కేసీఆర్‌.. మీ కుటుంబ ఆస్తులెన్ని?

ABN , First Publish Date - 2023-01-25T02:55:10+05:30 IST

కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దివాలా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,.

కేసీఆర్‌.. మీ కుటుంబ ఆస్తులెన్ని?

కేసీఆర్‌.. మీ కుటుంబ ఆస్తులెన్ని?

ఎనిమిదేళ్లలో వేల కోట్లు సంపాదించారు..తెలంగాణను దివాలా తీయించారు

మీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్‌ డిమాండ్‌

కేంద్రం ఏం చేసిందో వివరిస్తాం: కిషన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేసీఆర్‌ ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణను దివాలా తీయించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. సీఎం కుటుంబం మాత్రం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిందన్నారు. కేసీఆర్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2014కు ముందు వారి కుటుంబ ఆస్తులెన్ని? అధికారంలోకి వచ్చాక ఆస్తులెన్ని? అనే వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. మహబూబ్‌నగర్‌లో రెండు రోజులుగా జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్‌ బన్సల్‌, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్‌, పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ సోయం బాపూరావు, జాతీయ కార్యవర్గసభ్యులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, వివేక్‌, గరికపాటి మోహన్‌రావు, విజయశాంతి తదితర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ.. 2014 నాటి పరిస్థితితో పోలుస్తూ ఇప్పటివరకు చేసిన అప్పులు, వాటిని ఖర్చు చేసిన తీరుపైనా కేసీఆర్‌ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ రాష్ట్రంలోని ఒక్కో కుటుంబంపై రూ.6 లక్షల అప్పును బహుమతిగా ఇచ్చారని ఆరోపించారు.

తెలంగాణలో ప్రజలు పూర్తి నిరాశ, నిస్పృహల్లో ఉన్నారని చెప్పారు. బీజేపీ కార్యవర్గ సమావేశ తీర్మానాలపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈ సారి బీజేపీకి అధికార పగ్గాలు అందజేయనున్నారని సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. 317 జీవో పేరుతో ఉపాధ్యాయులను ఇబ్బంది పెడితే సహించేది లేదని, సమస్యను పరిష్కరించకపోతే ఈ నెల 30న ఇందిరాపార్కు వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. బీజేపీ నాయకులు సొంత మైలేజీ కోసం పనిచేయవద్దని, మోదీ నాయకత్వంలో పార్టీ జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లేవారే అసలైన నాయకులని సూచించారు. ‘‘తెలంగాణకు కేంద్రం ఏం చేసిందనే అంశంపై పూర్తి గణాంకాలతో నివేదిక తయారు చేస్తున్నాం. ప్రముఖులను ఆహ్వానించి చర్చిస్తాం. జిల్లాల్లో ఈ వివరాలు వెల్లడిస్తాం. మోదీ తెలంగాణకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారనే అంశంపై లెక్కలతో సహా ప్రజల్లోకి వెళ్లి వివరిస్తాం’’ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ పచ్చి అబద్ధాలు చెబుతూ కాలం వెళ్లదీస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని పార్టీ 11 వేల శక్తి కేంద్రాల పరిధిలో 11 వేల కార్నర్‌ మీటింగులు నిర్వహించి, కేంద్రం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించినట్లు జితేందర్‌రెడ్డి తెలిపారు.

కేసీఆర్‌ సర్కారుపై వ్యతిరేకత: ఛుగ్‌

‘‘తెలంగాణలో కేసీఆర్‌ సర్కారుపై ఉన్నంత వ్యతిరేకత మరెక్కడా లేదు. బీఆర్‌ఎస్‌ పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. కేసీఆర్‌ సర్కారును జనం అసహ్యించుకుంటున్నారు. సెవెన్‌స్టార్‌ ఫాంహౌస్‌ నుంచి తాంత్రిక పాలన చేస్తున్న కేసీఆర్‌, రాబోయే ఎన్నికల్లో అధికారం కోల్పోవడం ఖాయం’’ అని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ఛుగ్‌ అన్నారు. రాష్ట్రంలో 60 మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్న దుస్థితి నెలకొందన్నారు. రైతులకు ఈ సర్కారు చేసిందేమీ లేదని ఆరోపించారు. టీచర్లను రోడ్లపైకి ఈడుస్తున్నారని, ఇంత దమనకాండ ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌ బైబై అని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఈ 9 నెలలూ ప్రతి కార్యకర్తా నిర్విరామంగా పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీ-20 దేశాలకు ప్రధాని మోదీ నాయకత్వం వహించడం గొప్ప విషయమని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు.

బీజేపీ, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల బాహాబాహీ

బీజేపీ కార్యవర్గ సమావేశాల ప్రాంగణం వద్ద బీజేపీ, ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలనే డిమాండ్‌తో సమావేశ ప్రాంగణం వద్దకు ర్యాలీగా వచ్చిన ఎమ్మార్పీఎస్‌ నాయకులు ధర్నాకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకొని వెనక్కి పంప గా, మళ్లీ వచ్చి ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీజేపీ కార్యకర్తలు సైతం వారిపై తిరగబడ్డారు. ఇరువర్గాలు పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. హెడ్‌కానిస్టేబుల్‌ బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మార్పీఎస్‌ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు.

Updated Date - 2023-01-25T02:55:11+05:30 IST