ఔటర్‌ టోల్‌ ఫీజు పెంపు

ABN , First Publish Date - 2023-03-31T03:36:34+05:30 IST

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ చార్జీలు పెరిగాయి.

ఔటర్‌ టోల్‌ ఫీజు పెంపు

కిలోమీటర్‌కు 4-5% అదనపు భారం

రేపటి నుంచి అమల్లోకి

వాహనదారులకు పెరుగుతున్న భారం

ఓఆర్‌ఆర్‌ అప్పులు తీరినా.. ఏటా వడ్డింపు

హైదరాబాద్‌ సిటీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ చార్జీలు పెరిగాయి. కిలోమీటర్‌కు 4-5ు మేర పెంచుతూ హెచ్‌ఎండీఏలోని హైదరాబాద్‌ గ్రోథ్‌ కారిడార్‌ లిమిటెడ్‌(హెచ్‌జీసీఎల్‌) నిర్ణయించింది. ఈ నిర్ణయం ఏప్రిల్‌ 1(శనివారం) నుంచి అమల్లోకి రానుంది. కార్లు, జీపులు, ఎస్‌యూవీల్లాంటి తేలికపాటి వాహనాలకు(ఎల్‌ఎంవీ) ఇకపై కిలోమీటర్‌కు రూ.2.25 చొప్పున వసూలు చేయనున్నారు. వీటి టోల్‌ చార్జీ గతంలో కిలోమీటర్‌కు రూ.2.01గా ఉండేది. నిజానికి ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు నిర్మాణానికి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం చేసిన వేల కోట్ల రూపాయలు అప్పులు క్రమంగా తీరాయి. అయినా.. ఏటా టోల్‌ చార్జీల పెంపు మాత్రం ఆగడం లేదు. మరోవైపు.. ఓఆర్‌ఆర్‌ను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చేందుకు హెచ్‌జీసీఎల్‌ టెండర్లను ఆహ్వానించింది. టెండర్‌ గడువు శుక్రవారంతో ముగియనుంది. టెండర్‌ నిబంధనల్లో కూడా లీజును దక్కించుకునే సంస్థ ఏటా టోల్‌ చార్జీలను పెంచుకునే వెసులుబాటును కల్పించింది. దీంతో.. ఈ బాదుడు భవిష్యత్‌లో కూడా కొనసాగుతుందని స్పష్టమవుతోంది.

Updated Date - 2023-03-31T03:36:34+05:30 IST