JPS : సమ్మె హక్కు లేదు

ABN , First Publish Date - 2023-05-09T02:08:37+05:30 IST

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సమ్మె విరమించి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది.

JPS : సమ్మె హక్కు లేదు

జేపీఎస్‌లు సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలి

లేదంటే ఉద్యోగాలు పోతాయ్‌..

జేపీఎస్‌, ఓపీఎస్‌లకు సర్కారు అల్టిమేటం

పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి నోటీసులు..

ఐనా తగ్గేదే లేదంటున్న జేపీఎస్‌లు

హైదరాబాద్‌, మే 8 (ఆంధ్రజ్యోతి): జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె చేయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. వెంటనే సమ్మె విరమించి మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు విధుల్లో చేరాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే ఉద్యోగాల నుంచి టర్మినేట్‌ చేస్తామని హెచ్చరించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు యూనియన్‌ ఏర్పాటు చేయడం, సమ్మెకు దిగడం చట్టవిరుద్ధమని, తక్షణం సమ్మె విరమించాలని పేర్కొంటూ రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్‌ సుల్తానియా సోమవారం నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌ లు), ఔట్‌సోర్సింగ్‌ పంచాయతీ కార్యదర్శులు (ఓపీఎస్‌లు) తమను రెగ్యులరైజ్‌ చేయాలన్న డిమాండ్‌తోఏప్రిల్‌ 28 నుంచి నిరవధిక సమ్మె చేస్తుండడంతో ఈ నోటీసులిచ్చింది. తాము సంఘాలు, యూనియన్లలో చేరబోమంటూ జేపీఎస్‌లు ఒప్పంద పత్రంలో సంతకం చేసిన విషయాన్ని ఈ నోటీసులో ముఖ్య కార్యదర్శి గుర్తు చేశారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీసు డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమన్నారు. జేపీఎస్‌, ఓపీఎస్‌లకు ఆందోళనలు, సమ్మెలు చేసే హక్కు లేదన్నారు. నిబంధనల్ని అతిక్రమించి సమ్మెకు దిగడం ద్వారా జేపీఎస్‌లు ఉద్యోగంలో కొనసాగే హక్కును కోల్పోయారని తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో చివరి అవకాశం కల్పిస్తోందని, మంగళవారం సాయంత్రం 5 గటల్లోపు విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరని వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగిస్తామని నోటీసులో పేర్కొన్నారు.

తగ్గేదే లేదంటున్న జేపీఎస్‌లు..

ప్రభుత్వం నోటీసులు జారీ చేసినా తాము వెనుకాడబోమని, నిరవధిక సమ్మె విషయంలో తగ్గేదే లేదని జేపీఎస్‌లు, ఓపీఎస్‌లు చెబుతున్నారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పలు జిల్లాలకు చెందిన జేపీఎస్‌, ఓపీఎస్‌లు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. నిబంధనల ప్రకారం పరీక్షలకు హాజరై మెరిట్‌ ఆధారంగా నియమితులమయ్యామని, రూ.15 వేల వేతనం, మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్‌ నిబంధనతో.. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులుగా విధుల్లో చేరామని చెప్పారు. కానీ, ప్రభుత్వం ముందుగా చెప్పిన ప్రకారం రెగ్యులరైజ్‌ చేయలేదని వారు పేర్కొన్నారు. పైగా ప్రొబేషనరీ కాలాన్ని మరో ఏడాది పొడిగించిందని, ఏప్రిల్‌ 11తో ఆ గడువు కూడా పూర్తయినా ఈ అంశాన్ని పక్కన పెట్టడం వల్లే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని అన్నారు. ఉద్యోగ భద్రత లేకుండా నాలుగేళ్లు పనిచేశామని వాపోయారు. ఇదిలా ఉండగా.. జేపీఎస్‌, ఓపీఎస్‌ల నిరవధిక సమ్మెకు రాజకీయ పార్టీల నేతల మద్దతు పెరుగుతోంది. చాలా మండలాల్లో సర్పంచులు స్వయంగా వెళ్లి జేపీఎస్‌లకు మద్దతు ప్రకటించారు. అధికార పార్టీకి చెందిన సర్పంచులు సైతం సమ్మెకు అండగా నిలిచారు. నాలుగేళ్ల నుంచి గ్రామాలకు అవార్డులు రావడంలో కీలక పాత్ర పోషించారని, వారిది న్యాయమైన డిమాండ్‌ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జేపీఎస్‌లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-05-09T02:08:37+05:30 IST