తెలంగాణ వీడను.. ఢిల్లీ వెళ్లను!

ABN , First Publish Date - 2023-02-21T02:54:18+05:30 IST

డిప్యూటేషన్‌పై తెలంగాణకు వచ్చారు! డిప్యూటేషన్‌ గరిష్ఠ కాల పరిమితి ఏడేళ్లు పూర్తయింది!

తెలంగాణ వీడను.. ఢిల్లీ వెళ్లను!

మీసేవ’ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ రావు వీఆర్‌ఎస్‌?

అందుకు ఇప్పటికే దరఖాస్తు

ఏడేళ్ల కిందట డిప్యూటేషన్‌పై..

ఇప్పటికే కాల పరిమితి పూర్తి

పొడిగింపునకు కేంద్రం నో

ఐటీ సలహాదారు పదవి?

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): డిప్యూటేషన్‌పై తెలంగాణకు వచ్చారు! డిప్యూటేషన్‌ గరిష్ఠ కాల పరిమితి ఏడేళ్లు పూర్తయింది! ఇంకా పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అంది! ఇప్పుడు ఇక తిరిగి ఢిల్లీ వెళ్లడం అనివార్యం! కానీ, తెలంగాణను విడిచి వెళ్లడం ఆయనకు ఇష్టం లేదు! అందుకే, స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎ్‌స)కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయనే.. ఐఆర్‌ఎస్‌ అధికారి జీటీ వెంకటేశ్వర్‌ రావు. ఢిల్లీలో పని చేస్తున్న ఆయన తెలంగాణ వచ్చిన కొత్తల్లో అంటే 2015లో ఐదేళ్లపాటు డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. ఈ గడువు 2020 ఆగస్టులో పూర్తవగా.. ఆయన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం డిప్యూటేషన్‌ను మరో రెండేళ్లపాటు పొడిగించింది. ఒక అధికారి డిప్యూటేషన్‌పై గరిష్ఠంగా ఏడేళ్లకు మించి ఉండకూడదు. అయినా, తన డిప్యూటేషన్‌ కాల పరిమితిని ఇంకా పెంచాలంటూ ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మరింతకాలం ఇక్కడే ఉంచాలని కోరారు. అందుకు కేంద్రం అంగీకరించలేదు. వెంటనే మాతృ శాఖలో రిపోర్ట్‌ చేయాలంటూ గత ఏడాది చివర్లో ఆదేశించింది. కానీ, తెలంగాణను వదిలి వెళ్లడం ఇష్టం లేని ఆయన.. స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఉద్యోగం పోయినా ఈయన సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సైతం నిర్ణయించింది. త్వరలో ఐటీ శాఖ సలహదారుగా నియమించనున్నట్టు తెలిసింది.

ఏడేళ్లుగా ఐటీలో కీలక బాధ్యతలు

ఐఆర్‌ఎస్‌-1990 బ్యాచ్‌ అధికారి వెంకటేశ్వరరావు వివిధ హోదాల్లో కేంద్ర సర్వీసులో పని చేశారు. ఆ సందర్భంగా పన్ను ఎగవేతదారులను గుర్తించేందుకు డేటా మైనింగ్‌ను ఉపయోగించి ఆయన రూపొందించిన విధానంతో ఆదాయం భారీగా పెరిగింది. దాంతో, తెలంగాణ వచ్చిన కొత్తల్లో ఆయన డిప్యూటేషన్‌పై రాష్ట్రానికి వచ్చారు. అప్పటి నుంచి ఐటీ శాఖలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీసేవ (ఈఎ్‌సడీ) కమిషనర్‌, తెలంగాణ స్టేట్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ (టీఎ్‌సటీఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఈ-గవర్నెన్స్‌ స్పెషల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నారు. రెండేళ్ల క్రితం అమల్లోకి వచ్చిన వివాదాస్పద ధరణి పోర్టల్‌ను టీఎ్‌సటీఎస్‌ అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. డేటా మైనింగ్‌పై విశేష అనుభవం ఉన్నందున వివాదాస్పద ధరణి పోర్టల్‌ రూపొందించడం వెనక ఆయన కీలకపాత్ర పోషించారు. క్షేత్రస్థాయి రైతుల సమస్యలను పూర్తిగా అధ్యయనం చేయకుండా కేవలం ప్రభుత్వానికి ఆదాయం ఆర్జించడమే లక్ష్యంగా దానిని రూపొందించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రైతులు, ప్రజల సమస్యలు ఎలా ఉన్నా ధరణి రూపకల్పనతో ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూరుతోంది. ఈ నేపథ్యంలోనేఏ, ఐటీ శాఖలో సలహాదారుగా నియమించేందుకు ప్రభుత్వం గత నెల్లోనే నిర్ణయించింది. అయితే సీఎ్‌సగా ఉన్న సోమేశ్‌ కుమార్‌ అనూహ్య బదిలీతో ఈయన నియామకం కూడా ఆగింది. త్వరలో వెంకటేశ్వర్‌ రావును సలహదారుగా నియమించనుందని తెలిసింది.

Updated Date - 2023-02-21T02:55:56+05:30 IST