పెట్టుబడులు తెచ్చేందుకే పర్యటనలు

ABN , First Publish Date - 2023-06-07T03:30:47+05:30 IST

తెలంగాణలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతోందని, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

పెట్టుబడులు తెచ్చేందుకే  పర్యటనలు

విదేశాలకు వెళ్తున్నది అందుకే..

రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి

అత్యధిక తలసరి ఆదాయం ఇక్కడే

ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌

టీహబ్‌లో పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

హైదరాబాద్‌, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పారిశ్రామిక విప్లవం కొనసాగుతోందని, అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాల్లో భాగంగా టీ-హబ్‌లో మంగళవారం పరిశ్రమల శాఖ నిర్వహించిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ‘రాషా్ట్రనికి పెట్టుబడులు తేవాలంటే ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. దేశ విదేశాల నుంచి రాషా్ట్రల వరకు పోటీపడి మరీ పెట్టుబడులను ఇక్కడికి రప్పించాల్సి ఉంటుంది. తెలంగాణకు భారీ ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు విదేశీ పర్యటనలు చేస్తున్నాం’ అని వివరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న తపన తమను విదేశీ పర్యటనలో కష్టపడేటట్లు చేస్తుందన్నారు. తమతో పని చేస్తున్న అత్యంత నైపుణ్యం కలిగిన అధికారులు ప్రైవేట్‌ సెక్టార్‌లో పనిచేస్తే అనేక రెట్ల జీతం ప్యాకేజీ వస్తుందని, కానీ అన్నింటినీ కాదనుకొని తెలంగాణ కోసం పనిచేస్తున్న తన బృందంలోని అధికారులకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

అత్యధిక తలసరి ఆదాయం ఇక్కడే..

రూ. 3.17 లక్షలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని తెలంగాణ కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర జీఎ్‌సడీపీ 2014లో రూ. 5 లక్షల కోట్ల నుంచి ఈరోజు రూ. 13.27 లక్షల కోట్లకు చేరింది. ఐటీ ఎగుమతులు రూ. 57 వేల కోట్ల నుంచి రూ. 2.40 లక్షల కోట్లకు చేరాయన్నారు. తెలంగాణ మోడల్‌ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య మోడల్‌ అని అభివర్ణించారు. ‘ఒకవైపు పారిశ్రామిక ప్రగతితో పాటు ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతిని సమాంతరంగా ముందుకు తీసుకెళుతున్న ప్రభుత్వం మాది. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్‌ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పాం. ఆ మాట మేరకు ఈరోజు దేశంలోనే అతిపెద్ద టీ హబ్‌, టీ వర్క్స్‌ ఏర్పాటు చేశాం’ అని అన్నారు. రాషా్ట్రలతో పాటు ప్రపంచ దేశాలతో పోటీ పడి పెట్టుబడులు రప్పించాలంటే భారీ ఎత్తున మౌలిక వసతుల కల్పన చేపట్టాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. తెలంగాణ వ్యాక్సిన్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ వరల్డ్‌గా మారిందని, వచ్చే ఏడాది నాటికి ప్రపంచంలో సగానికి పైగా వ్యాక్సిన్లు హైదరాబాద్లో తయారు అవుతాయన్నారు. ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ మొబిలిటీ వ్యాలీకి పారిశ్రామిక వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌, టీఎ్‌సఐఐసీ ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు, సీఈవో మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-07T03:30:47+05:30 IST