రెండో ఏఎన్‌ఎంలను పర్మినెంట్ చేయాలి
ABN , First Publish Date - 2023-01-18T00:23:09+05:30 IST
రంగారెడ్డి జిల్లాలో రెండవ ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు.
రాజేంద్రనగర్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లాలో రెండవ ఏఎన్‌ఎంలను వెంటనే పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి యాదయ్య డిమాండ్ చేశారు. 2వ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం శివరాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట తెలంగాణ రాష్ట్ర రెండో ఏఎన్‌ఎంల యూనియన్(ఏఐటీయూసీ అనుబంధం) ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్‌కు వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ, జీవో నెంబర్ 16/2004 ప్రకారం 2016లో పర్మినెంట్ చేయాల్సి ఉండగా, ప్రభుత్వమే ఆటంకాలు సృష్టించి వారిని రెగ్యూలర్ చేయకుండా నిలిపివేసిందన్నారు. 2వ ఏఎన్‌ఎంలకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పని భారం పెంచడంతో పాటు పనిగంటలు కూడా పెంచారన్నారు. ఆన్‌లైన్ వర్క్ పేరుతో 16 గంటల పాటు పనులు చేయించుకుంటున్నారని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం యూనియన్ నాయకురాళ్లు పద్మ, పార్వతి, అరుణ, మరియమ్మ, సంతోష, మమత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.