ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌!

ABN , First Publish Date - 2023-04-06T02:54:06+05:30 IST

చారిత్రక సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కొత్తరూపు సంతరించుకోనుంది.

ఎయిర్‌పోర్ట్‌ను తలదన్నేలా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌!

అందుబాటులోకి రానున్న అధునాతన సౌకర్యాలు

రూ.715 కోట్లతో అభివృద్ధి పనులు

ఎల్లుండి ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): చారిత్రక సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కొత్తరూపు సంతరించుకోనుంది. నిజాం కాలం (1874)లో నిర్మితమైన స్టేషన్‌ ప్రాంగణాన్ని ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దనున్నారు. విదేశీ స్టేషన్ల మాదిరిగా కళ్లు చెదిరే సౌకర్యాలను అందుబాటులోకి తేనున్నారు. ఈమేరకు రూ.715 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఈనెల 8న ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేయబోతున్నారు. దీనికోసం ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సౌత్‌ సెంట్రల్‌ రైల్వేకు కేంద్ర బిందువుగా ఉన్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి 121 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా, గరిష్ఠంగా రోజుకు 1.40 లక్షల మంది, పండుగ రోజుల్లో 1.80 లక్షల మంది ప్రయాణిస్తున్నారు.

2025 అక్టోబరులోగా అందుబాటులోకి..!

ప్రాధాన్యత కలిగిన సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను నవ్యనూతనంగా తీర్చిదిద్దేందుకు నడుంబిగించిన కేంద్రం.. పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎయిర్‌పోర్టు తరహాలో తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇంజనీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) మోడల్‌లో పునర్నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. 2025 అక్టోబరులోగా పనులన్నీంటిని పూర్తిచేసి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ముందుకు సాగుతోంది.

కొత్త సౌకర్యాలివే..

పునరాభివృద్ధి పథకం కింద ఉత్తరం వైపున 22,156 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మూడంతస్తుల కొత్త స్టేషన్‌ భవనం నిర్మించనున్నారు.

దక్షిణం వైపున్న భవనాన్ని జీ+3 అంతస్తులతో విస్తరించనున్నారు. 14,792 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్రయాణికుల సౌకర్యార్థం మొదటి స్థాయిలో 108 మీటర్ల వెడల్పుతో రెండతస్తుల స్కై కాన్కోర్స్‌, సాధారణ ప్రజల కోసం రెండో స్థాయిలో రూఫ్‌టాప్‌ ప్లాజాను నిర్మించనున్నారు.

స్టేషన్‌లో సెల్లార్‌ పార్కింగ్‌ వ్యవస్థతోపాటు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రయాణికుల కోసం టికెట్‌ బుకింగ్‌ కేంద్రాన్ని నిర్మించబోతున్నారు.

ఒక్కో ప్లాట్‌ఫాంపై 2 ఎస్కలేటర్లు క్యాంటీన్‌లు ఏర్పాటు చేయనున్నారు.

దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్‌ చైర్లు అందుబాటులోకి తేనున్నారు.

ఆటో, కారు, బైకులు నేరుగా స్టేషన్‌ వద్దకు వచ్చి తిరిగి బయటకు వెళ్లేందుకు రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

ప్రయాణికులకు సేవలందించేందుకు వైఫై ఏర్పాటు చేస్తున్నారు.

ప్లాట్‌ఫాం-1పై ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే పోలీ్‌సస్టేషన్‌ (జీఆర్‌పీ), ఆర్పీఎఫ్‌ పోలీస్‌ స్టేషన్లకు కూడా కొత్త భవనాలు అందులోనే ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - 2023-04-06T08:29:47+05:30 IST