KTR: పెట్రో ధరలు తగ్గించరేం?

ABN , First Publish Date - 2023-03-31T02:58:07+05:30 IST

పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు డిమాండ్‌ చేశారు.

KTR: పెట్రో ధరలు తగ్గించరేం?

పెట్రో దోపిడీతో కేంద్రానికి 30 లక్షల కోట్లు!

అంతర్జాతీయంగా ముడిచమురు ధర తగ్గినా

దేశంలో పెట్రోల్‌ ధరలు ఎందుకు తగ్గించరు?

2013లో బ్యారెల్‌ 110 డాలర్లు.. పెట్రోల్‌ రూ.76

ఇప్పుడు బ్యారెల్‌ 66 డాలర్లు.. పెట్రోల్‌ రూ.110

2014 నుంచి 45ు పెంచి దోచేశారు

సెస్సులను ఎత్తేసి.. ప్రధాని క్షమాపణ చెప్పాలి

నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ లేఖ

హైదరాబాద్‌, మార్చి 30(ఆంధ్రజ్యోతి): పెట్రో ఉత్పత్తుల ధరలను విపరీతంగా పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచేసి దేశ ప్రజలను నిలువునా దోచుకుంటోందని ఆరోపించారు. ఈ దోపిడీకి అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను బూచిగా చూపి కేంద్రం ఇంతకాలం చెప్పిన మాటలన్నీ కల్లబొల్లి కబుర్లేనని తేలిపోయిందన్నారు. పెట్రోల్‌ ధరలపై కేటీఆర్‌ గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. తెలంగాణ లాంటి రాష్ట్రాలు 2014 నుంచి ఒక్క రూపాయి వ్యాట్‌ పెంచకున్నా, కేంద్రం మాత్రం సెస్సుల పేరుతో రూ.30 లక్షల కోట్లకు పైగా ప్రజల నుంచి కొల్లగొట్టిందని ఆరోపించారు. కానీ ఈ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం పైకి నెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధర 70 డాలర్లలోపు చేరిన నేపథ్యంలో ఆ మేరకు పెట్రోల్‌ రేటును తగ్గించేందుకు కేంద్రం విధించిన సెస్సులను పూర్తిగా ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. 2013లో ఒక బ్యారెల్‌ ముడి చమురు ధర 110 డాలర్లు ఉన్నప్పుడు దేశంలో లీటరు పెట్రోల్‌ రేటు కేవలం 76 రూపాయలు ఉందన్నారు. కానీ నేడు బ్యారెల్‌ ముడిచమురు ధర దాదాపు సగం పడిపోయినా.. అంటే 66 డాలర్లకు తగ్గినా పెట్రోల్‌ ధర తగ్గలేదని, లీటరుకు 110 రూపాయలు ఉందన్నారు. దేశంలో పెట్రోల్‌ ధర పెంపునకు కారణం అంతర్జాతీయంగా ముడిచమురు రేటు కాదని, మోదీ నిర్ణయించిన చమురు ధరలేనని తాము గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలని మళ్లీ రుజువైందన్నారు.

తన కార్పొరేట్‌ మిత్రుల ఖజానాను నింపేందుకు మోదీ ప్రభుత్వం పెట్రోల్‌ ధరను పెంచుకుంటూ పోతోందన్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా దాదాపు 45 శాతానికి పైగా పెంపు వల్ల సరుకు రవాణా భారమై, సామాన్యుడు కొనే ప్రతి సరుకు ధర భారీగా పెరిగిందన్నారు. భారీగా పెరిగిన డీజిల్‌ ధరలతో ప్రజా రవాణా వ్యవస్థ సంక్షోభం అంచున చేరుతోందన్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లో ప్రజా రవాణా చార్జీలను పెంచాల్సిన అనివార్య పరిస్థితిని కేంద్ర ప్రభుత్వం సృష్టించిందన్నారు. కేంద్రం వైఫల్యం వల్ల గత నలభై ఐదు సంవత్సరాలలో ఎప్పుడు లేనంత ద్రవ్యోల్బణం దేశాన్ని పట్టిపీడిస్తోందన్నారు. దేశీయ వినియోగం పేరు చెప్పి భారీగా రష్యా నుంచి దిగుమతి చేసుకున్న ముడిచమురును, శుద్థి చేసి తిరిగి విదేశాలకు అమ్ముకుంటున్న కీలకమైన విషయాన్ని కేంద్రం ప్రజలకు చెప్పకుండా దాచి ఉంచుతోందన్నారు. తక్కువ ధరకు ముడి చమురు కొని తిరిగి విదేశాలకే పెట్రోలు అమ్ముతున్న కంపెనీలకు వచ్చిన అడ్డగోలు లాభాలను దృష్టిలో పెట్టుకుని, దానిపై వచ్చే విండ్‌ ఫాల్‌ పన్నును కేంద్రం తగ్గించిన విషయాన్ని గమనించాలన్నారు. కార్పొరేట్‌ కంపెనీలకు పన్నులు తగ్గించినా ప్రజలను మాత్రం పెట్రోల్‌ పేరుతో దోపిడీ చేస్తున్న కఠినాత్ముడు ప్రధాని మోదీ అని దేశం గుర్తుంచుకోవాలని కోరారు.

Updated Date - 2023-03-31T02:58:07+05:30 IST