దోస్తుకు దోచిపెట్టిండు

ABN , First Publish Date - 2023-03-26T01:52:27+05:30 IST

దేశ ప్రజలందరికీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అన్నాడు. కానీ, ఆ మొత్తమంతా ఒక్కడి ఖాతాలోనే వేసేశాడు.

దోస్తుకు దోచిపెట్టిండు

ఆ ఒక్కడే ప్రపంచ రెండో కుబేరుడయ్యాడు

ఏటా 2 కోట్ల ఉద్యోగాల హామీ ఏమైంది మోదీ?

నిరుద్యోగ మార్చ్‌ ఆయన ఇంటి ముందు చేయాలి

మీడియా ముందుకురాని అసమర్థ ప్రధాని మోదీ

కోతుల సమస్య తెలంగాణ విపక్షాల్లో ఎక్కువ

పది చాన్స్‌లిచ్చినా కాంగ్రెసోళ్లకు చేతకాలేదు

పేపర్‌ లీకేజీపై చింతిస్తున్నాం: మంత్రి కేటీఆర్‌

పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు కొత్తేం కాదు

బీజేపీ రాష్ట్రాల్లో ఎందరిపై చర్యలు తీసుకున్నారు?

సీబీఐ విచారణ చెత్త: మంత్రి జగదీశ్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశ ప్రజలందరికీ ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని మోదీ అన్నాడు. కానీ, ఆ మొత్తమంతా ఒక్కడి ఖాతాలోనే వేసేశాడు. దాంతో, ఆ ఒక్కడూ ప్రపంచంలోనే రెండో కుబేరుడయ్యాడు. దోస్తుకు మోదీ మొత్తం దోచిపెట్టిండు. ప్రజల చెవిలో పువ్వు పెట్టిండు’’ అని ప్రధాని మోదీపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీపై ఓ టీవీ ఇంటర్వ్యూలో మోదీని అడిగితే.. పకోడీ, బజ్జీలు, ఇడ్లీ అమ్ముకునే వారికి కల్పించినవన్నీ ఉద్యోగాలేనని చెప్పారని, మోదీ మాటలు కోటలు దాటుతాయని, చేతలకొచ్చేసరికి పకోడీలు, బజ్జీలేనని విమర్శించారు. 2022 సంవత్సరానికి రైతుల ఆదాయం డబుల్‌ చేస్తానని మోదీ చెబితే ప్రజల కష్టాలు డబుల్‌ అయ్యాయని మండిపడ్డారు. పెద్ద నోట్లు రద్దు చేసి నల్ల ధనం తీసుకొస్తానన్నాడని, కానీ, నల్లధనమేదని అడిగితే తెల్ల మొహం వేశాడని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని ఒకే ఒక్క అసమర్థ ప్రధాని నరేంద్ర మోదీయేనని విమర్శించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి తనయుడు ప్రశాంత్‌ రెడ్డి ప్రగతి నివేదన పాదయాత్ర ముగింపు సభ శనివారం సాయంత్రం పెద్ద అంబర్‌పేటలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డు పక్కన జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, ‘‘నిరుద్యోగ మార్చ్‌లంటూ ఇక్కడి బీజేపీ నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎనిమిదన్నరేళ్లలో తెలంగాణలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు దేశంలో ఎక్కడైనా జరిగాయా? మోదీ ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నమాట వాస్తవం కాదా? బీజేపీ వాళ్లు నిరుద్యోగుల కోసం ధర్నా చేయడానికి ఇజ్జత్‌, మానం ఉండాలి.

ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తానన్న మోదీ 9 ఏళ్లలో 18 కోట్లకు కనీసం 18 లక్షల ఉద్యోగాలిచ్చిండా? ఇక్కడ సిగ్గులేకుండా ధర్నాలు చేస్తున్న బీజేపీ నాయకులు దమ్ముంటే సమాధానం చెప్పాలి. నిరుద్యోగ మార్చ్‌ బరాబర్‌ చేయాలి. కానీ, దానిని ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలని నమ్మబలికిన ప్రధాని మోదీ ఇంటి ముందు ఢిల్లీలో చేయాలి’’ అని ధ్వజమెత్తారు. బీఎ్‌సఎన్‌ఎల్‌, ఎల్‌ఐసీలను అమ్ముతూ.. లక్షల ఉద్యోగాలకు పాతరేస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు గండికొడుతూ, మా తమ్ముళ్ల నోట్లో మట్టి కొడుతూ నిరుద్యోగ మార్చ్‌ చేస్తే నమ్మడానికి ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదని, హుషారైన తెలంగాణ అని వ్యాఖ్యానించారు. కోతుల సమస్య ఎక్కువగా తెలంగాణలోని ప్రతిపక్షాల్లో ఉందని, కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్లు ఒక్క చిన్న అంశాన్ని పట్టుకొని చిలువలు, పలువలు చేస్తూ రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. ఒక్క చాన్స్‌ ఇవ్వాలని ప్రజల చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్‌ నాయకులకు ఒకటి, రెండు.. కాదు పది చాన్స్‌లు తెలంగాణ ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. 50 ఏళ్లు అధికారం ఇచ్చినా కరెంటు, తాగునీరు, పరిశ్రమలు తీసుకు రావడం చేతకాలేదని, ఆ రోజు చేతకానోళ్లకు ఇప్పుడు ఒక్క చాన్స్‌ ఇవ్వాలంటే ప్రజలకు చైతన్యం లేదనుకుంటున్నారా? అని నిలదీశారు.

టీఎ్‌సపీఎస్సీ పేపర్‌ లీకేజీపై చింతిస్తున్నాం

టీఎ్‌సపీఎస్సీలో పేపర్ల లీకేజీకి, తద్వారా జరిగిన నష్టానికి బాధ పడుతూ చింతిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. లీకేజీ జరగ్గానే వెంటనే లీకైనా ఎగ్జామ్‌లను రద్దు చేశామని, బాధ్యులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ‘‘వెంటనే రాజీనామా చేయాలని, బర్తరఫ్‌ చేయాలని కొందరూ బేవకూ్‌ఫగాళ్లు మాట్లాడుతున్నారు. ఐటీ, విద్యా శాఖలకు టీఎ్‌సపీఎస్సీతో సంబంధం ఉండదు. అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. టీఎ్‌సపీఎస్సీకి నిధులు, కార్యదర్శి రూపంలో సహకారం మాత్రమే ఉంటుంది. ఈ మాత్రం ఇంగితజ్ఞానం లేనోళ్లు ప్రతిపక్షంలో ఉండడం బాధకరం. తప్పులు జరగరాదనే లీకైన పరీక్షలను రద్దు చేశాం. లోటుపాట్లను సవరించుకొని ముందుకుపోతాం’’ అని వివరించారు. చిల్లరగాళ్లు పన్నే ఉచ్చులో చిక్కుకోవద్దని నిరుద్యోగులకు సూచించారు. ఉద్యోగాలు ఇవ్వడమంటే పిల్లలు బిజీ అయి తమ దగ్గరకు రారంటూ మాట్లాడిన దౌర్భాగ్యులు వాళ్లని, ఉద్యోగ నియామక ప్రక్రియకు పాతరేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. యువకులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రీడింగ్‌ రూమ్‌లు, కోచింగ్‌ సెంటర్లను పెట్టామని, అందులో నిమగ్నమవ్వాలని నిరుద్యోగులకు సూచించారు. చిల్లరగాళ్లను తాము చూసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో అప్పుడే పుట్టిన చంటి బిడ్డ నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, దేశంలో తెలంగాణ రాష్ట్రం తనదైన ముద్ర వేస్తోందని తెలిపారు. పాలన గురించి దేశానికి పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్నామన్నారు.

Updated Date - 2023-03-26T01:52:27+05:30 IST