నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా

ABN , First Publish Date - 2023-03-31T03:22:24+05:30 IST

తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక సమీక్ష జరపనుంది.

నేడు రాష్ట్రానికి జేపీ నడ్డా

పదవీకాలం పొడిగింపు తర్వాత తొలిసారి పర్యటన..

పార్టీ సంస్థాగత బలోపేతంపై రాష్ట్ర పదాధికారులతో భేటీ

ఢిల్లీ నుంచే వర్చువల్‌గా జిల్లా పార్టీ ఆఫీసుల ప్రారంభం

హైదరాబాద్‌, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం కీలక సమీక్ష జరపనుంది. ఎన్నికల్లో పట్టుకోసం సంస్థాగత పటిష్ఠత అత్యంత కీలకంగా భావిస్తున్న పార్టీ.. ఈ దిశగా కొనసాగించాల్సిన కార్యాచరణపై ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసింది. ఈ కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం రానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పదవీకాలం పొడిగించిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి వస్తుండటంతో నడ్డా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 2 నెలల పాటు కర్ణాటక ఎన్నికల ప్రక్రియలో బిజీగా ఉండబోతున్న దృష్ట్యా, అప్పటివరకు రాష్ట్రంలో కొనసాగించాల్సిన కార్యక్రమాలపై నడ్డా రాష్ట్ర పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత బలోపేతంలో భాగంగా పోలింగ్‌ బూత్‌ స్వశక్తీకరణ్‌పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 9 వేలకు పైగా శక్తికేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు 3 వేలకు పైగా శక్తికేంద్రాల పరిధిలో బూత్‌ స్వశక్తీకరణ్‌ పూర్తయ్యింది. దీనిపై జేపీ నడ్డా ప్రత్యేకంగా సమీక్షిస్తారని పార్టీ సీనియర్‌ నేత ఒకరు వెల్లడించారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 11 వేల స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లకు వచ్చిన స్పందనపై నడ్డా వివరాలు తీసుకునే అవకాశముందన్నారు. పార్టీలో చేరికల అంశం కూడా చర్చకు రావొచ్చని మరో నేత తెలిపారు.

పార్టీ కార్యాలయాలను ప్రారంభించనున్న నడ్డా..

ముందుగా జేపీ నడ్డా శుక్రవారం ఢిల్లీ నుంచే వర్చువల్‌గా సంగారెడ్డి, భూపాలపల్లి, వరంగల్‌, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్‌తో పాటు ఏపీలోని అనంతపురం, చిత్తూరు జిల్లా పార్టీ కార్యాలయాలను ప్రారంభిస్తారు. అక్కడి నుంచే కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పదాధికారులు, జిల్లా నేతలతో సమావేశమవుతారు. ఇటు సంగారెడ్డిలో జరిగే పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌, సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్‌ బన్సల్‌, తరుణ్‌ చుగ్‌లు హాజరవుతారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-03-31T03:22:24+05:30 IST