‘షూ’తో వస్తే అనుమతి లేదు!

ABN , First Publish Date - 2023-06-07T04:27:15+05:30 IST

గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణలో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) నిర్ణయించింది.

‘షూ’తో వస్తే అనుమతి లేదు!

చెప్పులు వేసుకొనే రావాలి

స్లోగన్లు ఇవ్వరాదు.. ఇతరులతో మాట్లాడరాదు

పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు బంద్‌

గ్రూపు-1 పరీక్షకు కఠిన నిబంధనలు

2 గంటల ముందు వస్తే మంచిది!

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): గ్రూపు-1 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహణలో మరిన్ని కఠిన నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) నిర్ణయించింది. అందులో భాగంగా అభ్యర్థులు షూస్‌ (బూట్లు) ధరించి రాకూడదని, చెప్పులతో రావాలని స్పష్టం చేసింది. 503 గ్రూపు-1 పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 11న ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. గత అక్టోబరు 16న నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించి పేపర్‌ లీక్‌ కావడంతో దాన్ని రద్దు చేసి, మళ్లీ నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రం లీక్‌, పరీక్ష రద్దుతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మరోసారి నిర్వహిస్తున్న ఈ పరీక్ష విషయంలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. గ్రూపు-1 పోస్టుల కోసం సుమారు 3.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఓఎంఆర్‌ షీట్‌ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న ఉదయం 10.30 నుంచి మఽధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుంది. పరీక్ష మొదలు కావడానికి రెండు గంటల ముందు అంటే... ఉదయం 8.30 గంటల నుంచే అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసేస్తారు. అంటే ఉదయం 10.15 గంటల్లోపే పరీక్ష హాలులోకి అభ్యర్థులు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుమతించరు. అభ్యర్థులు పెన్సిల్‌, ఇంక్‌పెన్‌, జెల్‌పెన్‌ వంటి వాటిని తీసుకెళ్లడానికి అనుమతి లేదు. కేవలం బ్లూ, బ్లాక్‌ బాల్‌ పాయింట్‌ పెన్‌లను మాత్రమే అనుమతించనున్నారు. అభ్యర్థులు షూస్‌ వేసుకుని రాకూడదు. ఒకవేళ షూస్‌తో వస్తే అనుమతించరు. చెప్పులు వేసుకుని రావాల్సి ఉంటుంది. పరీక్ష కేంద్రంలో ఎలాంటి స్లోగన్స్‌ ఇవ్వకూడదు. ఇతరులతో మాట్లాడకూడదు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేయనున్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి ముందు అభ్యర్థులను రెండు దశల్లో తనిఖీ చేయనున్నారు. అభ్యర్థులకు సూచనలు ఇవ్వడానికి జిల్లాకు ఒకటి చొప్పున 33 హెల్ప్‌లైన్‌ సెంటర్లు ప్రారంభించారు. పరీక్ష నిర్వహణకు నియమితులైన సిబ్బందిపై కూడా నిఘా పెట్టనున్నారు. ప్రతీ పరీక్షా కేంద్రంలో పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Updated Date - 2023-06-07T04:27:15+05:30 IST