ఓఎంసీ కేసులో వీడీ రాజగోపాల్‌కు చుక్కెదురు

ABN , First Publish Date - 2023-03-12T03:30:44+05:30 IST

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి గనుల కేటాయింపు కేసులో అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది.

ఓఎంసీ కేసులో వీడీ రాజగోపాల్‌కు చుక్కెదురు

హైదరాబాద్‌, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్‌ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ)కి గనుల కేటాయింపు కేసులో అప్పటి గనుల శాఖ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో హైదరాబాద్‌ సీబీఐ కేసుల ప్రత్యేక కోర్టు తన డిశ్చార్జి పిటిషన్‌ను కొట్టేయడంపై ఆయన హైకోర్టులో క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణానంతరం కొట్టివేస్తూ చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. అంతకుముందు రాజగోపాల్‌ తన న్యాయవాది ద్వారా వాదనలు వినిపిస్తూ ఓఎంసీకి అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గనులు కేటాయించలేదని, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా కేవలం తాము దరఖాస్తులను కేంద్రానికి సిఫారసు చేశామని, గనులు కేటాయించింది కేంద్రమేనని పేర్కొన్నారు. మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవల్‌పమెంట్‌ రెగ్యులేషన్‌ (ఎంఎండీఆర్‌) యాక్ట్‌ ప్రకారం మొదట వచ్చిన వారికే మొదట కేటాయించాలనే నిబంధనలు ఉన్నాయని, అయినప్పటికీ వచ్చిన 30 దరఖాస్తులను కేంద్రానికి పంపామని పేర్కొన్నారు. అటవీశాఖ నుంచి ఎన్‌వోసీ ఇప్పించాల్సిన బాధ్యత గనుల శాఖపై ఉన్నందువల్లే తాను లేఖరాసినట్లు పేర్కొన్నారు. సీబీఐ ఆరోపిస్తున్నట్లు నేరపూరిత కుట్రతో తనకు సంబంధం లేదని, తనపై కేసును కొట్టేయాలని కోరారు. సీబీఐ న్యాయవాది నాగేంద్రన్‌ వాదనలు వినిపిస్తూ రాజగోపాల్‌ మైనింగ్‌ ప్రాంతాన్ని తనిఖీ చేయాల్సిన అవసరం లేదని అసిస్టెంట్‌ డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారని, తాను డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే మొత్తం ప్రక్రియ పూర్తిచేశారని పేర్కొన్నారు. ఓఎంసీకి లీజుల కేటాయింపులో రాజగోపాల్‌ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఎండీసీకి లీజు వచ్చేలా రాజగోపాల్‌ కృషి చేయలేదని తెలిపారు. ఫిబ్రవరి 10న తీర్పు రిజర్వు చేసిన ధర్మాసనం... తాజాగా పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.

Updated Date - 2023-03-12T03:30:44+05:30 IST