ప్రభుత్వ స్థలాలపై సమాచారం సిద్ధం
ABN , First Publish Date - 2023-02-21T03:15:06+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించి, వాటి మీద ఆదాయాన్ని పెంపొందించే దిశగా సర్కారు తాజాగా దృష్టి సారించింది.
హరీశ్ అధ్యక్షతన త్వరలో సబ్ కమిటీ భేటీ
మార్గదర్శకాల జారీకి నిర్ణయం
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరించి, వాటి మీద ఆదాయాన్ని పెంపొందించే దిశగా సర్కారు తాజాగా దృష్టి సారించింది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు, ఇప్పటికే వారం రోజులగా ఈ విషయంలో కసరత్తు జరుగుతోంది. పత్రాలు లేని ఇళ్ల క్రమబద్ధీకరణతో పాటు యాజమాన్య (సాదాబైనామా కింద) హక్కులు లేని భూములను గుర్తించే ప్రక్రియ, గడచిన ఏడురోజులుగా రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొనసాగింది. ఇప్పటికే జారీ చేసిన 58, 59, 76 జీఓల పరిధిలోకి రాని స్థలాలను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 12విభాగాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అధికారులు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు సీలింగ్ ల్యాండ్, లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమి, నోటరైజ్ చేసిన పట్టా భూమి, సాదాబైనామా పట్టా భూములకు హక్కు పత్రాలు కల్పించనున్నట్లు తెలుస్తోంది.
అనుమతి లేని నిర్మాణాలకు క్రమబద్ధీకరణ, భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించేందుకు చేపట్టే ప్రక్రియకు మార్గదర్శకాలను జారీచేయనున్నారు. ఇందుకోసం వైద్య ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీ్‌షరావు అధ్యక్షతన సబ్ కమిటీ త్వరలోనే ఏర్పాటు కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సాదాబైనామా కింద 5 లక్షల ఎకరాల భూమికి దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. 2014 జూన్ 2 నాటికి తెల్లకాగితంపై కొనుగోలు చేసుకున్న వారు సాదాబైనామాకు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది.గ్రామ కంఠం, ఆబాదీ, సర్కారు భూముల్లో 26వేలకు పైగా నిర్మాణాలు ఉన్నాయని, 13 లక్షల ఇళ్లకు రిజిస్టర్ డాక్యుమెంట్లు లేవని తేల్చింది. వీరు కాక ఎంతమంది ఉన్నారో గుర్తించేందుకు ప్రత్యేక ఫార్మాట్‌లో వివరాలు సేకరించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.