Revanth Reddy: 8 వేల కోట్ల దోపిడీ
ABN , First Publish Date - 2023-07-14T02:00:46+05:30 IST
‘రైతులకు ఉచిత విద్యుత్తు కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు.
ఉచిత విద్యుత్తుతోనూ కేసీఆర్ దోచేశారు
ఎమ్మెల్యేలు, నేతల భూములకే 10-12 గంటలు.. రైతుల భూములకు 8 గంటలే సరఫరా
పవర్ ప్లాంట్ల విషయంలోనూ అవినీతి.. బషీర్ బాగ్ కాల్పులకు కారణం కేసీఆరే
ఉచిత కరెంట్ కుదరదని టీడీపీతో చెప్పించారు.. త్వరలో మోటార్లకు కేసీఆర్ మీటర్లు
అసలు ఉచిత విద్యుత్తు పేటెంటే కాంగ్రెస్‌ది.. అధికారంలోకి వచ్చాక 24 గంటలూ సరఫరా
వినియోగం ఆధారంగా తెలంగాణకు విద్యుత్తు.. ఇది సోనియా, జైపాల్‌ల కృషి: రేవంత్
80 శాతం సిటింగ్‌లు ఇంటికే.. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌కూ ఓటమే
అందుకే పక్క సెగ్మెంట్ల వెతుకులాట.. తాజా సర్వే రిపోర్టులో తేలింది ఇదే.. రేవంత్ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ‘‘రైతులకు ఉచిత విద్యుత్తు కోసం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రభుత్వం చెబుతోంది. వాస్తవంగా చిన్న, సన్నకారు రైతులకు ఎనిమిది గంటలు మాత్రమే కరెంట్ ఇస్తున్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతల ఫాంహౌ్‌సలు, భూములు ఉన్న ప్రాంతాల్లో 10 నుంచి 12 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలో ఎక్కడా 12 గంటలకు మించి ఉచిత విద్యుత్ సరఫరా కానప్పుడు 16 వేల కోట్లు ఎలా ఖర్చు చేస్తున్నారు!? ఉచిత విద్యుత్తు పేరుతో.. ఆ బడ్జెట్ కింద కేటాయించిన నిధుల్లో సగం డబ్బు.. అంటే ఏడాదికి 8 వేల కోట్ల రూపాయలు సీఎం కేసీఆర్ దోపిడీ చేస్తున్నారు’’ అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పవర్ ప్లాంట్ల విషయంలో 45 వేల కోట్లకు టెండర్లు ఇచ్చి అందులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎక్కడా లేని రేటుకు విద్యుత్తును కొనుగోలు చేస్తున్నారని, కేంద్రం మాట వినకుండా అధిక రేటుకు కొంటున్నారని ఆరోపించారు. తన నివాసంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమెరికాలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణ ప్రభుత్వ పాలసీలపై ప్రశ్నలు అడిగితే కాంగ్రెస్ పార్టీ విధివిధానాలను తాను స్పష్టం చేశానని చెప్పారు. అయితే, తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని కట్ చేసి ప్రచారం చేశారని ఆరోపించారు. ఐటీ మంత్రి కేటీఆర్ అతి తెలివి ప్రదర్శించి చిల్లర వ్యవహారం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదేనని పేర్కొన్నారు. తెలుగుదేశం హయంలో జరిగిన బషీర్ బాగ్ కాల్పుల ఘటన సమయంలోఅప్పటి ప్రభుత్వంలో కేసీఆర్ కీలకంగా ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని తెలుగుదేశంతో చెప్పించిన వ్యక్తి కేసీఆరేనని, ఆనాడు విద్యుత్తు ఉద్యమంలో రైతులను చంపిన పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దేనని ఆరోపించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉచిత విద్యుత్తును అందించిందని, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా సదరు ఫైల్‌పై సంతకం చేశారని గుర్తు చేశారు. అసలు ఉచిత విద్యుత్తు పేటెంట్ కాంగ్రె్‌సదేనన్నారు. ఉచితంగానే కాదు.. నాణ్యమైన విద్యుత్తు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని రేవంత్ చెప్పారు. ఉచిత విద్యుత్తుపై బీఆర్‌ఎ్‌సతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

అసలు ఆ పథకం తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని, రైతులను అన్ని విధాలా ఆదుకొని, వ్యవసాయాన్ని పండుగ చేసింది కాంగ్రెస్ అని చెప్పారు. ఈరోజు తెలంగాణలో విద్యుత్తు వెలుగులు కాంగ్రెస్ వల్లేనన్నారు. ఉచిత విద్యుత్తుతోపాటు రాయితీపై ఎన్నో వ్యవసాయ పనిముట్లు ఇచ్చిందన్నారు. ‘‘రాష్ట్ర విభజన తర్వాత కూడా విద్యుత్తు విషయంలో తెలంగాణకు నష్టం జరగకుండా కాంగ్రెస్ అధిష్ఠానం జాగ్రత్తలు తీసుకుంది. వినియోగం ఆధారంగా తెలంగాణకే ఎక్కువ విద్యుత్తు వచ్చేలా సోనియా గాంధీ చర్యలు తీసుకున్నారు. జనాభా ప్రాతిపదికన పంచితే తెలంగాణకు 38 శాతం మాత్రమే విద్యుత్తు దక్కేది. దాంతో, అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు తెలంగాణలో చీకట్లు కమ్ముకునేవి. అందుకే, జనాభా ప్రాతిపదికన కాకుండా వినియోగం ఆధారంగా విద్యుత్ కేటాయించారు. అందుకే, తెలంగాణకు 53 శాతం, ఏపీకి 47 శాతం కేటాయించారు. ఇందుకు అప్పటి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు కృషి చేశారు’’ అని రేవంత్ రెడ్డి వివరించారు. తాను సొంతంగా వ్యవసాయం చేశానని, దుక్కు దున్నానని, కేటీఆర్‌లా అమెరికాలో బాత్‌రూంలు కడగలేదని మండిపడ్డారు. తాను పాస్‌పోర్ట్ బ్రోకర్ కొడుకుని కాదని, దళారీ కొడుకును కాదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
80 శాతం సిటింగ్‌లు ఇంటికే
‘‘బీఆర్‌ఎ్‌సకు చెందిన 104మంది సిటింగ్ ఎమ్మెల్యేల్లో 80ు మంది ఓడిపోతారని సర్వే రిపోర్టులో తేలింది. అంతే కాదు.. గజ్వేల్‌లో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ కూడా ఓడిపోతారని స్పష్టమైంది. అందుకే కేసీఆర్ పక్క నియోజక వర్గాలను వెతుక్కుంటున్నారు’’అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న సిటింగ్‌లకే బీఆర్‌ఎస్ టికెట్లు ఇస్తానని కేసీఆర్ ఎందుకు చెప్పడంలేదని ప్రశ్నించారు. మగాళ్లయితే సిటింగ్‌లకే టికెట్లు ఇవ్వాలని, లేకుం టే మాడా అని ఒప్పుకోవాలని సవాల్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ప్లస్.. కేసీఆర్ పాలనలో సీ మైనస్
కాంగ్రెస్ హయాంలో మొదటి పది స్థానాల్లో ఉన్న డిస్కమ్‌లు కేసీఆర్ హయాంలో చివరి పది స్థానాల్లోకి పడిపోయాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 24 గంటల ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రె్‌సకు ఎలాంటి శషభిషలు లేవని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని, ఈ మేరకు సెప్టెంబరు 17న విడుదల చేసే మేనిఫెస్టోలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ‘‘మంత్రులు కేటీఆర్, హరీశ్‌ను సూటిగా అడుగుతున్నా.. 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి ఇచ్చిన సవాల్ ను స్వీకరించండి’’ అని రేవంత్ సవాల్ చేశారు. వారి ప్రకటనల తర్వాతే అన్ని సబ్ స్టేషన్ల లాగ్ బుక్కులు సరెండర్ చేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు ఇచ్చారన్నారు. ‘‘కరీంనగర్ చౌరస్తాలో గుమ్మికింద పంది కొక్కు నన్ను ఉరి తీస్తా అని మాట్లాడుతుండు. నేను చంద్రబాబు శిష్యుడినని చెబుతున్నారు.
మరి కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చారు? చంద్రబాబు దగ్గర చెప్పులు మోసిన మీరా నా గురించి మాట్లాడేది. 27.5 లక్షల మోటార్లకు రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించబోతోంది. ఇది నిజం కాదని చెప్పడానికి మీలో ఎవరు వస్తారు?’’ అని బీఆర్‌ఎస్ నాయకులకు రేవంత్ సవాల్ విసిరారు. ఖమ్మం సభతో తాము ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తే.. నిన్న నిరసనలతో బీఆర్‌ఎస్ ప్రారంభించిందని చెప్పారు. బీఆర్‌ఎ్‌సకు కాంగ్రెస్సే ప్రత్యర్థి, ప్రతిపక్షమని ఆ పార్టీ చేపట్టిన నిరసనలు, ధర్నాలతో మరోసారి తేలిపోయిందన్నారు. 24 గంటల విద్యుత్తుపై గతంలో సీబీఐ విచారణ కోరిన లక్ష్మణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని ఆరోపణలు చేసిన మోదీ, షాలు విచారణ ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు.