DOGS Hungry: వీధి కుక్కలకు ఆకలేస్తుందట.. జర భద్రం
ABN , First Publish Date - 2023-02-22T02:59:38+05:30 IST
‘‘నాన్నా అక్కడ బూచోళ్లున్నారు.. అటు వెళ్లొద్దు’’ అని పిల్లలకు ఇప్పటివరకు అమ్మానాన్న భయం చెప్పేవారు. ఇకపై.. ‘‘బిడ్డా అక్కడ భౌభౌలున్నాయి.. జర భద్రం’’ అని కూడా హెచ్చరించాల్సి ఉంటుంది.
ఆడుకుంటున్న పిల్లలపై అమానుషంగా కుక్కల దాడి
హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఘటనలు
అంబర్‌పేటలో విరుచుకుపడిన నాలుగు కుక్కలు
తండ్రి వచ్చి.. ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే చిన్నారి మృతి
మాంసం దొరక్క కుక్కలు ఆకలితో ఉన్నందునే దాడి..
ఘటనపై హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి వ్యాఖ్యలు
హైదరాబాద్ సిటీ/బర్కత్‌పుర/రాంనగర్, కొత్తపేట, సుజాతనగర్, ఫిబ్రవరి 21(ఆంధ్రజ్యోతి): ‘‘నాన్నా అక్కడ బూచోళ్లున్నారు.. అటు వెళ్లొద్దు’’ అని పిల్లలకు ఇప్పటివరకు అమ్మానాన్న భయం చెప్పేవారు. ఇకపై.. ‘‘బిడ్డా అక్కడ భౌభౌలున్నాయి.. జర భద్రం’’ అని కూడా హెచ్చరించాల్సి ఉంటుంది. ఆడుకుంటున్న పిల్లలపై అంతలా అమానుషంగా వీధి కుక్కలు దాడి చేస్తున్నాయి. హైదరాబాద్ అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తాలో ఆదివారం ఆడుకుంటున్న నాలుగేళ్ల చిన్నారి ప్రదీ్‌పను చుట్టుముట్టి పాశవికంగా కరిచి అతడి ప్రాణాలను బలిగొన్న ఘటన అందరినీ కదిలించి వేయంగా.. రాష్ట్రంలో మరో రెండుచోట్ల సోమవారం నాలుగేళ్ల వయసు పిల్లలపై ఇదే తరహా ఘటనలు జరిగాయి. హైదరాబాద్ కొత్తపేట మారుతీనగర్‌లో వాచ్‌మన్ బాలు కుమారుడు రుషి రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్క వెంబడించి, గాయపరిచింది. బాలుడి కేకలు విన్ని తల్లిదండ్రులు బయటకు వచ్చి గట్టిగా అరవడంతో కుక్క పారిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌లో ఫజియా చేతిని గట్టిగా పట్టుకుని ఈడ్చుకుని వెళ్లే ప్రయత్నం చేశాయి. చుట్టుపక్కలవారు స్పందించి తరమడంతో ప్రాణాపాయం తప్పింది.
పొత్తిళ్ల బిడ్డతో వచ్చి.. పుత్రశోకంతో ఇంటికి
ప్రదీప్ కుటుంబానిది నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి. ప్రదీప్ పుట్టినప్పుడే అతడి తండ్రి గంగాధర్ బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ ఎరుకల బస్తీలో ఉంటూ ఛే నంబర్ చౌరస్తాలోని రెనాల్డ్ కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. గంగాధర్‌కు ప్రదీ్‌పతో పాటు కుమార్తె మేఘన (6) సంతానం. ఆదివారం పిల్లలను తీసుకుని సర్వీసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. మేఘనను పార్కింగ్ సెక్యూరిటీ క్యాబిన్‌లో ఉంచి ప్రదీ్‌పను సర్వీసింగ్ సెంటర్‌లోకి తీసుకెళ్లాడు. అయితే, బాలుడు కొద్దిసేపటికి అక్క వద్దకు వస్తుండగా కార్ల కింద ఉన్న నాలుగు కుక్కలు దాడి చేశాయి. పరుగెత్తబోయి కాలుజారి పడిపోయిన అతడిని తల, చేతులు, కాళ్లు, మెడ, పొట్ట భాగంలో తీవ్రంగా కరిచాయి. చెయ్యి ఒకటి, కాలు మరో కుక్క పట్టి లాగాయి. మేఘన తండ్రి గంగాధర్‌కు చెప్పగా అతడు వచ్చేవరకు దాడి చేస్తూనే ఉన్నాయి. ప్రదీ్‌పను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు చెప్పారు. కార్ల సర్వీసింగ్ సెంటర్ నిర్వాహకులు రూ.50 వేలు ఇవ్వడంతో గంగాధర్ కుటుంబం ఇందల్‌వాయికి వెళ్లి.. ప్రదీప్ అంత్యక్రియలు నిర్వహించింది.
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. అంబర్‌పేట పోలీసులకు తెలిసినా కప్పిపుచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే డివిజన్ తులసీరాంనగర్ లంకలో ఇటీవల ఆకాష్(4)నీ వీధి కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. కాగా, ప్రదీప్ కుటుంబానికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ఎంపీ వీహెచ్ డిమాండ్ చేశారు. మంగళవారం కార్ల సర్వీసింగ్ సెంటర్‌లో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి ఈ నెల 20 రోజుల్లో జంట నగరాలు, వివిధ జిల్లాల నుంచి 1,500 కుక్క కాటు కేసులు వచ్చాయి. వీరిలో 12 ఏళ్ల లోపు పిల్లలు 500 మంది ఉండడం గమనార్హం. ఈ నెల 13న ఏకంగా 120 మంది బాధితులు చికిత్సకు వచ్చారు.
కుక్కలకు మాంసం దొరక్కనే..
ప్రదీప్ మృతిపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విచారణకు ఆదేశించారు. ప్రదీ్‌పపై దాడి చేసిన కుక్కలకు ఓ మహిళా రోజూ మాంసం పెట్టేవారని, రెండ్రోజులుగా ఆమె లేకపోవడంతో వాటికి ఆహారం దొరకలేదని పేర్కొన్నారు. ఆ ఆకలితోనే దాడికి చేసి ఉండొచ్చని అన్నారు. మంగళవారం వెటర్నరీ అధికారులతో మేయర్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ప్రదీప్ కుటుంబానికి జీహెచ్‌ఎంసీ తరఫున సాయం అందిస్తామన్నారు.
బాలుడి మృతి బాధాకరం: మంత్రి కేటీఆర్
కుక్కల దాడిలో ప్రదీప్ మృతి విషాదకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మునిసిపాలిటీల్లో వీధి కుక్కల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.