మహిళా జర్నలిస్టులపై పెగాసిస్‌

ABN , First Publish Date - 2023-01-25T01:19:44+05:30 IST

జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైనది కాదని, అయితే చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రంగం అనేకమంది మహిళలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

మహిళా జర్నలిస్టులపై పెగాసిస్‌

‘మీడియా స్ఫియర్‌-2023’లో ఎమ్మెల్సీ కవిత

బేగంపేట, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): జర్నలిజం మహిళలకు అనుకున్నంత సులభమైనది కాదని, అయితే చిత్తశుద్ధితో పనిచేస్తే ఈ రంగం అనేకమంది మహిళలకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మహిళా జర్నలిస్టులపై దాడులు, వేధింపులు జరిగాయని, వీరిని టార్గెట్‌ చేయడం సులభంగా మారిందన్నారు. దేశంలో అనేక మందిపై పెగాసిస్‌ ఉపయోగించారని, ఇందులో మహిళా జర్నలిస్టులే అధికంగా ఉన్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బేగంపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ కళాశాల ఆడిటోరియంలో మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం మంగళవారం ఏర్పాటు చేసిన ‘మీడియా స్ఫియర్‌-2023’ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత క్లాప్‌ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వార్థంతో కాకుండా, సమాజం కోసం చిత్తశుద్ధితో పని చేసినప్పుడే సవాళ్లను ఎదుర్కొగలమని పేర్కొన్నారు. మహిళా జర్నలిస్టులు పలు సంస్థలతో సత్‌సంబంధాలు కలిగి ఉండాలన్నారు. మంచి నిర్ణయాలు తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు.

ప్రస్తుత సమాజంలో యువతులు మాస్‌ కమ్యూనికేషన్‌ రంగంలో ఉపాధి పొందేందుకు ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. ప్రత్యేకించి పురుషాధిక్య సమాజం ఏలుతున్న మీడియా రంగంలో మహిళలు తమను తాము నిరూపించుకునేందుకు భయం లేకుండా సవాళ్లను ఎదుర్కొని, పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. విద్యార్థినుల ఉన్నత చదువుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్ఠాత్మక జర్నలిజం స్కూల్స్‌తో హ్యాండ్‌ షేక్‌ అగ్రిమెంట్లతో పటిష్టమైన నెట్‌వర్క్‌ రూపొందించుకోవాలని కళాశాల యాజమాన్యానికి కవిత సూచించారు. ఈ ఏడాదినుంచి 10 మంది అత్యుత్తమ ప్రతిభ చాటే పేద విద్యార్థులకు కేసీఆర్‌ ఉపకార వేతనాలను ఇచ్చి భారత్‌ జాగృతి ప్రోత్సహిస్తుందన్నారు. మీడియా స్ఫియర్‌ విజేతలుగా నిలిచిన వారు భారత్‌ జాగృతి కోసం బతుకమ్మ, కెమెరా కళ్లతో ఇండియా(ఇండియా త్రూ యువర్‌ లెన్స్‌), మనం ఓటు ఎందుకు వేయాలి (వైవీ షుడ్‌ ఓట్‌) అనే మూడు అంశాలపై సినిమాలు నిర్మించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు చంద్ర వెంపటి, కళాశాల ప్రిన్సిపల్‌ శాండ్రా హోర్బా, వైస్‌ ప్రిన్సిపల్‌ షెర్టీతోపాటు మాస్‌ కమ్యూనికేషన్‌ హెచ్‌.అనిత, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T01:19:57+05:30 IST