పొత్తులుండవు.. ఒంటరిగానే పోటీ

ABN , First Publish Date - 2023-05-02T03:50:54+05:30 IST

తాను ఎమ్మెల్యేగా ఉన్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లం.

పొత్తులుండవు.. ఒంటరిగానే పోటీ

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ గాలి

అన్ని సెగ్మెంట్లలో కమిటీలు: కేసీఆర్‌

బీఆర్‌ఎస్‌లో చేరిన ఆ రాష్ట్ర నేతలు

మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది

అన్ని నియోజకవర్గాల్లో కమిటీలు: కేసీఆర్‌

బీఆర్‌ఎ్‌సలో చేరిన మహారాష్ట్ర నాయకులు

హైదరాబాద్‌, మే 1(ఆంధ్రజ్యోతి): తాను ఎమ్మెల్యేగా ఉన్న తొలినాళ్లలో మహారాష్ట్ర గురించి గొప్పగా చెప్పుకునే వాళ్లం. బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ నుంచి అన్నా హజారే దాకా గొప్ప చైతన్యాన్ని ఈదేశానికి అందించిన మహారాష్ట్ర నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఇప్పుడు మహారాష్ట్రకు నేనే నేర్పుతున్నా. నేర్చుకోవడం, నేర్పడం.. జ్ఞాన సముపార్జనలో భాగం. నాడు తల ఎత్తుకుని చూసిన మహారాష్ట్రను నేడు ఇటువంటి పరిస్థితుల్లో చూడాల్సి రావడానికి అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యపూరిత ధోరణులే కారణం’’ అని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్‌ఎ్‌సలో చేరారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మహారాష్ట్రలో పార్టీ నిర్మాణం, బలోపేతంపై ముఖ్య నేతలతో కేసీఆర్‌ చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటు ద్వారా గ్రామ స్థాయి నుంచి పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయే దిశగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. జూన్‌ 5వ తేదీలోగా గ్రామ గ్రామాన పార్టీ కమిటీలతోపాటు రైతు, విద్యార్థి, యువజన, మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కమిటీలు వేయాలని సూచించారు. ‘‘మహారాష్ట్రలోని పల్లెల్లో బీఆర్‌ఎస్‌ గురించి చర్చ జరుగుతోంది.

ఇన్నాళ్లూ ప్రభుత్వాలను నడిపిన అక్కడి పార్టీలు వారి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయనే విషయాన్ని మరాఠా ప్రజలు గ్రహించారు. అదే సందర్భంలో తెలంగాణ ప్రగతి మోడల్‌ వారిని అమితంగా ఆకట్టుకుంటోంది. మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ గాలి వీస్తోంది’ అని పేర్కొన్నారు. మొదటి దశలో నాగ్‌పూర్‌, ఔరంగాబాద్‌, పుణె, ముంబైలో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశంలోని మానవ వనరులను సక్రమంగా వినియోగించుకుంటే అమెరికా, యూరప్‌ దేశాలను మించిపోతుందని అన్నారు. కానీ, ఈ సంపత్తిని వినియోగించుకునే జ్ఞానం కేంద్రంలోని పాలకులకు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. మహారాష్ట్రలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని, ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్‌ కలలను సాకారం చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్‌ పని చేస్తుందన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని వివరించారు. అవినీతి రహిత పాలన అందిస్తామని చెప్పారు. పార్టీ ప్రచార సామగ్రి సిద్ధమైందని, మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ ప్రభజంనం సృష్టించబోతుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-05-02T03:50:54+05:30 IST