టీయూలో తనిఖీల హల్‌చల్
ABN , First Publish Date - 2023-06-07T03:51:13+05:30 IST
నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సర్కారు ఎట్టకేలకు స్పందించింది.
డిచ్‌పల్లి/భిక్కనూరు, జూన్ 6: నిజామాబాద్ జిల్లాలోని తెలంగాణ యూనివర్సిటీ (టీయూ)లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సర్కారు ఎట్టకేలకు స్పందించింది. మంగళవారం ఏకకాలంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. సోదాలు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగాయి. వైస్ చాన్స్‌లర్ రవీందర్ గుప్తా తీసుకున్న నిర్ణయాలు, ఆర్థిక లావాదేవీలు, అక్రమంగా సామగ్రి కొనుగోళ్లు, తదితర అంశాలను రికార్డు చేసుకున్నారు. అధికారులు 15 మంది మూడు బృందాలుగా పరిపాలనాధికారి కార్యాలయం, వీసీ చాంబర్, ఎస్టాబ్లి్‌షమెంట్ కార్యాలయం, అకౌంట్స్, ఇంజనీరింగ్ విభాగాల్లో తనిఖీ చేపట్టారు. ఆరోపణలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రిజిసా్ట్రర్ కనకయ్య అనుమతితో అన్ని విభాగాల్లోని కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను సీజ్ చేశారు. రిజిసా్ట్రర్ 2 గంటల పాటు విజిలెన్స్ అధికారులతోనే ఉన్నారు.
టోల్‌ప్లాజా వద్ద వీసీ కారు తనిఖీ
తనిఖీల సమయానికి 20 నిమిషాల ముందే వీసీ రవీందర్‌గుప్తా హైదరాబాద్ బయలుదేరారు. ఆయన వాహనాన్ని కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్‌ప్లాజా వద్ద విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అడ్డుకున్నారు. రికార్డులను పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు.