సంక్షేమానికి స్వల్పమే!

ABN , First Publish Date - 2023-02-07T04:08:10+05:30 IST

ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న తెలంగాణ సర్కారు 2023-24 ఆర్థిక ఏడాదికి సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధులను స్వల్పంగానే కేటాయించింది.

సంక్షేమానికి స్వల్పమే!

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న తెలంగాణ సర్కారు 2023-24 ఆర్థిక ఏడాదికి సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధులను స్వల్పంగానే కేటాయించింది. దీంతో బీసీల రుణాలు.. ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపై ప్రభావం పడనుంది. గతేడాది బీసీ శాఖకు రూ.5,697.55 కోట్లు కేటాయించిన సర్కారు ఈ బడ్జెట్‌లో రూ.6,229కోట్లను మాత్రమే కేటాయించింది. రూ.531.5కోట్లు పెరిగినా బీసీలకు మేలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే బీసీ శాఖకు వివిధ కేటగిరీల కింద రుణాల కోసం 5.70 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తాజా బడ్జెట్‌ ప్రకారం ఈసారి కూడా బీసీ రుణాలకు మోక్షం లభించనట్టేనని అర్థమవుతోంది. ఎంబీసీ కార్పొరేషన్‌కు కేటాయింపులపై ఈ సారి కూడా స్పష్టతనివ్వలేదు. ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధులకు రూ.51,982 కోట్లు కేటాయించగా, ఇందులో ఎస్సీల ప్రత్యేక నిధికి రూ.36,750 కోట్లు, ఎస్టీకి రూ.15,232కోట్లు కేటాయించింది. అయితే గతేడాది ఎస్సీ ప్రత్యేక నిధి కోసం రూ. 33,937కోట్లు, ఎస్టీ స్పెషల్‌ డెవల్‌పమెంట్‌కు రూ.13,412 కోట్లను కేటాయించింది. గతంతో పోల్చితే ఈ రెండు వర్గాల అభివృద్ధికి ప్రత్యేక నిధి రూ.4,632.72 కోట్లు మాత్రమే పెరిగింది. గిరిజన శాఖకు గతేడాది రూ.3,415.41కోట్లను, ఈసారి రూ.3,965 కోట్లను కేటాయించింది. ఎస్సీ సంక్షేమానికి గతంలో రూ.20,624 కోట్లు, ఈసారి రూ.21,022 కోట్ల కేటాయింపులు చేసింది. ఇందులో స్కాలర్‌షి్‌పలకు రూ.2,850 కోట్లను కేటాయించింది. గిరిజన ఆవాసాల రోడ్ల నిర్మాణాలకు రూ.900 కోట్లు, గిరిజన గ్రామాల్లో పంచాయతీ కార్యాలయాల నిర్మాణాలకు రూ.300 కోట్లను కేటాయించింది. గతేడాది కూడా ఇదే బడ్జెట్‌ను కేటాయించినా.. పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయలేదు. కాగా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు గతేడాది రూ.2,750 కోట్లను కేటాయించగా ఈ బడ్జెట్‌లో రూ.480 కోట్లు పెంచి రూ.3,210 కోట్లను సర్కారు కేటాయించింది.

Updated Date - 2023-02-07T04:08:11+05:30 IST