కీలక బాధ్యతల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులా?

ABN , First Publish Date - 2023-05-02T04:42:33+05:30 IST

‘టీఎ్‌సపీఎస్సీలో ఎక్కువగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు.

కీలక బాధ్యతల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులా?

ఏదైనా జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారు

జనార్దన్‌ రెడ్డి, అనితా రామచంద్రన్‌కు ఈడీ ప్రశ్నలు

10 గంటలకుపైగా విచారణ.. వాంగ్మూలం రికార్డు

ప్రవీణ్‌, రాజశేఖర్‌ విధులు.. ఇతర అంశాలపై ఆరా

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): ‘టీఎ్‌సపీఎస్సీలో ఎక్కువగా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే విధులు నిర్వహిస్తున్నారు. వారికి కీలకమైన బాధ్యతలు ఎలా అప్పజెబుతారు. ఒకవేళ ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ’ అని ఈడీ ఆరా తీసినట్లు తెలిసింది. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎ్‌సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీక్‌ కేసుకు సంబంధించి కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌ రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఈడీ అధికారుల ఎదుట సోమవారం విచారణకు హాజరయ్యారు. ప్రశ్నపత్రాల కేసు దర్యాప్తు జరుపుతున్న సిట్‌ ఇదివరకే వీరిని టీఎ్‌సపీఎస్సీ కార్యాలయంలో విచారించింది. ఈ కేసులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారడం, అభ్యర్థులు విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన నేపథ్యంలో మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. సోమవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో కమిషన్‌ ఛైర్మన్‌, కార్యదర్శి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

రాత్రి పొద్దుపోయే వరకు సుమారు 10 గంటలకుపైగా ఈడీ ప్రత్యేక బృందం వారిని వేర్వేరుగా ప్రశ్నించినట్లు తెలిసింది. కీలక పరీక్షలకు సంబంధించి ప్రశ్నపత్రాల ఎంపిక, తయారీ, భద్రపరచడంలో తీసుకునే జాగ్రత్తలు, పరీక్షల నిర్వహణపైనే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రశ్నపత్రాల లీక్‌లో తప్పిదం ఎక్కడ జరిగిందనేదానిపైనే ప్రధానంగా వివరాలు సేకరించారు. కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌ సంస్థలో ఎప్పుడు చేరారు, వారి పనితీరు, ప్రశ్నపత్రాలు ఎవరెవరి కంప్యూటర్లలో ఉంటాయి..? వాటి పాస్‌వర్డ్‌లు ఎవరు నిర్ణయిస్తారు..? ఇలా అనేక అంశాలపై అధికారులు వివరాలు సేకరించినట్లు తెలిసింది. ప్రశ్నపత్రాలు లీక్‌ అయిన విషయం మొదట ఎలా గుర్తించారు..? పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు, కేసు నమోదైన తర్వాత తీసుకున్న చర్యలు, సంస్థలో పోలీసులు అరెస్ట్‌ చేసిన వారు కాకుండా ఇంకా ఎవరిదైనా నిర్లక్ష్యం ఉన్నట్లు గుర్తించారా..? ఎవరిపైనైనా శాఖాపరమైన చర్యలు తీసుకున్నారా..? వంటి ప్రశ్నలు అడిగి ఛైర్మన్‌, కార్యదర్శి నుంచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌చార్జ్‌ శంకరలక్ష్మితో పాటు అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ సత్యనారాయణకు ఈడీ నోటీసులు జారీ చేసి విచారించింది. విచారణ ఖైదీలుగా జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కోర్టు అనుమతితో ఈడీ అధికారులు విచారించారు. అరెస్టైన నిందితులు, టీఎ్‌సపీఎస్సీ ఉద్యోగులు శంకరలక్ష్మి, సత్యనారాయణ ఇచ్చిన సమాచారం మేరకు టీఎ్‌సపీఎస్సీ ఛైర్మన్‌, కార్యదర్శి నుంచి ఈడీ అధికారులు మరింత సమాచారం రాబట్టి వాంగ్మూలాలు నమోదు చేశారు. కాగా ప్రశ్నపత్రాల లీక్‌ కేసులో సిట్‌ ఇప్పటికే 19 మంది నిందితులను అరెస్ట్‌ చేసింది.

టీఎ్‌సటీఎస్‌, గురుకుల అధికారుల విచారణ...

తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసె్‌స(టీఎ్‌సటీఎస్‌), గురుకుల అధికారులను విచారించిన ఈడీ, వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. ప్రవీణ్‌ టీఎ్‌సటీఎ్‌సలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా చేరి అక్కడి నుంచి డిప్యుటేషన్‌పై టీఎ్‌సపీఎస్సీకి బదిలీ అయ్యాడు. టీఎ్‌సటీఎస్‌ చేపట్టే నియామకాలు, ఇతర ప్రభుత్వ విభాగాలకు కేటాయింపులు.. ఇలా అనేక అంశాలపై టీఎ్‌సటీఎస్‌ అధికారులను ఈడీ ప్రశ్నించినట్లు తెలిసింది. గురుకులంలో హిందీ టీచర్‌గా పనిచేస్తున్న రేణుక విషయంలో అధికారులకు నోటీ్‌సలు జారీ చేసి.. ఆమె నియామకం, ప్రశ్నపత్రాల లీకేజీ సమయంలో విధులకు హాజరయ్యారా..? ఇలా అనేక అంశాలపై అధికారుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.

Updated Date - 2023-05-02T04:42:33+05:30 IST