Palla Rajeshwar Reddy: రైతు ఆత్మహత్యలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు..
ABN , First Publish Date - 2023-01-30T15:04:46+05:30 IST
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లేని లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, లేని లెక్కలు చెబుతున్నారని బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్సీఆర్బీ (NCRB) 2015లో 1400 మంది రైతులు చనిపోయారని చెప్పిందని, ఆత్మహత్యలు (Suicides) క్రమంగా తగ్గి ఇప్పుడు జీరోకు వచ్చాయన్నారు. రైతు ఆత్మ హత్యలు జరిగినట్లు ఇప్పటి వరకు ఒక్క రైతు సంఘం కూడా ధర్నా చేయలేదన్నారు.
టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) అడిగిన ప్రశ్నకు.. వేగంగా ఆత్మ హత్యలు తగ్గుతున్నాయని కేంద్రమంత్రి తోమర్ (Tomar) సమాధానం చెప్పారని ఈ సందర్బంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. 10 వేల మంది చనిపోయినట్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) బాధ్యతా రహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని నీతిఆయోగ్ చెప్పిందన్నారు. భూ స్వాములకే రైతు బంధు వస్తుందనడం తప్పన్నారు. రాష్ట్రంలో 91 శాతం భూమి సన్న, చిన్న కారు రైతుల వద్ద ఉందని, 50 ఎకరాలకు మించి భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 0.8 శాతం మాత్రమేనని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR)పై దాడి చేసే వారి లెక్కలు చూపాలని, తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలే వారి సంగతి చెబుతారని పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.