Rathod Renuka: రేణుక వెనుక పెద్దలెవరైనా ఉన్నారా?
ABN , First Publish Date - 2023-03-15T03:36:14+05:30 IST
టీఎ్‌సపీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్ రేణుక గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇంకెంతమంది నుంచి వసూళ్లు చేశారు?
పరిచయాలే ఆసరాగా రేణుక అక్రమాలు
తల్లి మన్సూర్‌పల్లి బీఆర్‌ఎస్ సర్పంచ్
మహబూబ్‌నగర్, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): టీఎ్‌సపీఎస్సీ ఏఈ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ ఘటనలో కీలక నిందితురాలు రాథోడ్ రేణుక గురించి ఆరా తీసే కొద్దీ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆమె తల్లి లక్ష్మీభాయి మన్సూర్‌పల్లి బీఆర్‌ఎస్ సర్పంచ్ కావడంతో కలిసొచ్చిన రాజకీయ బలం, గురుకుల ఉపాధ్యాయురాలిగా తనకు, టెక్నికల్ అసిస్టెంట్‌గా తన భర్త ఢాక్యానాయక్‌కు ఉన్నతస్థాయి అధికారులతో ఉన్న పరిచయాలను ఉపయోగించి ఆమె లీకేజీకి పూనుకున్నట్లు చర్చ సాగుతోంది. మహబూబ్‌నగర్ జిల్లా గంఢీడ్ మండలానికి చెందిన రేణుక వనపర్తి ఎస్సీ గురుకుల విద్యాలయంలో హిందీ పండిట్‌గా, ఆమె భర్త వికారాబాద్ జిల్లా పరిగిలోని డీఆర్‌డీఏలో పనిచేస్తున్నారు. రేణుక తన సోదరుడు రాజేశ్‌నాయక్‌తో పాటు మన్సూర్‌పల్లి తండాకే చెందిన నీలేశ్, శ్రీను, వికారాబాద్ జిల్లా లగిచర్లకు చెందిన గోపాల్‌కు కూడా ప్రశ్నపత్రం ఇప్పిస్తానని చెప్పింది. ప్రశ్నపత్రం కోసం భర్త సహకారంతో టీఎ్‌సపీస్సీలో పనిచేసే ప్రవీణ్‌ను సంప్రదించినట్లు చెబుతున్నారు.
ఢాక్యా, రేణుక దంపతులకు ఇటు రాజకీయంగా, అటు అధికార వర్గాల్లో సంబంధాలు ఉండడంతో వారిని నమ్మి ఈ అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.10 లక్షల చొప్పున ముట్టజెప్పినట్లు తెలిసింది. తన తమ్ముడి ద్వారా మిగిలిన ముగ్గురిని రేణుక సంప్రదించినట్లు వారి కుటుంబీకులు చెబుతున్నారు. నీలేశ్ తండ్రి లోక్యానాయక్‌ను ‘ఆంధ్రజ్యోతి’ సంప్రదిస్తే తన కొడుకు ఇంజనీరింగ్ చదివి, మహారాష్ట్రలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడని, తమ బంధువులమ్మాయి కావడంతో రేణుకకు డబ్బులిచ్చి ఉంటారని, తన కొడుకు మోసపోయాడని కన్నీటిపర్యంతమయ్యారు. రేణుక వసూళ్ల వ్యవహారం ఈ ముగ్గురికే పరిమితం కాకపోవచ్చనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. అలాగే రేణుక దంపతుల వెనుక ఇంకెవరైనా ఉన్నారా అనే అంశంపైనా దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. రేణుక వ్యవహారం ఆమె స్వగ్రామం మన్సూర్‌పల్లి తండా, భర్త సొంతూరు పంచలింగాల తండాల్లో సంచలనంగా మారింది.