8న హైదరాబాద్‌కు మోదీ

ABN , First Publish Date - 2023-03-26T02:17:44+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన ఖరారైంది.

8న హైదరాబాద్‌కు మోదీ

సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునర్నిర్మాణానికి శంకుస్థాపన: కిషన్‌రెడ్డి

అదే రోజున తిరుపతి-సికింద్రాబాద్‌ వందేభారత్‌ ప్రారంభం

హైదరాబాద్‌, అడ్డగుట్ట, మార్చి 25 (ఆంధ్రజ్యోతి) : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటన ఖరారైంది. ప్రధాని మోదీ ఏప్రిల్‌ 8వ తేదీన హైదరాబాద్‌ వస్తారని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడించారు. రూ.700 కోట్లతో చేపట్టనున్న సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ పునర్నిర్మాణ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అదేవిధంగా ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులకు కూడా శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ పనులపై రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే అధికారులతో ఇప్పటికే మాట్లాడటం జరిగిందని తెలిపారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో మరో వందే భారత్‌ రైలు పరుగు పెట్టనుంది. ఇప్పటికే సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య ఓ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా.. అతి త్వరలో తెలంగాణ నుంచి ఏపీలోని తిరుపతి మధ్య మరో వందేభారత్‌ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య నడిచే ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రె్‌సను ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 8న ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ ఈ రైలును తిరుపతిలో ప్రారంభిస్తారని దక్షిణ మధ్య రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. కాగా, సికింద్రాబాద్‌- తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రూట్‌, చార్జీలపై ఇప్పటిదాకా అధికారిక ప్రకటన లేదు. అయితే, ఈ రైలు సికింద్రాబాద్‌, కాజీపేట, విజయవాడ మీదుగా తిరుపతి చేరుకుంటుందని సమాచారం. ఇక, ప్రయాణ చార్జీ సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి ఒక్కొక్కరికి రూ.1200 నుంచి రూ.2500 వరకు ఉంటుందని తెలిసింది. ఒకట్రెండు రోజుల్లో ఈ రైలు రూట్‌, చార్జీలపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Updated Date - 2023-03-26T02:17:44+05:30 IST