భక్తుడు కనికరిస్తేనే.. కడుపు నిండేది!

ABN , First Publish Date - 2023-03-26T02:33:50+05:30 IST

శోభకృత్‌ నామ సంవత్సరం అందరికి శోభాయమానంగా ఉంటుందని పంచాగ పఠనంలో చెప్పిన అర్చకులు ఉగాది పండగరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి.

భక్తుడు కనికరిస్తేనే.. కడుపు నిండేది!

కానుకలతో కుటుంబ పోషణ..!

అర్చకులు, ఉద్యోగులకు మూడు నెలలుగా అందని వేతనాలు

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : శోభకృత్‌ నామ సంవత్సరం అందరికి శోభాయమానంగా ఉంటుందని పంచాగ పఠనంలో చెప్పిన అర్చకులు ఉగాది పండగరోజు పస్తులు ఉండాల్సిన పరిస్థితి. సమయానికి వేతనాలు అందకపోవడంతో పండగ పూట కుటుంబానికి కొత్త బట్టలు, సరుకులు కొనలేక ఇబ్బంది పడ్డారు. దేవాదాయశాఖలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు నెల నెలా జీతాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొంత కాలంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి అది కూడా ఒక నెల జీతం మాత్రమే చెల్లిస్తున్నారు. సమయానికి జీతాలు అందకపోవడంతో ఆలయానికి వచ్చే భక్తులు సమర్పించే కానుకలతోనే కుటుంబ పోషణ సాగిస్తున్నారు. చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అర్చకులకు ఎంతో కొంత కానుకల రూపంలో ఆర్థిక సహాయం అందుతున్నా ఉద్యోగులకు అది కూడా ఉండదు. దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహించే అర్చకులు, అటెండరు స్థాయి ఉద్యోగులకు నెలకు రూ. 25 వేల నుంచి రూ. 32 వేల వరకు వేతనం చెల్లిస్తున్నారు. ప్రస్తుత అవసరాలకు అంతంత మాత్రంగా సరిపోయే ఆ జీతాలతో కుటుంబాల్ని నెట్టుకొస్తున్నవారికి అవి కూడా సమయానికి అందక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సీనియార్టీ ఎక్కువగా ఉన్న వారికి అందే జీతం కొంత ఎక్కువగానే ఉన్నా... చెల్లింపులు సక్రమంగా లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయశాఖ పరిధిలో 600కుపైగా ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చక, ఉద్యోగులకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ పద్ధతిలో ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తోంది. ఏడాది కాలంగా సమయానికి చెల్లించడం లేదు. గత డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి కేవలం జనవరి వేతనం ఫిబ్రవరిలో చెల్లించారు. డిసెంబరు వేతనం ఎందుకు చెల్లించలేదన్న ప్రశ్నకు అధికారులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. మరో వారం రోజుల్లో మార్చి ముగియనుంది. మార్చితో కలిపితే మూడు నెలల వేతనం అందాల్సి ఉంటుందని... కొంత కాలంగా ఇదే తరహాలో ప్రతి మూడు నెలలకు ఒకసారి నెల వేతనం చెల్లిస్తుండటంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నామని అర్చకులు, ఉద్యోగులు వాపోతున్నారు. విద్యా సంవత్సరం ముగియనుండడంతో పిల్లల ఫీజు బకాయిలు చెల్లించాల్సి ఉందని, ఇంటి అద్దెలు, ఈఎంఐల చెల్లింపుల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగా సిబిల్‌ స్కోరు దెబ్బతిని భవిష్యత్తులో బ్యాంకు రుణాలు తీసుకునే అవకాశం లేకుండా పోతుందంటున్నారు. ‘ దేవాదాయశాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు అందడం లేదు. పండగపూట పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మూడు నెలలకు ఒకసారి నెల జీతం ఇస్తూ రెండు నెలల జీతం పెండింగ్‌లో పెడుతున్నారు. పెద్ద ఆలయాల్లో భక్తులు ఇచ్చే కానుకలతో నెట్టుకొస్తున్నా... చిన్న ఆలయాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది.’’ అని అర్చకుడు ఆనంద్‌ శర్మ తెలిపారు.

Updated Date - 2023-03-26T02:33:50+05:30 IST