సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు అరెస్ట్
ABN , First Publish Date - 2023-02-21T04:05:13+05:30 IST
సంధ్య కన్వెన్షన్ ఎండీ సరణాల శ్రీధర్‌రావును ఢిల్లీ పోలీసులు అరెస్టు చే
అమితాబ్ బచ్చన్ బంధువుల ఫిర్యాదుతో
91 సీఆర్‌పీసీ నోటీసులిచ్చిన ఢిల్లీ పోలీసులు
వివరణ ఇవ్వకపోవడంతో అరెస్టు
మూడు రోజుల కస్టడీకి ఢిల్లీ తరలింపు
రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
హైదరాబాద్/సిటీ/రాజేంద్రనగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సంధ్య కన్వెన్షన్ ఎండీ సరణాల శ్రీధర్‌రావును ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఒక సివిల్ వ్యవహారంలో తమను మోసం చేశాడంటూ అమితాబ్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీధర్‌రావు బ్యాంకు ఖాతా లో అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. వాటికి వివరణ ఇవ్వాలంటూ శ్రీధర్‌రావుకు 91 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఆయన స్పందించకపోవడంతో ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో సోమవారం ఉద యం ఢిల్లీ పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టు చేసి, రాజేంద్రనగర్ 13వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. ఆయన్ను ఢిల్లీ తీసుకెళ్లి విచారించడానికి 3 రోజుల పాటు ట్రాన్సిట్ వారెంట్‌పై కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. అదే సమయంలో శ్రీధర్‌రావుకు బెయిల్ ఇవ్వాలని ఆయన న్యాయవాది అభ్యర్థించారు. కేసును పరిశీలించిన మేజిస్ట్రేట్ శ్రీధర్‌రావును తీసుకెళ్లడానికి ఢిల్లీ పోలీసులకు అనుమతి ఇచ్చారు. బెయిల్ కోసం ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని ఆయన తరఫున న్యాయవాదికి సూచించారు. కోర్టు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో శ్రీధర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. తాను అమితాబ్ బచ్చన్ బంధువులను మోసం చేశాననడంలో వాస్తవం లేదన్నారు. తాను ఎవరినీ మోసం చేయలేదన్నారు. తన దగ్గర తగిన సాక్ష్యాధారాలన్నాయని, వాటిని కోర్టుకు సమర్పిస్తానని తెలిపారు.
శ్రీధర్‌రావు సాక్షి మాత్రమే
ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో శ్రీధర్‌రావు ముద్దాయి కాదని, సాక్షి మాత్రమేన ని ఆయన తరఫు న్యాయవాది చెప్పారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని, ఆయన ఆ కేసులో సాక్షి మాత్రమేనన్నారు. జనవరి 12న ఢిల్లీ పోలీసులు 91 సీఆర్‌పీసీ కింద నోటీసులిచ్చి.. సాక్ష్యాధారాలను సమర్పించాలని కోరినట్లు తెలిపారు. శ్రీధర్‌రావు బిజీగా ఉండడంతో సమాధానం ఇవ్వలేకపోయారన్నారు. దీంతో ఢిల్లీ పోలీసులు వారెంట్‌తో వచ్చి, అరెస్ట్ చేశారని తెలిపారు. కాగా, శ్రీధర్‌రావు బిగ్‌బీ అమితాబ్ బంధువులకే కుచ్చు టోపీ పెట్టాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రూ. కోట్లకు పైగా ఆస్తులను ఫోర్జరీ పత్రాలతో విక్రయించారంటూ అమితాబ్ బంధువులు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనే ఆయన్ను అరెస్టు చేశారు.
పక్కరాష్ట్రాల్లోనూ మోసాలు
సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి సెలబ్రిటీల వరకు మోసాలకు పాల్పడ్డ సంధ్య కన్వెన్షన్ ఎండీ శ్రీధర్‌రావు మోసాల చిట్టా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా శ్రీధర్‌రావు బాధితులు ఉన్నారు. ఆయన బాధితుల్లో ప్రస్తుత, మాజీ ప్రభుత్వోద్యోగులు కూడా ఉండడం గమనార్హం. ఎన్నో ఆరోపణలు, లెక్కకు మిక్కిలి ఫిర్యాదులు ఉన్నా కేవలం కొన్ని కేసుల్లోనే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. బెయిల్‌పై బయటకు వచ్చిన శ్రీధర్‌రావును తాజాగా ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడంతో మరోసారి అతని పేరు బయటకు వచ్చింది. వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డ శ్రీధర్‌రావుకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యేల నుంచి మంత్రుల వరకు పరిచయాలు ఉన్న శ్రీధర్‌రావు వారి అండతోనే రెచ్చిపోతున్నాడని వాపోతున్నారు. సినీ రంగంలోనూ అతని బాధితులు ఉన్నట్లు చెబుతున్నారు. శ్రీధర్‌రావుపై తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్రలోనూ చీటింగ్ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్, డెవల్‌పమెంట్, కాంట్రాక్ట్‌లు, ప్రాజెక్టుల పేరుతో శ్రీధర్‌రావు మోసాలకు పాల్పడ్డాడు. గత ఏడాది సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల్లో అరెస్ట్ అయ్యాడు. బెయిల్‌పై విడుదలైన తర్వాత విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. డబుల్ రిజిస్ట్రేషన్ చేసి వందల కోట్ల రూపాయలు మోసం చేశాడన్న అభియోగంపై గత నవంబరులో బెంగళూరు పోలీసులు శ్రీధర్‌రావును అరెస్ట్ చేశారు. ముంబైలోనూ శ్రీధర్‌రావు రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మోసాలకు పాల్పడ్డాడు.
భూవివాదాలే అధికం
ఓ ఆస్తి వివాదానికి సంబంధించి రాయదుర్గం పోలీ్‌సస్టేషన్‌లో చైతన్యకృష్ణమూర్తి అనే వ్యాపారి ఫిర్యాదు చేయగా 2021 నవంబరులో పోలీసులు శ్రీధర్‌రావును అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు. అంతకుముందు 2019లోనూ ఓ భూవివాదం కేసులో అరెస్టయ్యారు. అప్పట్లో ఆయన కంపెనీల్లో ఐటీ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించారు. ఏడాది క్రితం సంధ్య కన్వెన్షన్ సెంటర్ ప్రమోటర్లపై ఈడీ కేసు నమోదు చేసింది. గతేడాది గచ్చిబౌలిలో ఈవెంట్ మేనేజర్‌పై దాడి చేశారన్న ఆరోపణలపై శ్రీధర్‌రావుపై కేసు నమోదైంది. ఆయనపై మొత్తం 17 క్రిమినల్ కేసులు ఉండడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో అత్యధికంగా భూవివాదాలేనని.. అన్నీ సెటిల్ అవుతాయని కోర్టుకు విన్నవించారు. దీంతో ఆయన్ను అరెస్టు చేయరాదంటూ 2021 డిసెంబరులో హైకోర్టు హైదరాబాద్ పోలీసులకు ఆదేశాలిచ్చింది.