MLC Kavitha: మహిళా బిల్లుకు ప్రధాని చొరవ చూపట్లేదు
ABN , First Publish Date - 2023-03-18T03:24:24+05:30 IST
పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ చొరవ చూపడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

గతంలో ఇచ్చిన హామీని కేంద్రం విస్మరించింది
రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలి
రష్యా అధికారిక వార్తా సంస్థ ‘స్పూత్నిక్’కు కవిత ఇంటర్వూ
న్యూఢిల్లీ, మార్చి 17(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రధాని మోదీ చొరవ చూపడం లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆమె.. శుక్రవారం రష్యా ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ ‘స్పూత్నిక్’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన బీజేపీ..అధికారంలోకి వచ్చాక విస్మరించిందని దుయ్యబట్టారు. రాజకీయ రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగితేనే... దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావాలని తమ పార్టీ ఎంపీలు ఒత్తిడి తీసుకొస్తున్నా కేంద్ర పెడచెవిన పెడుతోందన్నారు. ఇతర రిజర్వేషన్ల కోటాను పెంచాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం పెడుతున్నాయని, ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి తమ పార్టీ కేంద్రానికి సూచనలు చేసిందని గుర్తు చేశారు. ముఖ్యంగా కులగనణను చేపట్టి ఓబీసీ జనాభా లెక్కలు తీయాలని తాము డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. జనాభా లెక్కలు అందుబాటులో ఉంటే రిజర్వేషన్ల అమలు సులభమవుతుందని అన్నారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో తమ ప్రభుత్వం రాష్ట్రంలో ఇంటింటి సర్వే నిర్వహించి కులాల వారీగా జనాభా లెక్కలు ేసకరించిందని కవిత గుర్తు చేశారు.