ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటాపాట

ABN , First Publish Date - 2023-02-21T04:17:01+05:30 IST

తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీ గాయకురాలు మంగ్లీ ఆటాపాట చిత్రీకరించడంపై దుమారం రేగింది.

ముక్కంటి ఆలయంలో మంగ్లీ ఆటాపాట

గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదల

నివ్వెరపోయిన శ్రీకాళహస్తివాసులు.. రేగిన దుమారం

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 20: తిరుపతి జిల్లాలో దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో సినీ గాయకురాలు మంగ్లీ ఆటాపాట చిత్రీకరించడంపై దుమారం రేగింది. ఈ ఆలయంలో రెండు దశాబ్దాల నుంచి వీడియో చిత్రీకరణకు అనుమతించడం లేదు. ప్రతి శివరాత్రికీ పరమశివుడిని కీర్తిస్తూ మంగ్లీ ఒక పాటను చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఈ ఏడాది గుట్టుచప్పుడు కాకుండా ముక్కంటి ఆలయం లోపల ఆమె బృందం పాటను చిత్రీకరించి యూట్యూబ్‌లో విడుదల చేసింది. సోమవారం యూట్యూబ్‌లో ఆ పాటను చూసిన శ్రీకాళహస్తివాసులు నివ్వెరపోయారు. ముక్కంటి ఆలయంలోని స్వామివారి సన్నిధి నుంచి నటరాజస్వామి విగ్రహం వరకు మధ్యలో ఉన్న ప్రదేశంలో మంగ్లీ నృత్యం చేసింది. అలాగే, ఆలయంలోని కాలభైరవస్వామి విగ్రహం వద్ద, అమ్మవారి సన్నిధి నుంచి స్పటిక లింగం వరకు మధ్యభాగంలోనూ బృందంలో కలిసి ఆడిపాడింది. ఊంజలసేవా మండపంలో స్వామి అమ్మవార్లను కొలువుదీర్చే చోట మంగ్లీ మరో ఇద్దరు యువతులతో కలిసి నృత్యం చేసింది. ఆ పక్కనే ఉన్న రాయలవారి మండపం, రాహుకేతు మండపంలలో కూడా చాలా సేపు వీడియో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. రోజూ సాయంత్రం 6 గంటలకు రాహుకేతు పూజలు ముగిసిన తరువాత మండపాన్ని మూసివేస్తారు. మంగ్లీ నృత్యం చిత్రీకరణ కోసం ప్రత్యేకంగా మండపాన్ని తెరిచి సహకరించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-02-21T04:17:01+05:30 IST