సమగ్ర భూసర్వే అంతేనా?

ABN , First Publish Date - 2023-02-07T04:29:40+05:30 IST

సమగ్ర భూసర్వే కోసం ఎదురు చూస్తున్న వేల మంది బాధితుల ఆశపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్‌లో సమగ్ర భూసర్వేకు నిధులు కేటాయించలేదు.

సమగ్ర భూసర్వే అంతేనా?

బడ్జెట్‌లో కేటాయించింది రూ.52 కోట్లే

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): సమగ్ర భూసర్వే కోసం ఎదురు చూస్తున్న వేల మంది బాధితుల ఆశపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్‌లో సమగ్ర భూసర్వేకు నిధులు కేటాయించలేదు. సర్వే విభాగానికి గత ఏడాది రూ.50 కోట్లు కేటాయిస్తే, ఈ సారి రూ.52 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా సమగ్ర భూసర్వే లేనట్లేనన్న సంకేతం వెల్లడైంది. ‘‘తెలంగాణలో ప్రతీ అంగుళం భూమిని కొలుస్తాం.. దీనికోసం సమగ్ర భూముల సర్వే చేస్తాం’’ అని 2017 ఆగస్టు 18న సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. తెలంగాణలోని భూములన్నీ డిజిటల్‌గా కొలిచి ‘డిజిటల్‌ మ్యాప్‌ ఆఫ్‌ తెలంగాణ’ను తయారు చేస్తామని 2020 సెప్టెంబరు 9న వెల్లడించారు. సభలో బిల్లులకు ఆమోదం తెలిపితే, వెంటనే సర్వే కోసం ముందుకెళ్లాల్సి ఉందని అదే ఏడాది సెప్టెంబరు 14న మండలి సమావేశంలో ప్రకటించారు. 2021 జూన్‌ 7న జరిగిన మంత్రివర్గ సమావేశంలో సమగ్ర భూసర్వేపై చర్చించారు. ధరణి పోర్టల్‌లో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కారించాలంటే సమగ్ర భూసర్వే తప్పనిసరి అంటూ మంత్రివర్గం తేల్చింది. కొన్ని గ్రామాలను ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు సీఎం ప్రకటించారు. అయినా అడుగు ముందుకు పడలేదు.

అరకొరగా నిధుల కేటాయింపు

డిజిటల్‌ భూ రికార్డుల నిర్వహణకు రూ.250 కోట్లు అవసరమవుతాయని రెండేళ్ల కిందట అధికారులు అంచనా వేశారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా రూ.83.85 కోట్లు మంజూరు చేసింది. అందులోంచి రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. రాష్ట్రప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో డిజిటల్‌ సర్వే కోసం రూ.30.71 కోట్లు కేటాయించింది. ఇందులో రూ.1.25 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. రెండు ప్రభుత్వాల బడ్జెట్‌తో భూ రికార్డుల నిర్వహణకు రూ.114.56 కోట్ల నిధులు మంజూరు చేసినా ఖర్చు చేసింది కంటితుడుపుగా రూ.3.90 కోట్లు మాత్రమే. 2022-23లో రూ.50 కోట్లకు రూ.1.50 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు ఓ అధికారి తెలిపారు.

Updated Date - 2023-02-07T04:29:41+05:30 IST