వ్యవసాయ కాలేజీల్లో పెరిగిన సీట్లు

ABN , First Publish Date - 2023-04-04T03:50:42+05:30 IST

వ్యవసాయ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో..

వ్యవసాయ కాలేజీల్లో పెరిగిన సీట్లు

60 సీట్లతో ఆదిలాబాద్‌ కళాశాల..

2 జ్యోతిబాఫూలే కాలేజీల్లో మరో 240 అగ్రి సీట్లు

అన్నీ కలిపితే 1,480కి చేరిన సీట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కోర్సులకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో.. సీట్ల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. కొత్తగా ఏర్పడిన ఆదిలాబాద్‌ కళాశాలతో కలిపి ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో సీట్ల సంఖ్య 1,240 కి చేరుకోగా.. మహాత్మా జ్యోతిబాఫూలే కళాశాలలు కూడా రెండు తోడు కావటంతో రాష్ట్రంలో వ్యవసాయ కోర్సుల సీట్ల సంఖ్య 1,480 కి చేరింది. జయశంకర్‌ యూనివర్సిటీ పరిధిలో ఇది వరకు రాజేంద్రనగర్‌, జగిత్యాల, అశ్వారావుపేట(భద్రాద్రి కొత్తగూడెం), పాలెం(నాగర్‌ కర్నూల్‌), వరంగల్‌ వ్యవసాయ కళాశాలలు మాత్రమే ఉండేవి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో కళాశాల ఏర్పాటు చేశారు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలో కూడా కాలేజీ ఏర్పాటు చేశారు. బీఎస్సీ(హానర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు సంబంధించి రాజేంద్రనగర్‌లో 296, జగిత్యాలలో 135, అశ్వారావుపేటలో 135, పాలెంలో 135, వరంగల్‌లో 135, సిరిసిల్లలో 119 సీట్లు ఉన్నాయి. సిరిసిల్లలో ఇది వరకు 70 సీట్లు ఉండగా ఈసారి మరో 49 సీట్లు పెంచారు. కొత్తగా ఏర్పాటుచేసిన ఆదిలాబాద్‌ కళాశాలలో 60 సీట్లకు జయశంకర్‌ యూనివర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ తాజాగా గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏడు వ్యవసాయ కళాశాలల్లోని బీఎస్సీ అగ్రికల్చర్‌ సీట్ల సంఖ్య 955కు చేరుకుంది. దీనికి అదనంగా కరీంనగర్‌, వనపర్తి జిల్లాల్లో రెండు వ్యవసాయ మహిళా కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి.

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల విద్యాలయాల సంస్థ పరిధిలో ఈ రెండు కళాశాలలు ఏర్పాటు చేశారు. ఒక్కో కళాశాలలో 120 చొప్పున 240సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో 80శాతం సీట్లను బీసీ, 20 శాతం ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థినులకు కేటాయించారు. ఇటు వ్యవసాయ శాఖ, అటు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని కళాశాలలు అన్నీ కలిపి బీఎస్సీ(హానర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సుకు సంబంధించిన సీట్ల సంఖ్య 1,195కు చేరింది. ఇక, సంగారెడ్డిలో బీటెక్‌(అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌) కోర్సులో 87, నిజామాబాద్‌ జిల్లా రుద్రూరులో బీటెక్‌(ఫుడ్‌ టెక్నాలజీ) కోర్సులో 77, సైఫాబాద్‌లోని సైన్స్‌ కళాశాలలో బీస్సీ హానర్స్‌ ఇన్‌ కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులో 121 సీట్ల భర్తీకి ఇటీవల జయశంకర్‌ వర్సిటీ అకడమిక్‌ కౌన్సిల్‌ ఆమోదముద్ర వేసింది. అన్నీ కలిపి రాష్ట్రంలో ఉన్న అగ్రికల్చర్‌ కోర్సుల సీట్ల సంఖ్య 1,480 కి చేరుకుంది.

వ్యవసాయ కోర్సులకు పెరిగిన డిమాండ్‌..

రాష్ట్రంలో వ్యవసాయ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది. కేవలం 20శాతం సీట్లను ఐసీఏర్‌ కౌన్సెలింగ్‌తో భర్తీ చేస్తుండగా.. సింహభాగం(80 శాతం) సీట్లను ‘ఎంసెట్‌’ కౌన్సెలింగ్‌తోనే భర్తీ చేస్తున్నారు. సాధారణంగా మెడిసిన్‌లో సీటు రాని విద్యార్థులు అగ్రికల్చర్‌ బీఎస్సీ వైపు చూస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పురోగతి సాధించడమూ ఇందుకు ఓ కారణం. రాష్ట్రంలో ఏఈవో, ఏవో పోస్టుల నియామకం పెద్ద సంఖ్యలో జరిగింది. సీడ్‌, ఫెర్టిలైజర్‌ కంపెనీల్లో అగ్రికల్చర్‌ కోర్సు పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు పెరిగాయి. ఉద్యోగం ఖాయ మన్న భావన పెరగటంతో ఈ కోర్సులకు డిమాండ్‌ పెరిగింది.

Updated Date - 2023-04-04T03:50:43+05:30 IST