కైంకర్యం.. కింకర్తవ్యం!?
ABN , First Publish Date - 2023-02-15T04:38:13+05:30 IST
దేవాలయం.. నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారే ఆధ్యాత్మిక కేంద్రం.. అలాంటి కోవెలకు ఇప్పుడు కళతప్పుతోంది. దేవునికి అందించే నిత్యసేవలు నామమాత్రంగా మారుతున్నాయి.
రాష్ట్రంలోని అనేక ఆలయాల్లో ఇదే దుస్థితి
ఐదు మాసాలుగా నిధులివ్వని ప్రభుత్వం
అర్చకులకూ అందని గౌరవ వేతనం
అప్పులు చేసి సమర్పిస్తున్న పూజారులు
పెద్దపల్లి, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): దేవాలయం.. నిత్యం ధూపదీప నైవేద్యాలతో అలరారే ఆధ్యాత్మిక కేంద్రం.. అలాంటి కోవెలకు ఇప్పుడు కళతప్పుతోంది. దేవునికి అందించే నిత్యసేవలు నామమాత్రంగా మారుతున్నాయి. దీనికంతటికీ కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రభుత్వం నిధులు అందించకపోవడంతో రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో నిత్యం ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు అర్చకులు తంటాలు పడుతున్నారు. ప్రభుత్వం దేవాలయాలకు ఇచ్చే సొమ్ముతో పాటు అర్చకులకు భృతిని ఐదు మాసాలుగా ఇవ్వడం లేదు. దీంతో అర్చకులే అప్పులు చేసి నూనె, వత్తులు, అగర్‌బత్తీలు, కర్పూరం బిళ్లలు, పప్పు, పాలు, పెరుగు, తదితరాలను కొనుగోలు చేసి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్నారు. దేవాలయాల్లో నిత్యం దేవుడికి ధూపదీప నైవేద్యాలను సమర్పించేందుకు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ధూపదీప నైవేద్య పథకాన్ని ప్రవేశ పెట్టారు. అప్పుడు తెలంగాణ వ్యాప్తంగా 1,809 దేవాలయాల్లో దీనిని అమలు చేశారు. ధూపదీప నైవేద్యాల కోసం రూ.1,000లు, అర్చకునికి వేతనంగా రూ.1,500లు మొత్తం రూ.2,500లు ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని రూ.2,500 నుంచి రూ.6 వేలకు పెంచింది. ధూపదీప నైవేద్యానికి రూ.2 వేలు, అర్చకునికి వేతనం రూ.4వేలు ఇస్తూ వచ్చింది. ఆ తర్వాత మరిన్ని దేవాలయాలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని బ్రాహ్మణ సంఘాలు ప్రభుత్వాన్ని కోరడంతో ప్రస్తుతం రాష్ట్రంలో 3,645 దేవాలయాల్లో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు ప్రతి నెలా అర్చకుల ఖాతాల్లో డబ్బులను జమ చేసిన ప్రభుత్వం తర్వాత రెండు, మూడు మాసాలకోసారి జమ చేసేది. చివరగా గతేడాది సెప్టెంబరు వరకు మాత్రమే డబ్బులను అర్చకుల ఖాతాల్లో వేసిన ప్రభుత్వం ఆ తర్వాత నుంచి జమ చేయడం లేదు.
భారంగా కుటుంబ పోషణ: అర్చకుల ఆవేదన
నెలంతా ఆలయంలో దీపం వెలిగించేందుకు, ధూపం, నైవేద్యం సమర్పించేందుకు కావాల్సిన నూనె, అగర్‌బత్తీలు, హారతి కర్పూర బిళ్లలు, చక్కెర, పప్పు ఇతరత్రా ధరలు బహిరంగ మార్కెట్‌లో అమాంతం పెరిగాయి. వీటికి రూ.2 వేలు ఏమాత్రం సరిపోవడంలేదని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే గౌరవ వేతనం రూ.4 వేలు కూడా సరిపోవడం లేదని, కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని వాపోతున్నారు. యాదాద్రి, వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, తదితర దేవాలయాల ద్వారా పెద్దఎత్తున ఆదాయం సమకూరుతున్నా ప్రభుత్వం ధూపదీప నైవేద్యాల కింద ఇచ్చే నిధిని పెంచడం లేదని, ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి దేవాలయాలకు ఇచ్చే నిధిని పెంచి, గౌరవ వేతనాన్ని ప్రతి నెలా అందజేయాలని అర్చకులు కోరుతున్నారు.
నిధిని రూ.20 వేలకు పెంచాలి
ధూపదీప నైవేద్య పథకం కింద ఇస్తున్న నిధులు 5 మాసాల నుంచి జమ కావడం లేదు. ఈ పథకం కింద ఇస్తున్న రూ.6వేలు ఏమాత్రం సరిపోవడం లేదు. మార్కెట్‌లో పెరిగిన ధరలతో ధూపదీప నైవేద్యాలకు కనీసం రూ.5 వేలు ఖర్చవుతున్నాయి. సీఎం కేసీఆర్ స్పందించి ఈ పథకం కింద ఇచ్చే నిధిని ఆరు వేల నుంచి రూ.20 వేలకు పెంచాలి. ప్రతి నెలా ఖాతాల్లో డబ్బులు జమ చేయాలి.
- నిట్టూరి సతీష్ శర్మ, ధూపదీప నైవేద్య పథకం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు