స్కూటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుమంటలు చెలరేగి బస్సు, స్కూటర్‌ దగ్ధం

ABN , First Publish Date - 2023-03-31T03:08:46+05:30 IST

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మరణించాడు.

స్కూటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సుమంటలు చెలరేగి బస్సు, స్కూటర్‌ దగ్ధం

చికిత్స పొందుతూ ద్విచక్రవాహనదారుడి మృతి

13 మంది ప్రయాణికులు సురక్షితం

సూర్యాపేట జిల్లాలో ఘటన

మునగాల, మార్చి 30: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో ద్విచక్రవాహనదారుడు మరణించాడు. అయితే, ప్రమాదం జరిగిన తీరు వల్ల మంటలు చెలరేగి ఆ బస్సు, ద్విచక్రవాహనం దగ్ధమయ్యాయి. మంటలు పూర్తిగా వ్యాపించే లోపు బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటికిరావడంతో పెద్ద ముప్పే తప్పింది. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్‌ శివారులోని 65వ జాతీయరహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన మురుగేష్‌ రాజు(52) 34ఏళ్ల క్రితం మునగాల మండలంలోని ఇందిరానగర్‌కు వలస వచ్చాడు. ఆకుపాముల గ్రామ శివారులోని ఓ క్రషర్‌ మిల్లు లో డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజుకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులిద్దరికీ వివాహమైంది. అయితే, ఎప్పట్లాగే గురువారం ఉదయం కూడా రాజు ఇంటి నుంచి తన స్కూటర్‌పై డ్యూటీకి వెళ్తూ రోడ్డు డివైడర్‌ దాటి కోదాడ వైపు మళ్లాడు. అదే సమయంలో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీఎ్‌సఆర్టీసీకి చెందిన ఓ రాజధాని బస్సు.. రాజు ప్రయాణిస్తున్న స్కూటర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రాజు ఎగిరిపడగా.. బస్సు ఆ స్కూటర్‌ను దాదాపు 100 మీటర్లు ఈడ్చుకెళ్లింది. దీంతో మంటలు చెలరేగగా.. గమనించిన డ్రైవర్‌ బస్సును రోడ్డు పక్కన నిలిపాడు. బస్సులోని 13 మంది ప్రయాణికులను వెంటనే బయటికి దించేశారు. విషయం తెలిసి ఘటనా స్థలానికి చేరుకున్న కోదాడ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. కానీ, బస్సు, స్కూటర్‌ అప్పటికే పూర్తిగా దగ్ధమయ్యాయి. మరోపక్క, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రాజును సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇంటి నుంచి బయలుదేరిన 10నిమిషాల లోపే ప్రమాదానికి గురై రాజు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Updated Date - 2023-03-31T03:08:46+05:30 IST