యాసంగి ధాన్యం సేకరణ ఎలా?
ABN , First Publish Date - 2023-02-21T04:14:27+05:30 IST
యాసంగి ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.
80 లక్షల టన్నులు కొనాల్సి వస్తుందని అంచనా!
కేంద్రం బాయిల్డ్ రైస్‌కు అనుమతివ్వకపోతే ఎలా?
1న కేంద్ర మంత్రి గోయల్ మీటింగ్.. రాష్ట్రానికీ ఆహ్వానం
అధికారులతో మంత్రి గంగుల సమీక్ష.. 28న ఢిల్లీకి
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): యాసంగి ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఏప్రిల్ నుంచి యాసంగి వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యానికి అనుమతి ఇస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మార్చి 1న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కార్యాలయం నుంచి ఆహ్వానం వచ్చింది. అయితే ఆలోపు సీఎం కేసీఆర్‌తో భేటీ కావాలని, ఆయన ఆదేశాలకు అనుగుణంగా ఢిల్లీలో తెలంగాణ వాదనను వినిపించాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నిర్ణయించినట్లు సమాచారం. నేడో, రేపో సీఎం కేసీఆర్‌ను కలిసి యాసంగి ధాన్యం సేకరణ నివేదికను సమర్పించనున్నారు. ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలో రైతులు వరి సాగు చేశారు. ఈ సీజన్‌లో 105 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 25 లక్షల టన్నుల ధాన్యాన్ని ట్రేడర్లు, రైస్‌మిల్లర్లు కొనుగోలు చేసినా.. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల శాఖ అధికారులు నివేదిక రూపొందించారు. అయితే కేంద్రం నుంచి అనుమతి రాకపోతే.. ధాన్యం కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారుతుంది. 80 లక్షల టన్నుల ధాన్యా న్ని కొనుగోలు చేయడానికి రూ.1,648 కోట్లు అవసరమవుతాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. గతేడాదికి, ఇప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతరం మరింత పెరిగింది. పైగా ఇది ఎన్నికల సంవత్సరం. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ధాన్యం సేకరణ చేపట్టకపోతే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎన్నికల ఏడాది కావడంతో రెండు పార్టీలకూ ఇది కీలకమే! దేశంలో బాయిల్డ్ రైస్ డిమాండ్ ఏడాదికి 34 లక్షల మెట్రిక్ టన్నులు ఉందని, పలు రాష్ట్రాల్లో దిగుబడి తగ్గుతున్న నేపథ్యంలో తెలంగాణలో ఉత్పత్తి చేసే బాయుల్డ్ రైస్ అవసరం చాలా ఉంటుందని, లేకపోతే కేంద్ర పీడీఎస్ పథకానికి కూడా ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుందని మంత్రి గంగుల అభిప్రాయం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రితో భేటీ తర్వాతే నిర్ణయం
కేంద్రం ఆహ్వానం మేరకు మంత్రి గంగుల.. ఈ నెల 28న ఢిల్లీ వెళ్తున్నా రు. ఈ క్రమంలో యాసంగి ధాన్యం సేకరణపై సోమవారం పౌరసరఫరాల శాఖతో పాటు కార్పొరేషన్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కేంద్రం అనుమతిస్తే ప్రొక్యూర్మెంట్ ఎలా చేయాలి? ఒకవేళ బాయిల్డ్ రైస్‌కు అనుమతివ్వకపోతే ఏంచేయాలి? అనే అంశంపై సీఎం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు.