Madapur Insofi Company Fraud :ఉద్యోగుల పేరిట లోన్లు తీసి బోర్డు తిప్పేసి..
ABN , First Publish Date - 2023-04-19T02:05:52+05:30 IST
సాఫ్ట్‌వేర్ కొలువుల పేరిట మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఆఫీసులు తెరిచి.. ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, అనతికాలంలోనే బోర్డు తిప్పేస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది!
మాదాపూర్‌లో ఇన్సోఫీ సంస్థ మోసం
700 మంది పేరిట కంపెనీ రూ.31 కోట్ల రుణాలు
కార్యాలయంలో ఆందోళనకు దిగిన బాధితులు
ఐటీ కంపెనీ యాజమాన్యంపై కేసు పెట్టేందుకు రెడీ
వారితో చర్చించిన సంస్థ సీఈవో, లాయర్లు
బాధితులు న్యాయపరంగా వెళ్తే ఐపీ పెట్టేస్తామని,
లోన్లు కూడా వారే కట్టుకోవాలని బ్లాక్‌మెయిల్
ఉద్యోగులతో నేడు మరోసారి చర్చలకు సిద్ధం
యువత జీవితాలతో ఆడుకుంటున్న మోసగాళ్లు
గత ఏడాది కాలంలో 3 వేల ఉద్యోగులు ఇంటికి
శిక్షణ అయ్యాక తమ సంస్థల్లోనే ఉద్యోగాలు ఇస్తామంటూ డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సాప్ట్‌వేర్ కంపెనీలను చూసి ఉంటారు! బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన సంస్థల గురించీ విని ఉంటారు. కానీ.. గచ్చిబౌలిలో ఒక ఐటీ కంపెనీ నయా మోసానికి తెర తీసింది! ‘మీ శిక్షణకు 4 లక్షలు ఖర్చవుతుంది. ఆ డబ్బు కట్టండి. లేదా మీ పేరిట లోన్ తీసుకుని శిక్షణ ఇప్పిస్తాం’ అంటూ ఉద్యోగార్థులతో రుణాలకు దరఖాస్తు చేయించి, ఆ సొమ్ము దిగమింగి అందరినీ తొలగించింది. లోన్లు కట్టలేక.. కొలువూ లేక.. బాధితులు లబోదిబోమంటున్నారు.
హైదరాబాద్, రాయదుర్గం, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): సాఫ్ట్‌వేర్ కొలువుల పేరిట మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఆఫీసులు తెరిచి.. ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేసి, అనతికాలంలోనే బోర్డు తిప్పేస్తున్న కంపెనీల సంఖ్య పెరుగుతోంది! అందుకు తాజా ఉదాహరణ మాదాపూర్‌లో రెండేళ్ల క్రితం ఏర్పాటైన ఇన్సోఫీ అనే ఐటీ కంపెనీ. జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయంటూ నిరుద్యోగ టెకీలను ఆకర్షించింది. క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించి.. బీటెక్ పూర్తిచేసిన దారికి 6.2 లక్షలు, డిగ్రీ పూర్తిచేసి న వారికి 5.2 లక్షల చొప్పున ఆఫర్ లెటర్లు ఇచ్చింది. డేటా సైన్స్‌లో 9 నెలలపాటు శిక్షణ ఇచ్చి, అనంతరం తమ సంస్థలోనే ఉద్యోగాలు ఇస్తామని ఊరించింది. అయితే, దీనికి భారీగా ఖర్చవుతుందని.. రూ.4 లక్షలకు పైగా చెల్లించాలని చెప్పింది. అంత ఫీజు చెల్లించడం కష్టం కాబట్టి ఉద్యోగార్థుల పేరుతో బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటామని.. ఆ లోన్లను నెలసరి వాయిదాల్లో కంపెనీయే తీరుస్తుందని కల్లబొల్లి కబుర్లు చెప్పింది. ఆ మాటలు నమ్మిన అభ్యర్థులు రు ణాలు తీసుకోవడానికి అవసరమైన పత్రాలన్నీ నింపి కంపెనీకి ఇచ్చారు. మొత్తం 700 మంది ఉద్యోగులను నియమించుకోగా.. వీరిలో 650 మంది పేరుతో ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి రూ.4లక్షల చొప్పున రూ.26 కోట్ల రుణాలను ఇన్సోఫీ కంపెనీ తీసుకుంది.

మరో 50 మంది పేరిట రూ.10 లక్షల చొప్పున రూ.5 కోట్లు తీసుకుంది. ఇలా మొత్తం రూ.31 కోట్ల రుణాలు తీసుకున్న కంపెనీ.. ఉద్యోగులకు మాత్రం ఏడాదిన్నరగా పైసా కూడా జీతం చెల్లించలేదు. ఉద్యోగులు పలుమార్లు ప్రశ్నించగా ప్రాజెక్టులు లేవంటూ సాకులు చె బుతూ వచ్చింది. ఇటీవలే 9నెలల శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులు ప్రశ్నించగా.. ‘మీ పెర్ఫార్మెన్స్ బాగా లేదు’ అంటూ దాటవేసింది. అంతలోనే.. అకస్మాత్తుగా 700 మందినీ కంపెనీ నుంచి తొలగిస్తున్నట్టు ఈ-మెయిల్ చేసింది. దీంతో మోసపోయామని అర్థంచేసుకున్న బాధితులు.. మంగళవారం సంస్థ కార్యాలయంవద్ద ఆందోళనకు దిగారు. అటు జీతం లేక ఇటు తమ పేరు మీద ఉన్న లోన్ కట్టలేక.. మోసపోయిన తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
కోర్టులో చూసుకుంటాం..
కంపెనీపై కేసు పెట్టేందుకు ఉద్యోగులు సిద్ధం కాగా.. యాజమాన్యం వారితో చర్చలకు సిద్ధమైంది. కంపెనీ సీఈవో దక్షిణమూర్తి, న్యాయవాదులు వారితో మాట్లాడారు. తమ పేరుతో తీసుకున్న లోన్ల ను క్లియర్ చేసి నిరభ్యంతరపత్రం ఇవ్వాలని, ట్రైనిం గ్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయకపోతే ఆం దోళన ఉధృతం చేస్తామని.. న్యాయపరంగా ముందుకె ళ్తామని హెచ్చరించారు. తమవద్ద ప్రాజెక్టులు లేని కారణంగా ఉద్యోగులను తొలగిస్తున్నామని, ఉద్యోగుల పేరిట తీసుకున్న లోన్లను క్లియర్ చేసి ఎన్‌వోసీలు అందజేస్తామని, ట్రైనింగ్ పూర్తిచేసుకున్న వారికి సర్టిఫికెట్లు ఇస్తామని సీఈవో హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసు పెడితే మాత్రం బ్యాంకు నుంచి తీసుకున్న రుణం తాలూకూ నెలవారీ కిస్తీలు ఇకపై వారే చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ప్రతినిధులు హెచ్చరించినట్టు సమాచారం. ‘‘న్యాయపరంగా వెళ్లాలని మీరు భావిస్తే.. మేం ఐపీ పెట్టేస్తాం(దివాలా పిటిషన్ వేస్తాం).. కోర్టుల్లోనే చూసుకుంటాం’’ అంటూ కంపెనీ యాజమాన్యం బ్లాక్‌మెయిలింగ్ చేస్తూ మాట్లాడుతోందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కంపెనీ యాజమాన్యం బుధవారం ఉద్యోగులతో మరోసారి సమావేశం కానుంది.

పలు కంపెనీలు..
గత ఏడాది మే నెలలో మాదాపూర్‌లోని ఇన్నోహబ్ టెక్నాలజీస్ సంస్థ.. శిక్షణ పేరుతో 800 మంది వద్ద రూ.20 కోట్లు వసూలు చేసింది. రెండు నెలలపాటు జీతాలు చెల్లించి అకస్మాత్తుగా బోర్డు తిప్పేసింది. అప్పుడు 800 మంది ఉద్యోగులు బజారునపడ్డారు. సెప్టెంబరులో.. మాదాపూర్‌లోని ధన్యోన్ ఐటీ టెక్నాలజీస్ సైతం 200 మంది వద్ద రూ.2 లక్షల చొప్పున రూ.4 కోట్లు వసూలుచేసి మోసం చేసింది. ఆఫర్ లెటర్లు ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడంలో జాప్యంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత ఏడాది కాలంలో ఇలా బోర్డు తిప్పేసిన కంపెనీలు చాలానే ఉన్నాయని, దాదాపు 3వేలకు పైగా ఉద్యోగులు మోసపోయారని సమాచారం. ఇలాంటి కంపెనీలపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోవడంతో మోసాలు సాధారణమవుతున్నాయని ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.