ఎన్నికల ఏడాదిలో నిధుల కటకట!

ABN , First Publish Date - 2023-03-26T02:21:47+05:30 IST

ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కటకటతో ఇబ్బంది పడుతోంది.

ఎన్నికల ఏడాదిలో నిధుల కటకట!

సొమ్ముల కోసం రాష్ట్ర ప్రభుత్వ వేట

సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ మేధోమథనం

భూముల అమ్మకంపై నిరంతర పరిశీలన

తక్షణం 25 వేల కోట్లు సేకరించాలని యోచన

హైదరాబాద్‌, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం నిధుల కటకటతో ఇబ్బంది పడుతోంది. ప్రభుత్వ పెద్దలు సొమ్ముల వేటలో పడ్డారు. తక్షణావసరాల కోసం కనీసం రూ.25 వేల కోట్లనైనా సేకరించాలని యోచిస్తున్నారు. ఇందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం పన్నులు, సుంకాలు వంటి రాష్ట్ర రాబడులు, కేంద్ర గ్రాంట్లు, అప్పుల రూపంలో ప్రభుత్వానికి ప్రతి నెలా రూ.16 వేల కోట్ల వరకు సమకూరుతున్నాయి. కానీ, అసలు, వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, ఉద్యోగుల జీత భత్యాలు, కొన్ని సంక్షేమ పథకాలకు నెలకు రూ.17-18 వేల కోట్లు కావాల్సి వస్తోంది. ఇలా ఏ నెల సొమ్ము ఆ నెలలోనే కరిగిపోతుండడంతో కొన్ని పథకాలకు నిధుల కొరత ఏర్పడుతోంది. ఈ నిధులను ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌, ఆర్థిక శాఖ అధికారులు మేధోమథనం చేస్తున్నారు. భూముల అమ్మకాన్ని వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే హెచ్‌ఎండీఏ ద్వారా ఓపెన్‌ ప్లాట్లను విక్రయిస్తున్నారు. ఈ భూవిక్రయాల ద్వారా కనీసం రూ.10 వేల కోట్లను రాబట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. దీన్ని కేసీఆర్‌, హరీశ్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఔటర్‌ రింగు రోడ్డులోని టోల్‌ ప్లాజాలను ప్రైవేటు కంపెనీలకు లీజుకిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. దీని ద్వారా మరో రూ.3000కోట్ల వరకు వస్తాయని ఆశిస్తున్నారు. జీవోలు 58, 59కు సంబంధించి దరఖాస్తుల గడువును పెంచారు. వీటి కింద మరో రూ.1000-1500కోట్ల వరకు సమకూరతాయని అంచనా వేశారు. మద్యం అమ్మకాలు మరింత పెరిగేలా చూడాలంటూ ఎక్సైజ్‌ అధికారులకు టార్గెట్లు పెట్టారు. ఇలా అన్ని రకాలుగా రూ.25 వేల కోట్లను సాధించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. ఇటీవల జరిగిన కేబినెట్‌ భేటీ లో దళితబంధు రెండో దశ, ‘గృహ లక్ష్మి’, గొర్రెల పంపిణీ పథకాలను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ పథకాలకే అత్యవసరంగా రూ.21వేల కోట్లు కావాల్సి ఉండడం గమనార్హం.

Updated Date - 2023-03-26T02:21:47+05:30 IST