తెలంగాణకు తలమానికం ‘కాళేశ్వరం’

ABN , First Publish Date - 2023-05-23T03:27:06+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో నాలుగేళ్లలోనే పూర్తిచేసిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.

తెలంగాణకు తలమానికం ‘కాళేశ్వరం’

ప్రపంచ సాగునీటి చరిత్రలో ఒక అద్భుతం..

రికార్డు స్థాయిలో నాలుగేళ్లలో పూర్తి చేశాం

అమెరికాలో వాటర్‌ రిసోర్సెస్‌ సదస్సులో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని రికార్డు స్థాయిలో నాలుగేళ్లలోనే పూర్తిచేసిందని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించే ఒక బృహత్‌ సంకల్పంతో మిషన్‌ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేసినట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక నాయకుడు తలుచుకుంటే సాధించగలిగే ఒక గొప్ప విజయానికి నిదర్శనమని అన్నారు. అమెరికాలోని నెవెడా రాష్ట్రం హెండర్సన్‌ నగరంలో అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ సివిల్‌ ఇంజనీర్స్‌ నిర్వహించిన ‘ఎన్విరాన్మెంటల్‌ అండ్‌ వాటర్‌ రిసోర్సెస్‌’ సదస్సులో తెలంగాణ తరఫున కేటీఆర్‌ పాల్గొన్నారు. ఆ సంస్థ కాళేశ్వరం ప్రాజెక్టును ‘ఎండ్యూరింగ్‌ సింబల్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ప్రోగ్రెస్‌’గా పేర్కొంటూ అందించిన అవార్డును కేటీఆర్‌ స్వీకరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నీటి విజయాలు, కాళేశ్వరం, మిషన్‌ భగీరథ పాజెక్టులపై ప్రసంగించారు. కాళేశ్వరం కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని ఒక ఇంజనీరింగ్‌ అద్భుతమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేళ్లలో అత్యధిక తలసరి ఆదాయం సాధించిందని, దేశానికి అన్నం పెట్టే రాష్ట్రంగా మారిందని కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే తొలిసారిగా అందరికీ మంచినీళ్లు అందించిన రాష్ట్రంగా నిలిచిందన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందు సాగునీరు అందక తెలంగాణ కరువుకు నిలయంగా ఉందన్నారు. తెలంగాణలోని వేలాది చెరువులు నిండక, భూగర్భ జలాలు లేక వ్యవసాయ రంగం సంక్షోభం ఎదుర్కొందన్నారు. తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పలేదన్నారు. సాగు, తాగునీటితో పాటు పారిశ్రామిక అవసరాలకు 2.40 లక్షల మిలియన్‌ క్యూబిక్‌ ఫీట్ల నీటిని వినియోగించాలన్న లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేశామన్నారు. సముద్ర మట్టానికి 90 మీటర్ల ఎత్తున ఉన్న నీటిని 618 మీటర్లకు తీసుకెళ్లి వివిధ ప్రాజెక్టులు నింపడం ప్రపంచ సాగునీటి చరిత్రలో ఒక అద్భుతంగా నిలిచిపోతుందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం తరలించిన మట్టితో 101 గీజా పిరమిడ్లు, ఈ ప్రాజెక్టులో వాడిన స్టీల్‌తో 66 ఈఫిల్‌ టవర్లు, కాంక్రీట్‌తో 53 బుర్జ్‌ ఖలీఫాలు నిర్మించవచ్చని చెప్పారు.

90 లక్షల ఎకరాల్లో 2 పంటల సాగు

ప్రాజెక్టులో 1800 కిలోమీటర్ల మేర కాల్వలు, 22 పంపు హౌస్‌లు, 20 రిజర్వాయర్ల నిర్మాణం జరిగిందన్నారు. 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్న సాగర్‌ లాంటి అతి పెద్ద రిజర్వాయర్‌ నిర్మించినట్లు తెలిపారు. కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రంలో అనేక అద్భుతమైన మార్పులు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశ ధాన్యాగారంగా మారిందని, 90 లక్షల ఎకరాల్లో 2 పంటలు సాగవుతున్నాయన్నారు. తెలంగాణలో సాగుభూమి 119 శాతం, ధాన్యం ఉత్పత్తి 3 రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం 25 లక్షల ఎకరాల నుంచి 97 లక్షల ఎకరాలకు పెరిగిందన్నారు. తెలంగాణ దేశంలోనే 100 శాతం తాగునీటిని సరఫరా చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. దీంతో పాటు దశాబ్దాల ఫ్లోరైడ్‌ సమస్య నుంచి తెలంగాణ శాశ్వతంగా విముక్తి అయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవార్డు అందించడం తెలంగాణ రాష్ట్రానికి, కేసీఆర్‌ మేధస్సుకు దక్కిన అపూర్వమైన గుర్తింపుగా భావిస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2023-05-23T03:27:06+05:30 IST