‘టోఫెల్‌’లో మాస్‌కాపీయింగ్‌

ABN , First Publish Date - 2023-02-08T04:44:52+05:30 IST

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి ఆంగ్లభాష పరిజ్ఞానానికి అర్హత అయిన టోఫెల్‌, జీఆర్‌ఈ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముఠా ఆటను హైదరాబాద్‌ పోలీసులు కట్టించారు.

‘టోఫెల్‌’లో మాస్‌కాపీయింగ్‌

చీటింగ్‌ ముఠాకు బేడీలు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారికి ఆంగ్లభాష పరిజ్ఞానానికి అర్హత అయిన టోఫెల్‌, జీఆర్‌ఈ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముఠా ఆటను హైదరాబాద్‌ పోలీసులు కట్టించారు. కరోనా కాలం నుంచి ఈ పరీక్షను అభ్యర్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో రాసేలా వెసులుబాట్లు కల్పించడాన్ని ఈ ముఠా అవకాశంగా మలచుకుంది. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్‌ క్రైమ్స్‌ డీసీపీ స్నేహీమెహరా, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి జాయింట్‌ సీపీ గజరావ్‌భూపాల్‌ ఈ కేసు వివరాలను వెల్లడించారు. నగరానికి చెందిన శ్రవణ్‌, ఆదిత్య ఎన్‌ఐటీ రాయ్‌పూర్‌లో బీటెక్‌ చదువుతున్నారు. ఇంటి నుంచే ఆన్‌లైన్‌ ద్వారా జీఆర్‌ఈ, టోఫెల్‌ పరీక్షలు రాసే విద్యార్థులను వీరు టార్గెట్‌గా చేసుకుంటూ.. మాస్‌ కాపీయింగ్‌కు ప్రోత్సహిస్తుంటారు. ఇందుకోసం వీరు రూ. 20 వేల చొప్పున వసూలు చేస్తుంటారు. తమకు డబ్బులు చెల్లించిన వారిని.. పరీక్ష రాసేందుకు అన్ని సదుపాయాలు కల్పిస్తారు. ఇందుకోసం తమ స్నేహితులు కిశోర్‌, సంతోష్‌, గుణశేఖర్‌ల ఇళ్లను వినియోగించేవారు. విద్యార్థులు పరీక్షకు హాజరైతే.. వీరంతా కంప్యూటర్‌ టేబుళ్ల కింద నక్కి.. ప్రశ్నలను వాట్సాప్‌ ద్వారా ఆదిత్య, శ్రవణ్‌లకు పంపేవారు. వాట్సా్‌పలో సమాధానాలు రాగానే.. విద్యార్థులకు అందజేసేవారు. ఎల్‌బీనగర్‌లోని హస్తినాపురంలో.. ఓ ఇంట్లో టోఫెల్‌ ఆన్‌లైన్‌ పరీక్షకు హాజరైన విద్యార్థులకు టేబుళ్ల కింద నుంచి ఎవరో సమాధానాలు చెబుతున్నట్లు ఇన్విజిలేటర్‌ గుర్తించారు. వెంటనే హైదరాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. ఈ ముఠాను అరెస్టు చేశారు. గుణశేఖర్‌, ఆదిత్య పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Updated Date - 2023-02-08T04:44:53+05:30 IST