లేరని గుర్తు చేశారు. అఖిల భారత సర్వీసు అధికారులు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సిందేనని, ఫలానా రాష్ట్రంలోనే పని చేస్తానని కోరే చట్టబద్ధమైన హక్కు వారికి లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలో క్యాట్‌ ఇచ్చిన తీర్పు న్యాయ పరిశీలనకు నిలువదని తేల్చిచెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్యాట్‌ ఎదుట ఐఏఎ్‌సల కేటాయింపు కేంద్రం పరిధిలోని అంశమని చెప్పి, హైకోర్టుకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకోవడం ఆక్షేపణీయమని అన్నారు. సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపిస్తూ.. రిజర్వుడు క్యాటగిరీ అధికారులతో సమానంగా అన్‌రిజర్వుడు అధికారులకు స్వాపింగ్‌ అవకాశం లేకపోవడం వివక్ష కిందకు వస్తుందని అన్నారు. ఉమ్మడి రాష్ట్ర చివరి సీఎస్‌ పీకే మహంతికి అపాయింటెడ్‌ డే తర్వాత కూడా 2 నెలల సర్వీసు ఉందని, ఆయన కావాలనే అపాయింటెడ్‌ డేకు ఒక్కరోజు ముందు రిటైర్‌ అయ్యారని ఆరోపించారు. అపాయింటెడ్‌ డే వరకు ఆయన సర్వీసులో ఉన్నారు కాబట్టి ఆయన పేరు కూడా విభజనకు గురయ్యే అధికారుల జాబితాలో ఉండాలని, అలా లేకపోవడం వల్లే సోమేశ్‌ను ఏపీకి కేటాయించారని చెప్పారు. కేడర్‌ విభజన జాబితాలో ఉన్న సొంత కుమార్తె, అల్లుడికి మేలు చేసేలా మహంతి వ్యవహరించారని ఆరోపించారు. ఆయనకు ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటానికి అర్హత లేదన్నారు. ఈ వాస్తవాల నేపథ్యంలోనే క్యాట్‌ సోమేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని.. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ పిటిషన్‌ కొట్టేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ, క్యాట్‌ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న సోమేశ్‌ కుమార్‌ సహా ఇతర అధికారులు తెలంగాణలో కీలక స్థానాల్లో ఉన్నారని, వారి అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని చెప్పారు.

క్యాట్‌ ఆదేశాల విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టును కోరారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఎలాంటి ఫిర్యాదు చేయలేదని గుర్తు చేశారు. ఇరుపక్షాల వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఐఏఎ్‌సలు,

ఐపీఎ్‌సలు దేశంలో ఎక్కడైనా పని చేయాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ వాదనను సమర్థించింది. ప్రత్యూష్‌ సిన్హా కమిటీ మార్గదర్శకాలతో ఏకీభవించింది. పీకే మహంతి ప్రత్యూష్‌ సిన్హా కమిటీలో సభ్యుడిగా ఉండటం సైతం చట్ట సమ్మతమేనని వ్యాఖ్యానించింది. ఆయన కుమార్తె, అల్లుడికి మేలు చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. పీకే మహంతి 2014 ఫిబ్రవరిలోనే ఫిబ్రవరిలోనే రిటైర్‌ అయ్యారని, తర్వాత రాష్ట్ర విభజన అపాయింటెడ్‌ డే(జూన్‌ 2) ముందు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారని తెలిపింది. అన్ని అంశాలను విస్తృతంగా పరిశీలించిన తర్వాత అధికారుల కేటాయింపులో జోక్యం చేసుకుని క్యాట్‌ తప్పు చేసిందని ధర్మాసనం స్పష్టం చేసింది.

ఈ మేరకు సోమేశ్‌ కుమార్‌కు అనుకూలంగా క్యాట్‌ ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ ఆయన ఏపీ క్యాడర్‌కు వెళ్లాల్సిందే అని స్పష్టం చేసింది. అప్పీల్‌ చేసుకునేందుకు వీలుగా మూడు వారాల పాటు తీర్పును సస్పెన్షన్‌లో ఉంచాలన్న సోమేశ్‌ కుమార్‌ తరఫు న్యాయవాదుల విజ్ఞప్తిని సైతం హైకోర్టు తిరస్కరించింది. దీంతో తీర్పు వెంటనే అమలులోకి వచ్చింది. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తరహాలోనే ఏపీకి కేటాయించినా క్యాట్‌ ఆదేశాలతో తెలంగాణలో కొనసాగుతున్న.. తెలంగాణకు కేటాయించినా ఏపీలో కొనసాగుతున్న ఇతర ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులకు సైతం ఇదే తీర్పు వర్తించే అవకాశం ఉంది. క్యాట్‌లో అనుకూల ఆదేశాలు తెచ్చుకున్న ఇతర అధికారులపై సైతం కేంద్రం పిటిషన్‌లు దాఖలు చేసింది.

12 లోపు ఏపీలో రిపోర్టు చేయండి

హైకోర్టు తీర్పు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం శరవేగంగా స్పందించింది. విధుల నుంచి వెంటనే రిలీవ్‌ కావాలంటూ సోమేశ్‌ కుమార్‌ను ఆదేశిస్తూ కేంద్ర శిక్షణ, సిబ్బంది వ్యవహారాల శాఖ(డీఓపీటీ) మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ నెల 12 లోపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని సోమేశ్‌ను ఆదేశించింది.

మూడేళ్లు వెలిగిన సోమేశ్‌

సోమేశ్‌ తెలంగాణ ప్రభుత్వంలో ఒక వెలుగు వెలిగారని చెప్పొచ్చు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అత్యధిక కాలం పని చేసిన సీఎ్‌సగా నిలిచిపోయారు. రాష్ట్రం ఆవిర్భవించిన మొదట్లో సీఎ్‌సగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌ శర్మ రెండున్నరేళ్ల పాటు పని చేశారు. తర్వాత ప్రదీప్‌ చంద్ర నెల రోజులు, ఎస్పీ సింగ్‌ 13 నెలల పాటు సీఎ్‌సగా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం సీఎ్‌సగా నియమితులైన ఎస్‌కే జోషి 23 నెలల పాటు పని చేశారు. తెలంగాణ ఐదో సీఎ్‌సగా 2019 డిసెంబర్‌ 31న పదవీ బాధ్యతలు చేపట్టిన సోమేశ్‌ కుమార్‌ గత డిసెంబర్‌ 30 నాటికి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. మంగళవారం నాటికి ఆయన పదవీ కాలం మూడేళ్ల 11 రోజులు అయ్యింది.

ఎక్కువ కాలం పని చేసిన సీఎ్‌సగా ఆయన ఉండిపోయారు. ఆయన ఈ సంవత్సరం డిసెంబర్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. అంటే ఇంకా ఏడాది పాటే ఆయనకు సర్వీసు మిగిలి ఉంది. ఇంతలో ఏపీకి వెళ్లాల్సి వచ్చింది. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, వాణిజ్య పన్నుల శాఖ వర్గీకరణ, పన్నుల రాబడి పెంపు, ఎక్సైజ్‌ రాబడి పెరుగుదల విషయాల్లో ఆయన కీలక భూమిక పోషించారు. అందుకే ఆయన పట్ల కేసీఆర్‌ గొప్ప గురి. ధరణి పోర్టల్‌ రూపకల్పనలో సోమేశ్‌ భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. ఇటీవల ధరణిపై వెలువడుతున్న విమర్శల నేపథ్యంలో సోమేశ్‌ను లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ధరణి అక్రమాలకు సోమేశ్‌ కారకుడంటూ ఆరోపిస్తున్నాయి.

Updated Date - 2023-01-11T03:14:48+05:30 IST