బీబీనగర్‌ ఎయిమ్స్‌లో సేవలు, సౌకర్యాలు నిల్‌

ABN , First Publish Date - 2023-03-07T03:17:05+05:30 IST

బీబీనగర్‌ ఎయిమ్స్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు.

బీబీనగర్‌ ఎయిమ్స్‌లో సేవలు, సౌకర్యాలు నిల్‌

నాలుగేళ్లయినా ఆపరేషన్‌ థియేటర్‌, బ్లడ్‌ బ్యాంకు లేవు

వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు

సంగారెడ్డి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): బీబీనగర్‌ ఎయిమ్స్‌ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారిందని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇప్పటివరకు అక్కడ ఆపరేషన్‌ ఽథియేటర్‌, బ్లడ్‌ బ్యాంకు లేవని, డెలివరీలు కూడా జరగవన్నారు. సంగారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఈ-లైబ్రరీ, ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ ప్రారంభోత్సవం, ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మెడికల్‌ కాలేజీ విద్యార్థులతో మాట్లాడుతూ.. బీబీనగర్‌ ఎయిమ్స్‌ బెస్ట్‌ మెడికల్‌ కాలేజీ అని అనుకున్నానని.. ఈ మధ్య సందర్శించిన సందర్భంలో నాలుగేళ్లయినా అక్కడ ఇప్పటివరకు ఆపరేషన్‌ ఽథియేటర్‌, బ్లడ్‌ బ్యాంకు లేవని, డెలివరీలు కూడా జరగవని గుర్తించినట్లు చెప్పారు. అలాగే ప్రాక్టికల్‌ చేసుకునేందుకు సౌకర్యాలు లేవని తమ దృష్టికి తీసుకొస్తే భువనగిరి మెడికల్‌ కాలేజీలో అవకాశం కల్పించామన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌లో వైద్య పరికరాలు, సేవలు, సౌకర్యాలు ఏ మాత్రం లేవన్నారు. 58 ఏళ్లలో కేవలం 3 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైతే, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్లలో 12 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు. సంగారెడ్డిలో త్వరలో మెడికల్‌ ‘పీజీ’ కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులతో మంత్రి మాట్లాడి అక్కడి సౌకర్యాలు, సమస్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్‌ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

Updated Date - 2023-03-07T03:17:05+05:30 IST