Naveen Case : నవీన్ హత్య కేసులో పిన్ టు పిన్ నిజాలు బయటపెట్టిన నిహారిక..

ABN , First Publish Date - 2023-03-09T13:21:28+05:30 IST

నవీన్ హత్య కేసులో మరో నిందితురాలు నిహారిక విస్తుబోయే నిజాలను బయటపెట్టింది. నవీన్‌తో ప్రేమ నుంచి అతని హత్య వరకూ అన్ని విషయాలనూ వెల్లడించింది. నిహారిక చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

Naveen Case : నవీన్ హత్య కేసులో పిన్ టు పిన్ నిజాలు బయటపెట్టిన నిహారిక..

Hyderabad : నవీన్ హత్య కేసులో మరో నిందితురాలు నిహారిక విస్తుబోయే నిజాలను బయటపెట్టింది. నవీన్‌తో ప్రేమ నుంచి అతని హత్య వరకూ అన్ని విషయాలనూ వెల్లడించింది. నిహారిక చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే.. ‘‘ఇంటర్ చదువుతున్నప్పుడే నవీన్.. నేను ప్రేమించుకున్నాం. మేమిద్దరం చాలా సార్లు మా ఇంట్లో కలుసుకునేవాళ్లం. నవీన్, నేను గొడవ పడితే హరిహర కృష్ణ మాకు సర్ది చెప్పేవాడు. నవీన్‌తో నాకు గొడవ జరిగినప్పుడల్లా హరిహర కృష్ణతో చెప్పుకునే దాన్ని. నవీన్ నాకు దూరం అయ్యాక హరిహర కృష్ణ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నవీన్ నాతో మాట్లాడడం నచ్చని హరి హరికృష్ణ.. ఒకసారి.. ‘నవీన్ ను చంపేసి నిన్ను కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తా’ అని చెప్పాడు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావని నేను మందలిస్తే సరదాగా అన్నాను అన్నాడు.

కొన్ని రోజుల తర్వాత హరిహర కృష్ణ నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి నవీన్‌ను చంపడానికి కొన్న కత్తిని రెండు జాతుల గ్లౌజుల్ని తీసి నాకు చూపించాడు. ఇవి నవీన్‌ను చంపడానికి నాతో చెప్పినా నేను నమ్మలేదు. ఎందుకు అలా మాట్లాడుతున్నావో అలాంటివి చేయకు.. జైలుకు వెళ్తావు. నేను అతనితో మాట్లాడట్లేను కదా.. అతనే నన్ను మరిచిపోతాడు.. అలాంటి పిచ్చి పనులు చేయకు అని హరిని మందలించినాను. దాంతో హరి నేను ఊరికే సరదాకి అన్నానని చెప్పాడు. జనవరి 15న హరి నాకు ఫోన్ చేసి తన స్నేహితులందరూ గెట్ టుగెదర్ పార్టీ 16 జనవరిన చేసుకుంటున్నాము అని చెప్పాడు. నవీన్ కూడా వస్తున్నాడని చెప్పాడు. కానీ వారి పార్టీ క్యాన్సల్ అయ్యందని మరుసటి రోజున నాకు హరి ఫోన్ చేసి చెప్పాడు. ఫిబ్రవరి 17 న ఉదయం 9:40 గంటలకి నవీన్ తన ఫోన్ నుంచి హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హరి నాకు ఫోన్ చేసి నవీన్ వస్తున్న విషయం చెప్పాడు. నవీన్ కాల్ చేస్తే నేను వేరే వాళ్ళతో రిలేషన్ లో ఉన్నానని చెప్పమన్నాడు. నేను కూడా నవీన్ తో అదే విషయం చెప్పాను. ఎందుకు అలా చేస్తున్నావ్ అని నవీన్ అంటుండగానే నేను ఫోన్ కట్ చేశాను.

ఆ తర్వాత హరి నాకు కాల్ చేసి నవీన్ ఇంకా నీతో మాట్లాడడంట అని అంటే నేను సరే అన్నాను. మరుసటి రోజు ఫిబ్రవరి 18న ఉదయం 8 గంటలకు హరి నన్ను కలవాలని నాకు మెసేజ్ చేశాడు. శివరాత్రి రోజున ఉదయం 9:30 కి.. వనస్థలిపురం నాగార్జున స్కూల్ పక్కన ఉన్న గల్లీలో రోడ్డుమీద హరిని కలిశాను. అప్పుడు హరి పాత బట్టలు వేసుకుని రాగా.. ‘ఎందుకు ఇలాంటి బట్టలు వేసుకున్నావు ఎవరివి బట్టలు’ అని అడిగాను. ‘నవీన్‌ని నేను రాత్రి చంపేశాను నా బట్టలకు రక్తం అంటితే హసన్ బట్టలు వేసుకున్నాను. హసన్‌కి కూడా నవీన్ హత్య విషయం చెప్పాను. హసన్‌తో కలిసి నవీన్ అవయవాలు ఉన్న బ్యాగ్‌ని వారి ఇంటికి దూరంగా.. చెట్లలో పడేశాను’ అని నాతో చెప్పాడు. నేను అతనితో ఎందుకు అలా చేసినావు వేరే లాగా మాట్లాడుకుని ఉండొచ్చు కదా అన్నాను. ఆ తర్వాత హరి వరంగల్ వెళ్తాను డబ్బులు కావాలి అని అడిగితే నేను హరికి 1500 ఇచ్చి వెళ్లిపొమ్మని చెప్పాను. ఈ విషయం నేను నవీన్ స్నేహితులకు కానీ.. పోలీసులకు కానీ ఎవరికీ చెప్పలేదు. ఫిబ్రవరి 20వ తేదీన నేను కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం తిరిగి ఇంటికి వెళుతుండగా... హరి నాకు ఫోన్ చేసి ఎల్బీనగర్ బస్టాప్‌లో నన్ను కలిసాడు.

కొద్దిసేపు నాతో మాట్లాడి నవీన్‌ని చంపిన చోటుని... తలపడేసిన చోటుని చూపిస్తానని చెప్పి.. అతని బండిమీద ఎక్కించుకొని బీయన్.రెడ్డి నగర్ మీదుగా సాగర్ కాంప్లెక్స్ దగ్గర చెత్త పడేసిన చోట హరి బట్టలు పడేశానని చూపించాడు. అక్కడి నుండి రాజీవ్ గృహకల్ప దగ్గర బ్యాగు పడేసిన ఏరియాను దాని తర్వాత బ్రాహ్మణపల్లి దగ్గర ఒక కంపెనీ పక్కన నవీన్ తలని అతని ప్యాంటు, కత్తిని, సెల్ ఫోన్ పడేసిన స్థలమని దూరం నుంచి నాకు హరి చూపించాడు. అక్కడి నుండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుమీదుగా వెళ్లి... అబ్దుల్లాపూర్‌మెట్‌లో అమృత ఫ్యామిలీ దాబాలో నేను, హరి ఇద్దరం సాయంత్రం 4:30 గంటలకు బిర్యానీ తిన్నాం. అక్కడి నుంచి తిరిగి వస్తూ నవీన్ ను చంపిన ప్లేస్ ఇటువైపు అని దారిలో నాకు చూపించి.. నన్ను మా ఇంటి దగ్గర దింపేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. నాకు నవీన్ వాళ్ళ ఫ్రెండ్ తరుణ్ కాల్ చేసి... ‘నవీన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నిన్న హైదరాబాద్ కి వాళ్ళ ఇంటర్ ఫ్రెండ్ ని కలవడానికి వచ్చాడు. నీకేమన్నా కలిసిండా’ అని అడిగాడు. నాకేం తెలియదని చెప్పా. అయినా కూడా అతను మళ్లీ నన్ను ‘మీ కామన్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారంట.. అతని ఫోన్ నెంబర్ ఇవ్వు’ అని అడిగితే హరి నంబర్ మెసేజ్ చేశా.

ఫిబ్రవరి 21న ఉదయం 10 గంటలకు నవీన్ వాళ్ళ మామ.. హరికి ఫోన్ చేసి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇద్దాము రమ్మని తనను పిలిచారని హరి నాతో చెప్పాడు. అప్పుడే హరి తన ఫోన్ స్విచాఫ్ చేస్తా అన్నాడు. ఏదైనా ఉంటే హసన్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉండమని హరి నాకు చెప్పినాడు. తర్వాత తన ఫోన్ స్విచాఫ్ చేసి వెళ్ళిపోయాడు. అదే రోజు సాయంత్రం మళ్లీ తరుణ్ నాకు కాల్ చేసి... నవీన్ గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే నాకు తెలియదు అని చెప్పాను. నవీన్ వాళ్ళ మామ కూడా నాకు ఫోన్ చేసి నవీన్ గురించి ఏమైనా తెలిస్తే చెప్పమని అడిగాడు. నాకు తెలియదు అని చెప్పాను. కానీ నాకు భయం వేసి.. మా బావ భూపాల్ రెడ్డికి.. నవీన్ అనే అబ్బాయి తప్పిపోయాడని.. నా ఫ్రెండ్స్ ఫోన్ చేస్తున్నారని చెప్పా. అప్పుడు మళ్లీ నవీన్ వాళ్ళ మామ నాకు ఫోన్ చేసి.. నవీన్ గురించి అడుగుతుంటే.. మా బావ భూపాల్ రెడ్డి నా ఫోన్ తీసుకొని అతనితో మాట్లాడి ‘మీ అబ్బాయి గురించి మాకు తెలియదు. నేను అడ్వకేట్‌ని. పదేపదే నిహారిక కి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకండి’ అని చెప్పాడు. ఆ తర్వాత నాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఫిబ్రవరి 23 న నేను హసన్‌కు నేను కాల్ చేశా. హరి మిస్సయ్యాడని.. వాళ్ళ అక్కా బావ మలక్ పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పాడు. ‘నన్ను పోలీస్ స్టేషన్ కి పిలుస్తున్నారు నేను కూడా వెళ్తున్నాను... ఫోన్లో ఏదైనా చాట్ ఉంటే డిలీట్ చెయ్. నిన్ను కూడా పోలీస్ స్టేషన్ కి పిలుస్తారేమో’ అని హసన్ చెప్పాడు.

అప్పుడు నేను కొంత చాట్‌ని, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్‌లన్నింటినీ డిలీట్ చేశాను. మరుసటి రోజు.. 24 ఫిబ్రవరిన నా ఫ్రెండుకి హసన్ నుంచి ఇన్‌స్టాగ్రామ్ లో ఒక మెసేజ్ వచ్చింది. ‘నిహారికని ఎవరికి ఫోన్ చేయవద్దు... ఎవరితో మాట్లాడవద్దు... హరి గురించి ఎవరైనా అడిగితే తెలియదు’ అని చెప్పమని నా ఫ్రెండ్ కి హసన్ మెసేజ్ చేసాడు. నా ఫ్రెండ్ నాకు ఫోన్ చేసి ఇదే విషయం చెప్పింది. ఆ తర్వాత ... 24న ఉదయం సుమారుగా 8:30 గంటలకు నేను, నా ఫ్రెండ్ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో బస్సు ఎక్కి కాలేజీకి వెళ్తుంటే హరి వచ్చి బస్సు దగ్గర నిలబడి ఉన్నాడు. నా ఫ్రెండ్ హరిని చూసి నాకు చెప్పింది. వెంటనే నేను బస్సు దిగి వెళ్లి హరితో కాసేపు మాట్లాడాను. ‘నేను పోలీసులకు లొంగిపోతాను’ అన్నాడు. హరి నా ఫోన్ నుంచి హసన్ కి ఫోన్ చేసి ...బ్రాహ్మణపల్లి గేట్ దగ్గరికి రమ్మని చెప్పి నా దగ్గర నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత నాకు హరి మధ్యాహ్నం ఒంటి గంటకు కాల్ చేసి నన్ను హస్తినాపురం బస్టాప్ వద్ద ఉండమంటే నేను అక్కడ వెయిట్ చేసాను. హరి వచ్చి నన్ను కలిశాడు. ‘నవీన్ తల, అతని భాగాలు, బట్టలు తీసుకెళ్లి అతనిని చంపిన దగ్గరనే వేయి... లేదంటే మాపైన కూడా అనుమానం వస్తుంది’ అని హసన్ చెప్పినట్టు హరి నాతో అన్నాడు.

హరి, హసన్ ఇద్దరూ కలిసి రాజీవ్ గృహకల్ప వెనకాల పడేసిన బ్యాగు దగ్గరికి వెళ్లి.. ఇద్దరూ బ్యాగు తీసుకుని తిరిగి.. బ్రాహ్మణపల్లి దగ్గర ఉన్న కంపెనీ దగ్గరికి వెళ్లారు. అక్కడ నవీన్ కుళ్ళిపోయిన తలని, హాసన్ ఖాళీ ప్లాస్టిక్ బియ్యం సంచిలో పడేసి రమ్మని చెప్పాడు. ఆ సంచిని, నవీన్ అవయవాలతో ఉన్న బ్యాగ్ ని హరి ఒక్కడే తీసుకొని బండిమీద వెళ్లి నవీన్ ని హత్య చేసిన ప్లేస్‌లో పడేశాడు. దీంతో తన బండి బాగా దుర్వాసన వస్తోందని.. సాయిబాబా గుడి దగ్గర ఉన్న బైక్ సర్వీసింగ్ పాయింట్‌లో సర్వీసింగ్‌కి ఇచ్చానని హరి నాతో చెప్పాడు. తర్వాత ఇద్దరం కలిసి మా ఇంటికి వెళ్ళాం... మా ఇంట్లో హరి స్నానం చేశాడు. మా బావ అడ్వకేట్ అయినందున అతనితో మాట్లాడాలని హరి చెప్పగా... అప్పుడు నేను మా బావ భూపాల్ రెడ్డి నీ రోడ్డు మీదకు పిలిచి... నవీన్ మర్డర్ గురించి చెప్పాను. ఇది పెద్ద కేసని వెంటనే పోలీస్ స్టేషన్‌లో సరెండర్ కావాలని చెప్పాడు. హరి వెళ్లి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ లో ఫిబ్రవరి 24 న లొంగిపోయాడు’’ అని తెలిసింది..

Updated Date - 2023-03-09T13:21:28+05:30 IST