ఇల్లు.. భారమే!

ABN , First Publish Date - 2023-02-02T03:11:32+05:30 IST

ఇంటి నిర్మాణం భారంగానే మారనుంది. కొవిడ్‌ తర్వాత గణనీయంగా పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలు తగ్గేలా తాజా బడ్జెట్‌లో చర్యలేవీ చేపట్టలేదు.

ఇల్లు.. భారమే!

స్టీల్‌, సిమెంట్‌ ధరలన్నీపైపైకే..

బడ్జెట్‌లో వాటిపై తగ్గని సుంకాలు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి1 (ఆంధ్రజ్యోతి): ఇంటి నిర్మాణం భారంగానే మారనుంది. కొవిడ్‌ తర్వాత గణనీయంగా పెరిగిన స్టీల్‌, సిమెంట్‌ ధరలు తగ్గేలా తాజా బడ్జెట్‌లో చర్యలేవీ చేపట్టలేదు. ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో స్టీల్‌ ధరలు 30శాతం నుంచి 40శాతం పెరిగాయి. కానీ దిగిరావడం లేదు. ఈ నేపథ్యంలో స్టీల్‌, సిమెంట్‌లపై ఉన్న సుంకాలు తగ్గించి ఉపశమనం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు. దీంతో సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే పేద, మధ్య తరగతి ప్రజలకు నిర్మాణ సామగ్రి ధరలు భారంగానే ఉన్నాయి. కేంద్ర బడ్జెట్‌తో కొంత మేరకు స్టీల్‌, సిమెంట్‌తోపాటు ఇతర నిర్మాణ సామగ్రి ధరలు తగ్గవచ్చని ఎదురుచూసిన మధ్య తరగతి ప్రజానీకానికి, బిల్డర్లు, డెవలపర్లకు నిరాశే ఎదురైంది. అయితే పీఎం ఆవా్‌సయోజన కింద కేంద్ర ప్రభుత్వం నిధులు పెంచినప్పటికీ సాధారణ ప్రజలు ఆ పథకాన్ని వినియోగించుకోవడానికి అవకాశాలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొవిడ్‌ తర్వాత భవన నిర్మాణంలో ప్రధానమైన స్టీల్‌, సిమెంట్‌తోపాటు కంకర, మార్బుల్స్‌, పైపులు తదితర 78 రకాల వస్తువుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇక హైదరాబాద్‌లో ఏదైనా అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ కొనుగోలు చేయాలంటే అందుబాటు ధరలో దొరకని పరిస్థితి. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం వల్ల ఫ్లాట్‌ల ధరలు కూడా 20-30శాతం మేర పెరిగాయి. ఏడాదిన్నర క్రితం రూ.35 నుంచి రూ.40మధ్య ఉన్న కిలో స్టీల్‌ ధర రూ.85 నుంచి రూ.90 పలుకుతోంది. గతంలో రూ.300లోపు ఉన్న బస్తా సిమెంట్‌ ధర ప్రస్తుతం రూ.480కు చేరింది. ఇటుక ధర రూ.3 నుంచి రూ.5 వరకు పెరగ్గా, కంకర టిప్పర్ల సైజునుబట్టి రూ.500 నుంచి రూ.1000 మేర పెరిగింది.

Updated Date - 2023-02-02T03:11:33+05:30 IST