తెరుచుకున్న కంటోన్మెంట్ రోడ్లు
ABN , First Publish Date - 2023-05-01T01:34:28+05:30 IST
కంటోన్మెంట్ పరిధిలోని ప్రజల తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడ్డట్లయింది. ఎట్టకేలకు మిలటరీ అధీనంలోని రోడ్లు తెరుచుకున్నాయి.
అల్వాల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): కంటోన్మెంట్ పరిధిలోని ప్రజల తొమ్మిదేళ్ల నిరీక్షణకు తెరపడ్డట్లయింది. ఎట్టకేలకు మిలటరీ అధీనంలోని రోడ్లు తెరుచుకున్నాయి. దీంతో దాదాపు 3.5లక్షల మంది ప్రయాణికులకు ఊరట కలిగింది. అయితే, ఈనెల 20వ తేదీనే కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ(ఎంఓడీ) కంటోన్మెంట్‌లోని రోడ ్లను తెరవాలని మిలటరీ అథారిటీ (ఎల్‌ఎంఏ)కి ఉత్తర్వులను జారీ చేిసినా రోడ్లను తెరవకపోవడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ‘తెరుచుకోని రోడ్లు-రక్షణశాఖ ఆదేశాలు బేఖాతారు’ శీర్షికతో కథనాలను ప్రచురించింది. స్పందించిన రక్షణశాఖ అధికారులు ఎట్టకేలకు ఆదివారం రోడ్లకు అడ్డంగా 10 అడుగుల ఎత్తులో నిర్మించిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో తొమ్మిదేళ్లుగా మూసేసిన రోడ్లు ఒక్కసారిగా వినియోగంలోకి వచ్చాయి. దీంతో లక్షలాది మందికి, రోజూ జంటనగరాల మధ్య తిరిగే ప్రయాణికులకు వ్యయప్రయాసలు తగ్గనున్నాయి. అల్వాల్ నుంచి కౌకూర్, బాలాజీనగర్, యాప్రాల్‌కు వెళ్లేందుకు మార్గం సులభతరం కానుంది. దాంతో పాటు అక్కడి ప్రజలు నేరుగా రాజీవ్‌రహదారికి వెళ్లేందుకు అవకాశం దక్కింది.
స్వాగతిస్తున్న ప్రజలు..
150 సంవత్సరాలుగా తెరిచి ఉన్న కంటోన్మెంట్ రోడ్డును 2014లో అకస్మాత్తుగా మూసేశారు. దీంతో జంటనగరాలకు రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తాజాగా రోడ్లను తెరవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతోపాటు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
200 కాలనీలకు మేలు
పోత్నీ, బైమ్, రిచర్డ్‌సన్, అమ్ముగూడ, అల్బెన్‌రోడ్లను తెరవడంతో సుమారు 200 కాలనీల ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని అలహాబాద్ గేట్ సమీపంలోని మహేంద్రహిల్స్, మల్కాజిగిరిలోని సఫిల్‌గూడ, అల్వాల్, బొల్లారం, యాప్రాల్, ఏఓసీ సెంటర్, స్విమ్మింగ్‌పూల్ తదితర ప్రాంతాల నుంచి వెళ్లే ప్రజల ఇబ్బందులు తొలుగుతాయి. దాంతోపాటు 200కు పైగా కాలనీలకు ఈ మిలటరీ రోడ్లు డైరెక్ట్‌గా లింకై ఉన్నాయి.
సుదీర్ఘ పోరాటం చేశాం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్లను తెరవాలని దశాబ్దకాలంగా అనేక పోరాటాలు చేశాం. తాజాగా రక్షణ మంత్రిత్వశాఖ(ఎంఓడీ) ఇచ్చిన ఆదేశాలతో స్థానిక మిలటరీ అథారిటీ (ఎల్‌ఎంఏ) ఐదు రోడ్లను తెరవడంతో ప్రజల ఇబ్బందులు తొలిగాయి. ఈ మిలటరీ రోడ్ల మార్గం నుంచి నిత్యం ప్రయాణాలు సాగిస్తుంటారు. 200కు పైగా వివిధ కాలనీల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలిగాయి.
- మైనంపల్లి హనుమంతరావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే
సంబురాలు
తిరుమలగిరి, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): బోల్లారంలోని లక్డావాలా బస్టాప్ వద్ద ఎన్నో ఏళ్లుగా మూసేసిన రిచర్డ్‌సన్ రోడ్డును ఆదివారం రక్షణశాఖ అధికారులు తెరవడంతో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జై ప్రకాష్ ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకొన్నారు. మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవీ బాల్‌రాజ్, తులసీదాస్, ముఖేష్, జవహర్, రాజు, యేసుబాబు పాల్గొన్నారు.