ఉప్పల్‌లో సిగపట్లు

ABN , First Publish Date - 2023-06-17T14:55:51+05:30 IST

ఉప్పల్‌ బీఆర్‌ఎ్‌సలో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డికి పోటీగా మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మారెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నేత అండదండలతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

ఉప్పల్‌లో సిగపట్లు

బీఆర్‌ఎస్‌ టికెట్‌ రేసులో ముగ్గురు నేతలు

‘సన్నిహితుల’తో జోరుగా మంతనాలు

నియోజకవర్గంలో పోటాపోటీ కార్యక్రమాలు

బర్త్‌డే వేడుకలు, విందులు, వినోదాలతో సందడి వాతావరణం

అనుకూల నేతలతో అన్నీ డివిజన్లలో ముమ్మర ప్రచారం

ఎవరి వెంట ఉండాలో తెలియక కార్యకర్తల అయోమయం

రసవత్తరంగా రాజకీయం

ఉప్పల్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఉప్పల్‌ బీఆర్‌ఎ్‌సలో వర్గపోరు తారస్థాయికి చేరుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డికి పోటీగా మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, బండారి లక్ష్మారెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా యత్నిస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో నేత అండదండలతో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులైన ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డిని నమ్ముకోగా, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ మంత్రి కేటీఆర్‌ ద్వారా టికెట్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సోదరుడైన బండారి లక్ష్మారెడ్డి తనకు సన్నిహితుడైన మంత్రి హరీశ్‌రావుపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి అధికారిక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుండగా, ఆయనకు దీటుగా బండారి లక్ష్మారెడ్డి సేవా కార్యక్రమాలతో పర్యటిస్తున్నారు. తన వెంట కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారిని కాపాడుకుంటూ బీఎల్‌ఆర్‌ ట్రస్టు పేరుతో విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నారు.

ఎమ్మెల్యే వ్యతిరేకుల మచ్చిక

నగర మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ చర్లపల్లి డివిజన్‌ నుంచి తన భార్య బొంతు శ్రీదేవిని గెలిపించుకొని నియోజకవర్గంలో ఉనికి చాటుకున్నారు. మాజీ కార్పొరేటర్లతోపాటు ఎమ్మెల్యేకు అనుకూలంగా లేని కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్లను తన వైపునకు తిప్పుకోవడంలో విజయం సాధించిన ఆయన ఎమ్మెల్యేకు దీటుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ సొంత అజెండాతో జోరుగా పర్యటిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలా ఎవరి ప్రయత్నాలను వారు ముమ్మరం చేస్తున్నారు.

పట్టు కోసం పాకులాట

ఉప్పల్‌ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు, పార్టీ కార్యకర్తలు, నాయకులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డితోపాటు బండారి లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్‌ ఎవరి ప్రయత్నాల్లో వారు నిమగ్నమయ్యారు. కార్యకర్తలు, నాయకులను మచ్చిక చేసుకునేందుకు ముగ్గురు నేతలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. బర్త్‌డే వేడుకలు, టూర్లు, విందులు, తీర్ధయాత్రలు, క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఓటర్లకు దగ్గరవుతున్నారు. ఈ ముగ్గురు నేతలు తమ జన్మదిన వేడుకలను నానా హంగామా చేశారు. బొంతు రామ్మోహన్‌ తన జన్మదిన వేడుకల సందర్భంగా కాప్రా, ఉప్పల్‌ మీదుగా యాదాద్రి ఆలయం వరకు వేలాది మంది కార్యకర్తలతో బస్సుల్లో ర్యాలీగా వెళ్లి అక్కడ విందు ఏర్పాటు చేశారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే బేతి సుభా్‌షరెడ్డి చర్లపల్లిలో ఓ ఫంక్షన్‌హాల్‌లో ఘనంగా బర్త్‌డే వేడుకలు జరుపుకొని కార్యకర్తలకు విందు ఇచ్చారు. బండారి లక్ష్మారెడ్డి మల్లాపూర్‌లోని ఫంక్షన్‌హాల్‌లో భారీగా తన బర్త్‌డే వేడుకలు నిర్వహించి కార్యకర్తలందరికీ విందు ఇచ్చారు. తన బీఎల్‌ఆర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిత్యం పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజలకు అండగా ఉంటాననే భావనను ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

టికెట్‌ ఎవరికోనని కార్యకర్తల అయోమయం

డివిజన్‌లో తన భార్యతో పాగా వేయించి కొందరు కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లను, తెలంగాణ ఉద్యమకారులను తనకు అనుకూలంగా మలుచుకొంటూ మాజీ మేయర్‌ రామ్మోహన్‌ నియోజకవర్గంలో తనకూ పట్టుందని చాటుకుంటున్నారు. మాజీ మేయర్‌గా నగరంతోపాటు ఉప్పల్‌ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరిస్తున్నారు. కేసీఆర్‌ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తిగా టికెట్‌ రేసులో తనకు కలిసొచ్చే అంశాలు భావిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు ఆయన తన మకాంను బంజారాహిల్స్‌ నుంచి ఉప్పల్‌ నియోజకవర్గంలోని చర్లపల్లి డివిజన్‌కు మార్చారు. ముగ్గురు నేతల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు టికెట్‌ ఎవరిని వరిస్తోందోనే అయోమయం చెందుతున్నారు. కొందరు కార్పొరేటర్లు, నాయకులు ముగ్గురితోనూ అనుకూలంగా ఉంటున్నారు. అధిష్ఠానం టికెట్‌ ఎవరికిచ్చినా పనిచేస్తామని చెబుతున్నారు.

Updated Date - 2023-06-17T14:55:51+05:30 IST