రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా కేసీఆర్ : ఈటల
ABN , First Publish Date - 2023-06-07T04:08:21+05:30 IST
పేదల భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు.
ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు: డీకే అరుణ
ఆమనగల్లు, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : పేదల భూములను లాక్కొని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ సీఎం కేసీఆర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా వ్యవహరిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. గత ప్రభుత్వాలు దళిత, గిరిజనులకు ఇచ్చిన అసైన్డ్, ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కారు గుంజుకుంటోందని మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో మంగళవారం నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఈటల మాట్లాడారు. కొంగరకలాన్‌లో ఎకరం రూ.10 కోట్లు పలికే భూములను ప్రజల నుంచి తీసుకొని.. దానికి బదులుగా ఎకరాకు 300 నుంచి 400 గజాల ఇంటి స్థలం ఇవ్వడం అన్యాయమన్నారు. ఫార్మాసిటీ పేరుతో 20వేల ఎకరాలను తీసుకున్న ప్రభుత్వం.. ఎకరా రూ.కోటి పలికే భూమికి పరిహారంగా రూ.10 లక్షలు చెల్లించడం దారుణమని అన్నారు. హైటెక్ సిటీ సమీపంలో రూ. 50 కోట్ల నుంచి రూ.70 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని ఎకరం రూపాయి చొప్పున 15 ఎకరాలు ఓ కార్పొరేట్ సంస్థకు కట్టబెడితే కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ స్పష్టం చేశారు. బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకుంటున్నాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వచ్చింది ఒక్క కేసీఆర్ కుటుంబం కోసమేనా..? అని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లలో కేసీఆర్ సర్కార్ ప్రజలకు చేసిందేమీ లేదని.. ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని అరుణ నిలదీశారు.