Hyderabad City: అలజడి సృష్టించిన ముఠా నగరం దాటేసింది
ABN , First Publish Date - 2023-01-09T00:43:51+05:30 IST
నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి అలజడి సృష్టించిన ముఠా నగరం దాటేసింది. బెంగళూరు నుంచి నగరానికి చేరుకున్న ఆ దొంగలు
హైదరాబాద్ సిటీ: నగరంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడి అలజడి సృష్టించిన ముఠా నగరం దాటేసింది. బెంగళూరు నుంచి నగరానికి చేరుకున్న ఆ దొంగలు ఆబిడ్స్ పీఎస్ పరిధిలో ఉన్న శ్రీనివాస లాడ్జి మేనేజర్ దత్తు బైక్‌ను తస్కరించారు. ఆ బైక్‌పైనే తిరుగుతూ.. స్నాచింగ్‌లు చేశారు. చివరి స్నాచింగ్ రాంగోపాల్‌పేట్ పీఎస్ పరిధిలో చేసి అక్కడే ఓ బేకరీ వద్ద వాహనాన్ని వదిలి పారిపోయారు.
చిక్కినా.. సొత్తు పట్టుబడకుండా..
నలుగురు సభ్యుల ఉత్తరప్రదేశ్ ముఠా స్నాచింగ్‌లు చేయాలని పథకం ప్రకారం నగరానికి వచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ముఠాలో ఇద్దరు స్నాచింగ్‌లు చేయగా మరో ఇద్దరు సాధారణ పౌరుల్లా తెరవెనుక ఉండి సొత్తును దాటించేందుకు పథకం పన్నారని తెలిసింది. ఒకవేళ పారిపోతున్న సమయంలో స్నాచింగ్ చేసిన వారిని పోలీసులు పట్టుకున్నా.. సొత్తు పట్టుబడకుండా ఉండేలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు తేలింది.
యూపీ చేరలేదు
నగరం నుంచి తప్పించుకున్న స్నాచర్లు యూపీ చేరుకుని ఉంటారని పోలీసులు అనుమానించి అక్కడ తనిఖీలు నిర్వహించారు. కానీ, దొంగలు యూపీలోని వారి ఇళ్లకు కూడా చేరలేదని తెలిసింది. స్నాచింగ్ చేసిన తీరు చూస్తే వారు ప్రొఫెషనల్ నేరస్థులేనని, గతంలో నేర చరిత్ర ఉండటంతోనే నగరం నుంచి తప్పించుకోగలిగారని.. ఓ అధికారి చెప్పారు.
ఆటోలు మార్చి..
ఎంత పెద్ద నేరస్థులైనా సాంకేతిక ఆధారాలతో ఇట్టే దొరుకుపోతున్నా.. స్నాచర్ల జాడ తెలియలేదంటే, నిందితులు సీసీ కెమెరాలను పసిగట్టి జాగ్రత్తలు తీసుకున్నారనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేశారు. బైక్ వదిలిన తర్వాత వారు ఆటోలో సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లిన వారు ఆటోను కెమెరాలు లేని చోట వదిలేసి ఉంటారని స్పష్టమైంది. ఆటో మధ్యలోనే వదిలేసి కాలినడకనో, మరో ఆటోలో రూట్ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. ఎక్కడెక్కడ కెమెరాల గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి వెళ్లే రూట్‌లపై అధికారులు ఫోకస్ చేశారు. రైలు ద్వారా కాకుండా... ఇతర రూట్‌ల ద్వారా నగరం దాటేసి ఉంటారని పోలీసులు పసిగట్టారు. అయితే, కెమెరాల ఆధారంగా వారి ఫొటోలు సేకరించిన పోలీసులు.. వేలిముద్రలు, వారి పాత నేర చరిత్రతో పాటు ఇతర సాంకేతికత ఆధారంగా త్వరలోనే పట్టుకునే అవకాశముంది. ఇదే ముఠా 2016లో ఎల్బీనగర్ పరిధిలో వరుసగా 16 స్నాచింగ్‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.