కొవిడ్‌ టీకా..లక్ష డోసులు వృథా!

ABN , First Publish Date - 2023-04-03T03:34:57+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ టీకాలు భారీగా వృథా అయ్యా యి. ప్రజలు టీకాలు వేయించుకోవడం దాదాపు గా మరిచిపోయారు.

కొవిడ్‌ టీకా..లక్ష డోసులు వృథా!

4-5 నెలల్లో రూ.10 కోట్ల వ్యాక్సిన్‌ ఎక్స్‌పైర్‌

20 లక్షల డోసులు పంపాలని కేంద్రానికిలేఖ

రెండు వారాలైనా స్పందించని కేంద్ర ప్రభుత్వం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొవిడ్‌ టీకాలు భారీగా వృథా అయ్యా యి. ప్రజలు టీకాలు వేయించుకోవడం దాదాపు గా మరిచిపోయారు. గడిచిన నాలుగైదు నెలల్లో లక్ష కొవిడ్‌ డోసులకు గడువు మీరిపోయింది. ఫలితంగా అవన్నీ వృథా అయిపోయాయి. వైరస్‌ వ్యాప్తి లేకపోవడం, టీకాలపై ప్రజల్లో భయాలు ఎక్కువయ్యాయి. ఇటీవల కేంద్రప్రభుత్వం కూడా టీకాలు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా వంద ల్లో మరణాలు సంభవించినట్లు వెల్లడించిన సం గతి తెలిసిందే. ఈ క్రమంలో జనం టీకాలు వేయించుకోవడం లేదు. గత ఏడాది చివరి నుంచి మార్చి మధ్య మధ్య కాలంలో సుమారు రూ.10 కోట్ల విలువైన వ్యాక్సిన్లు ఎక్స్‌పైరీ అయినట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. వ్యాక్సిన్‌ కేంద్రాలన్నీ కొద్ది నెలలుగా బోసిపోతున్నాయి. విదేశాలకు వెళ్లేవారు, ఉన్నత విద్యా సంస్థల్లో చదివేవారు మాత్రమే తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ కోసం వస్తున్నారని క్షేత్రస్థాయి వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇక టీకా కేంద్రాలకు రోజు మొత్తమ్మీద ఒక్కరో ఇద్దరో వస్తున్నారని, వారి కోసం టీకా వయల్‌ తెరిచి వేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు. కొన్నిసార్లు వయల్‌ ఓపెన్‌ చేసి, వచ్చిన ఒకరిద్దరికి టీకా వేస్తున్నారు. దాంతో ఆ వయల్‌లోని మిగతా డోసులు వృథా అవుతున్నాయి. దీంతో వాటిని డిస్పోజ్‌ చేస్తున్నారు. అంటే టీకాల కంటే వృథా అయ్యేవే ఎక్కువగా ఉంటున్నాయి. ఓ వైపు ఈ పరిస్థితి ఉండగా, మరోవైపు రాష్ట్ర కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోరేజీలో టీకా డోసులు నిండుకున్నాయి. దీంతో రెండు రోజులుగా కొవిడ్‌ బులిటెన్‌లో వ్యాక్సినేషన్‌ వివరాలను వెల్లడించడం లేదు.

ప్రస్తుతం సింగిల్‌ డోసు కూడా లేదు

దేశంలో కొవిడ్‌ పెరిగిపోతోందని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలోని కొవిడ్‌ వ్యాక్సిన్‌ స్టోర్‌లో కరోనా టీకా డోసులు నిండుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వైద్యశాఖ వద్ద ఒక్క డోసు కూడా నిల్వలేదు. దీంతో రెండు రోజులుగా కొవిడ్‌ బులిటెన్‌లో వ్యాక్సినేషన్‌ వివరాలను వెల్లడించడం లేదు. కొవిడ్‌ కట్టడిలో భాగంగా ట్రేసింగ్‌, టెస్టులు, ట్రీట్‌మెంట్‌, వ్యాక్సినేషన్‌ను ముమ్మరం చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కానీ, రాష్ట్రంలో కొవిడ్‌ టీకాలు అయిపోవడంతో గత నెల 17 వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్రానికి లేఖ రాశారు. తక్షణమే తెలంగాణకు 20 లక్షల డోసులు పంపాలని కోరారు. అయితే కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందనా రాలేదని వైద్యవర్గాలు తెలిపాయి. కోల్డ్‌ చైన్‌ పాయింట్లలో వ్యాక్సిన్‌ డోసులు లేకపోవడంతో అవసరం ఉన్నవారికి టీకాలు వేయిలేకపోతున్నట్లు చెప్పాయి. తెలంగాణ ప్రభుత్వం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మిగతా రాష్ట్రాల కంటే చాలా వేగంగా నిర్వహించింది. మొత్తం 7.75 కోట్ల డోసులను పంపిణీ చేసింది. పికాషనరీ టీకాలు మాత్రం ఇంకా 1.71 కోట్ల డోసులను పంపిణీ చేయాల్సి ఉందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం సింగిల్‌ డోసు కూడా అందుబాటులో లేనందున, కనీస అవసరాల మేరకైనా కరోనా టీకాలను కేంద్రం సరఫరా చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి రెండు వారాలు గడిచినా, కేంద్రం టీకాలు పంపకపోవడంపై వైద్యవర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - 2023-04-03T03:35:30+05:30 IST