ఆశలు చిగురించేనా?

ABN , First Publish Date - 2023-02-01T01:10:49+05:30 IST

పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. నగర అభివృద్ధికి, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు ఉంటుందా అనే చర్చ మొదలైంది.

ఆశలు చిగురించేనా?

కేంద్ర బడ్జెట్‌లో సిటీకి కేటాయింపులపై చర్చ

‘మెట్రో’కు రెండు దశ విస్తరణకు నిధులు వచ్చేనా?

ఆశగా ఎదురుచూస్తున్న నగరవాసులు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌లో బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. నగర అభివృద్ధికి, ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు ఉంటుందా అనే చర్చ మొదలైంది. ప్రధానంగా నగరానికి తలమానికమైన మెట్రోరైలు విస్తరణకు కేంద్రం తనవంతు చేయూతనందిస్తుందా, లేదా అన్న ఆసక్తి ఏర్పడింది. నగర పరిధిలో ట్రాఫిక్‌ రహితమైన ప్రయాణాన్ని అందించేందుకు రూ.14,132 వేల కోట్లతో మెట్రో రైలు ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మూడు కారిడార్ల పరిధిలో, 69.2 కిలోమీటర్ల మార్గంలో రోజుకు 1028 మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. మొదటి దశ విజయవంతం కావడంతో రెండో దశలో రాయదుర్గం (రహేజా మైండ్‌ స్పేస్‌) జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు వయా ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ ఆర్‌) 31 కిలోమీటర్లు, బీహెచ్‌ఈఎల్‌ నుంచి లక్డీకాపూల్‌ (26 కిలోమీటర్లు), నాగోలు- ఎల్‌బీనగర్‌ మధ్యలోని 5 కిలోమీటర్ల ఖాళీని పూర్తి చేసేందుకు ప్రతిపాదించారు. ఇందులో ఎయిర్‌పోర్టు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ కారిడార్‌ 31 కిలోమీటర్ల మార్గాన్ని రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసేందుకు ఇటీవల రూ.6,250 కోట్లు కేటాయించింది. రెండో దశలోని బీహెచ్‌ఈఎల్‌- లక్డీకాపూల్‌, నాగోలు-ఎల్‌బీనగర్‌ మార్గాన్ని పూర్తి చేసేందుకు రూ.8,453 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు 2023-24 బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి హర్‌దీ్‌పసింగ్‌పూరికి 2022 నవంబర్‌లో మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ఇప్పటికే ఈ రెండు పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌ పూర్తి చేసి కేంద్రానికి పంపించిన తరుణంలో తాజా బడ్జెట్‌పై ఆసక్తి ఏర్పడింది.

‘ఈబీఆర్‌టీఎ్‌స’కు

సహకారం అందేనా

ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పించి, ప్రజలకు మెరుగైన రవాణాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (ఈబీఆర్‌టీఎఎస్‌) ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. ఐటీ కంపెనీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో మెట్రో రైలు మాదిరిగా ఎలక్ర్టిక్‌ బస్సులను నడిపిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా ఉండే గచ్చిబౌలి - ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ పరిధిలో ట్రాఫిక్‌ చిక్కులను పరిష్కరించేందుకు రెండేళ్ల క్రితం రూ.2,800 కోట్ల అంచనాతో హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ ఈబీఆర్‌టీఎ్‌సను ప్రతిపాదించింది. పబ్లిక్‌, ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) మోడల్‌లో ఈబీఆర్‌టీఎస్‌ ప్రాజెక్టును చేపట్టి కేపీహెచ్‌బీ మెట్రో స్టేషన్‌ నుంచి ఫోరం మాల్‌, హైటెక్‌సిటీ ఎంఎంటీఎస్‌ స్టేషన్‌, హెచ్‌ఐసీసీ, శిల్పారామం, రాయదుర్గం, గచ్చిబౌలి ఫైనాన్షియల్‌ డిస్ర్టిక్ట్‌ను కలపాలని భావించింది. సుమారు 20 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ (ఆకాశ మార్గంలో) రూట్‌లో బస్సులను నడిపించాలని నిర్ణయించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించకపోవడంతో పనులు అటకెక్కాయు. తాజా కేంద్ర బడ్జెట్‌లో ఈబీఆర్‌టీఎస్‌ వ్యవస్థకు సానుకూలత లభిస్తుందా.. లేదా.. అనేదానిపై ఉత్కంఠ ఏర్పడింది.

ఇంటికి రాయితీలుంటాయా?

హైదరాబాద్‌ సిటీ, జనవరి31 (ఆంధ్రజ్యోతి): అందరికీ ఇల్లు అనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు బడ్జెట్‌లో రాయితీలుంటాయా.? అని మధ్య తరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిర్మాణ సామగ్రి ధరలు తగ్గిం చాలని కోరుతున్నారు. కొవిడ్‌-19 తర్వాత నిర్మాణ సామగ్రి ధరలు 30 శాతం నుంచి 60శాతం వరకు పెరగడంతో నిర్మాణదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే, ఫ్లాట్ల కొనుగోలుకు పన్నులు భారంగా మారుతున్నాయి.

90 చ.మీటర్లుగా చేయాల్సిందే

గృహ నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. 60 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను రూ.45 లక్షలకు అందుబాటు ధరలో అందించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. కానీ పెరిగిన నిర్మాణ వ్యయంతో 60 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను ఆ రేటుకు అందించలేని పరిస్థితి ఏర్పడింది. అందుబాటు ధరలోని ఫ్లాట్ల విస్తీర్ణాన్ని 60 చదరపు మీటర్ల ఫ్లాట్‌ను 90 చ.మీటర్లుగా, 90 చ.మీటర్ల ఫ్లాట్‌ను 120 చ.మీటర్లుగా పెంచాలి. అందుకనుగుణంగా ధరలను సవరించాలి.

- రాజశేఖర్‌రెడ్డి, క్రెడాయ్‌ హైదరాబాద్‌ ప్రధాన కార్యదర్శి

ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలి

‘ఆరోగ్య సంరక్షణ‘కు మౌలిక సదుపాయాలు కేటాయించడంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఇప్పటికే కొన్ని అభ్యర్థనలను ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించాం. పెరుగుతున్న వృద్ధాప్య జనాభా అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన ఆరోగ్య సేవలు ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. జీఎ్‌సటీని సరళీకృతం చేయాలి. మెడికల్‌ వాల్యూ టూరిజం (ఎంవీటీ)ని పెంచడానికి, మెరుగుపరచడానికి చొరవ చూపాలి.

- డాక్టర్‌ హరిప్రసాద్‌, అపోలో గ్రూప్‌ అధ్యక్షుడు

శాస్త్ర, సాంకేతిక రంగాలకు కేటాయింపులు పెంచాలి

శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు పెంచాలి. యువత మరిన్ని పరిశోధనలు చేయడానికి కృషి చేయాలి. ఆదాయపు పన్ను పరిమితిలో కనీసం రూ. 5 లక్షల దాకా పూర్తి మినహాయింపు ఇవ్వాలి.

- డా. ఎం.వీ జగన్నాథం, సీఎ్‌సఐఆర్‌, సీసీఎంబీ మాజీ శాస్త్రవేత్త

పరిశ్రమలకు ప్రోత్సాహకాలివ్వాలి

చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మరింత ప్రోత్సాహకరంగా కేటాయింపులు జరపాలి. ఉన్నత విద్యారంగం అభివృద్ధికి అమెరికా, యూరప్‌ దేశాల కంటే మెరుగైన ప్రతిపాదనలు బడ్జెట్‌లో రూపొందించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు జనాభా దామాషా ప్రకారం కేటాయింపులు ఉండాలి.

- ప్రొ. గాలి వినోద్‌ కుమార్‌, ఓయూ డీన్‌ ఫ్యాకల్టీ ఆఫ్‌లా

పర్యావరణ పరిరక్షణకు..

పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలి. మధ్యతరగతి, అల్పాదాయ వర్గాలను దృష్టిలో ఉంచుకుని విద్యా, వైద్యానికి అధిక ప్రాధాన్యం కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలలను, ఆస్పత్రులను మరింత అభివృద్ధి చేయాలి.

- ప్రొ. గడ్డం నరేష్‌ రెడ్డి, ఓయూ కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌

Updated Date - 2023-02-01T01:10:51+05:30 IST