పిల్లల వైద్యుడికి పద్మశ్రీ

ABN , First Publish Date - 2023-01-26T04:39:47+05:30 IST

మానసిక ఎదుగుదల లేని పిల్లలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖ పిల్లల వైద్యుడు పసుపులేటి హనుమంతరావుకు వైద్య రంగంలో పద్మశ్రీ వరించింది.

పిల్లల వైద్యుడికి పద్మశ్రీ

వైద్యరంగంలో పురస్కారానికి ఎంపికైన పసుపులేటి హనుమంతరావు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మానసిక ఎదుగుదల లేని పిల్లలకు విశేష సేవలందిస్తున్న ప్రముఖ పిల్లల వైద్యుడు పసుపులేటి హనుమంతరావుకు వైద్య రంగంలో పద్మశ్రీ వరించింది. హనుమంతరావు 1945 సెప్టెంబరు 16న హైదరాబాద్‌ పాతబస్తీలోని మెడికల్‌ ప్రాక్టీషనర్ల కుటుంబంలో జన్మించారు. 1964లో కాకతీయ మెడికల్‌ కాలేజీలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత నీలోఫర్‌ ఆస్పత్రిలో పీడియాట్రిక్స్‌లో ఎండీగా చేశారు. ముంబైలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్‌లో రిహాబిలిటేషన్‌ మెడిసిన్‌లో శిక్షణ పొందారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రిహాబిలిటేషన్‌ సైకాలజీలో పీహెచ్‌డీ చేశారు. 1977లో వికలాంగుల పునరావాసం గురించి సమాజంలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు. మానసిక వికలాంగులకు ప్రత్యేక ఆస్పత్రి ప్రారంభించి ఎందరో పిల్లలకు చేయూతనందించారు. ఆయన స్థాపించిన పలు యూనిట్లతో రోజుకు సుమారు 1700 మంది సేవలు పొందుతున్నారు. మానసిక వికలాంగులకు పునరావాసం కల్పించడంలో ఎంతో కృషి చేశారు. వృద్ధులు, వితంతువులు, నిరుపేదల సంరక్షణ, తదితర రంగాలలో సేవలందిస్తున్నారు. పిల్లల, రిహాబిలిటేషన్‌, సైకాలజీ వైద్యుడిగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందారు. హనుమంతరావుని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించగా... ‘పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. 45 ఏళ్ల కృషికి గుర్తింపు లభించిందనుకుంటున్నా’నని ఆయన అన్నారు.

Updated Date - 2023-01-26T04:40:32+05:30 IST