మహారాష్ట్రకు నీళ్లు ఎలా ఇస్తారు?

ABN , First Publish Date - 2023-02-07T03:49:43+05:30 IST

మహారాష్ట్రకు శ్రీరాంసాగర్‌ నుంచి గోదావరి జలాలను ఇచ్చే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు.

మహారాష్ట్రకు నీళ్లు ఎలా ఇస్తారు?

ఎస్సార్‌ఎస్పీ కేసీఆర్‌ సొంత ఆస్తి కాదు: షర్మిల

హనుమకొండ సిటీ, ఫిబ్రవరి 6: మహారాష్ట్రకు శ్రీరాంసాగర్‌ నుంచి గోదావరి జలాలను ఇచ్చే అధికారం సీఎం కేసీఆర్‌కు ఎక్కడిదని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రి సొంత ఆస్తి కాదని స్పష్టం చేశారు. దీనిపై తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల సోమవారం హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. గోదావరి నదీ జలాల విషయంలో మహారాష్ట్ర సర్కారు తీరుతో తెలంగాణ ఇప్పటికే నష్టపోయిందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత గల ముఖ్యమంత్రిగా వ్యవహరించాల్సిన కేసీఆర్‌.. మహారాష్ట్రకు ఎలా వత్తాసు పలుకుతారని నిలదీశారు. కేసీఆర్‌ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర చేసిన ద్రోహం కంటే కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలే తెలంగాణ రైతాంగాన్ని కలిచివేశాయన్నారు. తెలంగాణ రైతులను వంచించడమేనా కేసీఆర్‌ వైఖరి? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడం చాలదన్నట్లు బీఆర్‌ఎస్‌ పేరిట దేశం మీదపడ్డారని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-02-07T03:49:44+05:30 IST